KTR: తెలంగాణలో ఎన్నికలు వాయిదా పడతాయా..? కేటీఆర్ ఏం చెప్పారు..?
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10 లోపు ఎన్నికల షెడ్యూల్ రావాలి. అనంతరం నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరగాలి. అయితే, షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ రాకుంటే తెలంగాణలో ఈ ఏడాది ఎన్నికలు జరగడం కష్టమే అన్నారు.
KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎన్నికలు జరగకపోవచ్చని, వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, ప్రగతి భవన్‌లో మంగళవారం కేటీఆర్.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో అక్టోబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వస్తే సరి.. లేదంటే ఎన్నికలు వచ్చే ఏడాదే జరుగుతాయన్నారు.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10 లోపు ఎన్నికల షెడ్యూల్ రావాలి. అనంతరం నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరగాలి. అయితే, షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ రాకుంటే తెలంగాణలో ఈ ఏడాది ఎన్నికలు జరగడం కష్టమే అన్నారు. త్వరలో జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల తర్వాత ఈ అంశంపై స్పష్టత వస్తుందని కేటీఆర్ చెప్పారు. ఇప్పట్లో షెడ్యూల్ రాకుంటే వచ్చే ఏడాది ఏపీతోపాటు, లోక్‌సభకు, తెలంగాణకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయన్నారు. “ఐదు రాష్ట్రాల ఎన్నికలపై మోదీ భయపడుతున్నారు. ఈ రాష్ట్రాల ఎన్నికల్లో మోదీ ఓడిపోతే.. ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై పడుతుందని మోదీ అనుకుంటున్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్ని నీరుగార్చి, జమిలి ఎన్నికలకు ప్రయత్నిస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఒక మధ్యప్రదేశ్‌లోనే బీజేపీకి అవకాశం ఉంది. మిగతా రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం కష్టమే. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్‌కు లాభమే. తెలంగాణ ప్రజలు మా పార్టీవైపే ఉన్నారు. అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత సానుకూలత ఇంకా పెరిగింది.
మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఉద్యమంలో పాల్గొనని రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిని తెలంగాణ ప్రజలు నమ్మరు. వీళ్ల వెనుక సీమాంధ్రులు ఉన్నారు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో జమిలి ఎన్నికల కోసం ప్రయత్నిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇందుకోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిందనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడుతాయి. వచ్చే ఏడాదే ఎన్నికలు జరుగుతాయి.