TELANGANA ELECTIONS: ఈ వారమే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్.. డిసెంబర్‌లో ఎన్నికలు..!
తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికలకు ఈ నెల 8 లేదా 10 తేదీల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
TELANGANA ELECTIONS: తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ ఈ వారమే వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికలకు ఈ నెల 8 లేదా 10 తేదీల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి కాకుండా, దశలవారీగా నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. అందుకే నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకూ ఆయా రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించబోతుంది. ఛత్తీస్‌గఢ్ మినహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణలో ఎన్నికల్ని ఒకే విడతలో నిర్వహించబోతుంది. ఆయా రాష్ట్రాలకు సంబంధించి 2018 అసెంబ్లీ ఎన్నికల్ని కూడా ఇలాగే నిర్వహించింది. ఛత్తీస్‌గఢ్ నక్సల్స్ ప్రభావం ఉన్న సమస్యాత్మక ప్రాంతం కావడంతో అక్కడ రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. ఐదు రాష్ట్రాల్లో మిజోరం అసెంబ్లీ గడువు వచ్చే డిసెంబర్ 17తో ముగుస్తుంది.
మిగతా రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీల గడువు వచ్చే ఏడాది జనవరిలో ముగియనుంది. మిజోరంలో బీజేపీ మిత్రపక్షమైన మిజోరం నేషనల్ ఫ్రంట్ ప్రస్తుతం అధికారంలో ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. డిసెంబర్ మొదటివారంలోపు ఎన్నికలు పూర్తవుతాయి. డిసెంబర్ రెండో వారంలో ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. వచ్చే జనవరిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. ఎన్నికల కోసం తెలంగాణలో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.