YCP Vizag Tension: ఎవరు నిల్చున్నా ఓడిపోవడమే.. వైసీపీకి విశాఖ టెన్షన్ పట్టుకుందా ?
విశాఖ.. రాజకీయానికి హార్ట్ ఇదే.. హాట్‌టాపిక్ ఇదే ! వేగంగా మారుతున్న పరిణామాలు.. సాగరతీరంలో రాజకీయాన్ని మరింత రంజుగా మారుతున్నాయ్. ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నా.. పార్టీలన్నీ ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయ్. టీడీపీ అయితే రెండాకులు ఎక్కువే చదివినట్లు కనిపిస్తోంది ఇక్కడ ! ఇప్పటికే యుద్ధం మొదలుపెట్టిన పార్టీ ఒకటైతే.. సక్సెస్ స్పీచ్ సిద్ధం చేసుకున్న పార్టీ మరొకటి ! రాజధాని ప్రకటన తర్వాత.. ఏపీ రాజకీయానికి అనధికారిక కేంద్రంగా మారిపోయింది వైజాగ్.
టీడీపీ, వైసీపీ.. విశాఖ పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందుకే ! రాజధాని రగడ అక్కడే.. ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారం మిగిల్చిన రాజకీయ ఉక్కపోత అక్కడే.. అలల హోరుకు మించి అక్కడి రాజకీయం రీసౌండ్ ఇస్తోంది. విశాఖ జిల్లా రాజకీయాలు అంటే.. ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్‌వేలాంటిది. ఇక్కడ సత్తా చాటితే.. ఉత్తరాంధ్ర అంతా హవా తమదే అని పార్టీలు ఫీల్ అవుతాయ్. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది.
2019 వేరు ఇప్పుడు వేరు అన్నట్లుగా విశాఖలో రాజకీయం మారింది. నిజానికి గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం టీడీపీకి షాక్ తగిలినా.. విశాఖలో మాత్రం కాస్త పర్వాలేదు అనిపించే ఫలితాలు వచ్చాయ్. విశాఖ పార్లమెంట్ స్థానంలో నాలుగు చోట్ల సైకిల్ పార్టీ విజయం సాధించింది. గత ఎన్నికలతో కంపేర్ చేస్తే.. ఈ మూడున్నరేళ్లలో టీడీపీ బలం పుంజుకుంది. పైగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం.. సైకిల్ పార్టీలో మరింత జోష్ నింపింది. టీడీపీ సంగతి ఎలా ఉన్నా.. వైసీపీ పరిస్థితి మాత్రం విశాఖ పార్లమెంట్‌లో వీక్ అవుతున్న పరిస్థితి. భూవివాదాలు ఒకవైపు.. పార్టీలో అసంతృప్తులు మరోవైపు.. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి మధ్య ఆధిపత్య పోరు ఇంకోవైపు.. రాజధాని అంటూ ఊరిస్తున్న సీఎం మరోవైపు.. ఇలాంటి పరిణామాల మధ్య విశాఖలో వైసీపీ రోజురోజుకు వీక్ అవుతోంది.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణలాంటి వ్యక్తిని ఎందుకు ఓడించుకున్నామా అని జనాలు తెగ ఫీలవుతున్నారంటే.. వైసీపీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ! దీంతో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా.. పార్లమెంట్ వదిలి అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అధిష్టానం అంగీకరిస్తే.. విశాఖ తూర్పు నుంచి పోటీ చేస్తానని విన్నపాలు వినిపిస్తున్నారు. సిట్టింగ్ సైడ్ అవుతున్నారు.. లోకల్ నేతలు భయపడుతున్నారు.
దీంతో బయటి నుంచి ఎవరో ఒకరు బకరాను తీసుకువచ్చి.. విశాఖ లోక్‌సభ బరిలో దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తుందనే టాక్ నడుస్తోంది. అప్పటికీ వీలు కాకపోతే.. సామాజికవర్గాలను జగన్ నమ్ముకునేందుకు సిద్ధం అవుతున్నారు. బీసీ మహిళకు కేటాయించే చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల ప్రకారం.. విశాఖలో ఇప్పుడు ఎవరు వైసీపీ నుంచి బరిలో నిలిచినా.. ఓడిపోవడం ఖాయం. వైసీపీ సర్కార్ నిర్ణయాలు, తీరు.. అక్కడ పరిస్థితులను వ్యతిరేకంగా మార్చేసింది. దీనికితోడు టీడీపీ బలం పుంజుకుంటోంది. దీంతో సాగరతీరంలో వైసీపీ తరఫున బరిలో నిలిచే సాహసవీరుడు ఎవరో అంటూ కొత్త చర్చ మొదలైంది ఏపీ రాజకీయాల్లో !