Etela Rajender: బీజేపీకి గుడ్‌బై చెప్పనున్న ఈటల, వివేకా..? మరికొందరు నేతలు కూడా లైన్లోనే.. కమలానికి షాక్ తప్పదా?

కొంతకాలం క్రితం బీజేపీలో చేరిన నేతలు ఆ పార్టీని వీడి.. కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయినట్లు తాజా కబురు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డితోపాటు.. మాజీ ఎంపీ వివేక్ కూడా తిరిగి ‌కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు సమాచారం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 31, 2023 | 03:56 PMLast Updated on: May 31, 2023 | 3:56 PM

Etela Rajender And Other Bjp Leaders Are Joining In Congress

Etela Rajender: కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ తెలంగాణ మీద పడినట్లుంది. అక్కడ కాంగ్రెస్ విజయం.. బీజేపీ పరాజయంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. బీజేపీలో కీలకంగా ఉన్న నేతలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. కొంతకాలం క్రితం బీజేపీలో చేరిన నేతలు ఆ పార్టీని వీడి.. కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయినట్లు తాజా కబురు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డితోపాటు.. మాజీ ఎంపీ వివేక్ కూడా తిరిగి ‌కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు సమాచారం. ఈ నలుగురిలో ఈటల ఒక్కరే బీఆర్ఎస్ నుంచి వచ్చాడు. మిగతా ముగ్గురూ గతంలో కాంగ్రెస్‌కు చెందిన నేతలే. వీళ్లంతా బీజేపీలో ఇమడలేకపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ నలుగురూ త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలకు ముందు తెలంగాణ బీజేపీలో జోష్ కనిపించింది. బీఆర్ఎస్‌ను ఎదుర్కోగల సత్తా తమకే ఉందని చెప్పుకొంది. రాబోయే ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీనే అని చెప్పింది. కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితం అంటూ ప్రగల్భాలు పలికింది. అయితే, ఒక్క నెలలో పరిస్థితి మారిపోయింది. కర్ణాటక ఫలితాలతో బీజేపీ ఇమేజ్ దిగజారింది. కాంగ్రెస్ పై చేయి సాధించింది. తెలంగాణపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది. బీజేపీ శ్రేణుల్లో నిరాశ కనిపిస్తోంది. కాంగ్రెస్ శ్రేణులు జోష్‌తో ముందుకెళ్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణలో మూడో స్థానానికే పరిమితం. రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్‌గా ఉండబోతున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ నేతలే పరోక్షంగా చెబుతున్నారు. దీంతో బీజేపీతో తమకు భవిష్యత్ లేదని గ్రహించిన నేతలు నెమ్మదిగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వీరిలో బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. కొంతకాలంగా ఈటల బీజేపీలో అసంతృప్తితో ఉన్నారు.

ముఖ్యంగా ఆయనకు, తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మధ్య విబేధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో ఇమడలేకపోతున్నారు. అలాగని బీఆర్ఎస్ వైపు వెళ్లలేడు. అందుకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు తక్కువే అనే అర్థం వచ్చేలా ఈటల ఇటీవల వ్యాఖ్యానించారు. ఈటలతోపాటు మాజీ ఎంపీ వివేక్ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నాడు. చాలాకాలంగా ఆయన బీజేపీలోనే ఉన్నా.. సరైన గుర్తింపులేదు. పైగా ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి వెంకటస్వామి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వివేక్ కాంగ్రెస్ వైపు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

గత ఏడాది బీజేపీలో చేరి, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో వీరికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. బండి సంజయ్ వైఖరి కూడా సానుకూలంగా లేదు. దీంతో నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. అందుకే వీళ్లు ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. తమ సీట్లకు హామీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అన్నీ పరిశీలించిన తర్వాత వీరి చేరికపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. తమ సీట్ల విషయంలో హామీతోపాటు, ఇతర డిమాండ్ల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి సానుకూల నిర్ణయం వస్తే వీళ్లంతా త్వరలోనే బీజేపీకి బైబై చెప్పి కాంగ్రెస్‌లో చేరడం ఖాయం. ఇక ఇప్పటికే పొంగులేటి, జూపల్లి కూడా దాదాపు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

బీజేపీకన్నా.. కాంగ్రెస్ అయితేనే తమ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వీళ్లు భావిస్తున్నారు. ఈ నేతలంగా కాంగ్రెస్ గూటికి చేరితే ఆ పార్టీ మరింత బలపడుతుంది. ఇక బీజేపీ తెలంగాణలో ఆశలు వదిలేసుకోవాల్సిందే. మరోవైపు బీఆర్ఎస్‌లో అసంతృప్త నేతలు, సీట్లు రాని వాళ్లు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.