Etela Rajender: ఈటలకు భద్రత కల్పించిన కేంద్రం.. ఆరా తీసిన తెలంగాణ ప్రభుత్వం
ఒకవైపు ఈటల పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంటే.. ఆయన సొంత నియోజకవర్గానికి చెందిన ప్రత్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఈటల హత్యకు కుట్ర పన్నారని ఈటల జమున ఆరోపించారు. ఈటలను హత్య చేసేందుకు రూ.20 కోట్ల సుపారి ఇచ్చి ప్లాన్ చేస్తున్నట్లు జమున ఆరోపించారు.

Etela Rajender: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ప్రాణహాని ఉందని ఆయన భార్య జమున చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈటలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించింది. ఈటలకు వై కేటగిరి భద్రత కల్పించింది కేంద్ర హోం శాఖ. అంటే 8 ప్లస్ 8 సిబ్బందితో ఈటలకు భద్రత ఉంటుంది. ఇప్పటికే కొనసాగుతున్న 2 ప్లస్ 2 భద్రతకు ఇది అదనం అని బీజేపీ తెలిపింది. కొంతకాలంగా ఈటల రాజేందర్‌కు సంబంధించిన రాజకీయ అంశం చర్చకు వస్తోంది. ఒకవైపు ఈటల పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంటే.. ఆయన సొంత నియోజకవర్గానికి చెందిన ప్రత్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఈటల హత్యకు కుట్ర పన్నారని ఈటల జమున ఆరోపించారు. ఈటలను హత్య చేసేందుకు రూ.20 కోట్ల సుపారి ఇచ్చి ప్లాన్ చేస్తున్నట్లు జమున ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతోందని విమర్శించారు. గతంలో కూడా ఉద్యమకారులపై కౌశిక్ రెడ్డి దాడులు చేశాడని జమున ఆరోపించారు. ఈ విషయంలో తనకు బెదిరింపులు వస్తున్నాయని, తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతోందన్నారు. దీంతో ఈటల హత్య కుట్ర అంశం రాజకీయంగా సంచలనం కలిగిస్తోంది.
స్పందించిన తెలంగాణ ప్రభుత్వం
తాజా ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే ఈటల విషయంలో ఆరోపణలు ఎదుర్కుంటోంది ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. దీంతో ఈటల భద్రతపై సమీక్ష జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్పందించిన తెలంగాణ డీజీపీ.. వెంటనే మేడ్చల్ డీసీపీ సందీప్ రావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఈటల భద్రత అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. దీంతో సందీప్ రావు ఈటల ఇంటికి వెళ్లారు. ఆ సమయానికి ఈటల అక్కడ లేరు. బయటకు వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్పడంతో సందీప్ రావు తిరిగి వెళ్లిపోయారు. మళ్లీ ఈటల వచ్చిన తర్వాత వచ్చి వివరాలు సేకరిస్తామన్నారు. తదుపరి డీజీపీకి నివేదిక సమర్పిస్తామని చెప్పారు.
కౌశిక్ రెడ్డి వర్సెస్ ఈటల
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన ఈటల, పాడి కౌశిక్ రెడ్డి మధ్య రాజకీయ పోరు వ్యక్తిగత విమర్శలు, హత్య ఆరోపణల వరకు వెళ్లింది. తమను చంపేందుకు కౌశిక్ రెడ్డి కుట్ర పన్నారని, తమ కుటుంబంలోంచి ఒక్క రక్తపుబొట్టు చిందినా దానికి కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు ఈటల రాజేందర్ భార్య జమున. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసి, హుజురాబాద్ ప్రజల మీదకు వదిలారని, కౌశిక్ రెడ్డి నియోజకవర్గ ప్రజలు, మహిళలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని జమున ఆరోపించారు. తనకు కొన్ని నెలలుగా బెదిరింపులు వస్తున్నాయని ఈటల రాజేందర్ కూడా అన్నారు. నయీమ్‌కే భయపడలేదని, అలాంటిది తాను ఎవరికీ భయపడను అని ఈటల అన్నారు. మరోవైపు ఈటల ఆరోపణలను కౌశిక్ రెడ్డి ఖండించారు. ఈటల హత్యకు కుట్ర పన్నాను అనడం పెద్ద జోక్ అని, ఈ అంశంపై హుజురాబాద్‌లో బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఒకప్పుడు ఇల్లు కూడా లేని ఈటల ఇప్పుడు కోట్ల రూపాయలతో ఇల్లు ఎలా నిర్మించుకున్నారు అని ప్రశ్నించారు. హుజురాబాద్‌లో ఓడిపోతాననే ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.