ఇంత జరిగినా…. కవితపై సానుభూతి రాదేం?
ఢిల్లీ లిక్కర్ కేసులో ఐదు నెలలకు పైగా తీహారు జైల్లో ఉన్నప్పటికీ కవితపై కానీ, కెసిఆర్ కుటుంబం పై కానీ జనంలో సానుభూతి కనిపించడం లేదు. బయటికి రాగానే కవిత,బావురు మని ఏడ్చినప్పటికీ , ఆ కన్నీళ్లు చూసి తెలంగాణ జనం....
ఢిల్లీ లిక్కర్ కేసులో ఐదు నెలలకు పైగా తీహారు జైల్లో ఉన్నప్పటికీ కవితపై కానీ, కెసిఆర్ కుటుంబం పై కానీ జనంలో సానుభూతి కనిపించడం లేదు. బయటికి రాగానే కవిత,బావురు మని ఏడ్చినప్పటికీ , ఆ కన్నీళ్లు చూసి తెలంగాణ జనం…. ఇసుమంతైనా అయ్యో అన్న వాళ్ళు లేరు. దీని కారణం ఏమిటి? కవిత విషయంలో తెలంగాణ ప్రజానీకం ఎందుకు అంత కఠినంగా ఉన్నారు. ఇది కవిత విషయంలో మాత్రమేనా మొత్తం కెసిఆర్ కుటుంబాన్ని జనం ఇంకా అసహ్యించుకుంటూనే ఉన్నారా?
తెలిసినవాళ్లైనా…. తెలియని వాళ్లు అయినా, ఎవరైనా బాధపడుతుంటే సహజంగా మనకు కూడా బాధనిపిస్తుంది. అవతల వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే… మనకి అంతో ఇంతో కళ్ళు చమ్మర్చుతాయి. కానీ కెసిఆర్ కుమార్తె కవిత విషయంలో మాత్రం తెలంగాణలో ఆ మూల నుంచి ఈ మూల వరకు ఏ ఒక్కరిలోనూ సానుభూతి కనిపించలేదు. కనీసం బి ఆర్ఎస్ క్యాడర్లో కూడా ఎక్కడ ఆ ఉత్సాహం, తిరిగి తమ నాయకురాలు వచ్చిందని ఆనందం కనిపించడం లేదు. కెసిఆర్, కేటీఆర్ చుట్టూ ఉండే చిడతల బ్యాచ్ మాత్రం కవితనీ చూసి ఏదో భావోద్వేగానికి గురైనట్లు కాసేపు నటించారు అంతే. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది అని ఇప్పటికైనా కెసిఆర్ కుటుంబం స్వీయ సమీక్ష చేసుకోవాలి.
జైల్లోంచి బయటికి రాగానే జై తెలంగాణ అని కవిత మూడుసార్లు బిక్కర గా అరిచారు. ఇక్కడే పదేపదే కేసీఆర్ కుటుంబ సభ్యులు పప్పులో కాలేస్తున్నారూ. వీళ్లు తప్పు చేసి జైలుకెల్లారు. వీళ్లు కోట్ల రూపాయలు అడ్డంగా తిని, నేరాలు చేసి జైలుకి వెళ్లారు. ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళలేదు. అలాగే ఇప్పుడు కవితకు వచ్చింది బెయిల్ మాత్రమే. నిర్దోషిగా తీర్పు కాదు. అందువలన చేసిన తప్పులకి తలవంచుకుని వెళ్లకుండా తమ తప్పులకు తెలంగాణ నినాదాన్ని ట్యాగ్ లైన్ గా వాడేస్తున్నారు కేసీఆర్ కుటుంబం. అక్కడే కెసిఆర్ కుటుంబం పూర్తిగా దెబ్బతింటుంది. తెలంగాణ నినాదం తప్పుడు పనులు చేసే వాళ్లకు, జైలుకెళ్లే వాళ్లకు ఊత పదం లా ఉండకూడదు.
కెసిఆర్ కుటుంబ సభ్యులు దీనిని మర్చిపోయి కేవలం తమ కుటుంబ ఆస్తులు రక్షించుకోవడానికి, తమను రక్షించుకోవడానికి జై తెలంగాణ నినాదాన్ని ఎక్కడబడితే అక్కడ అడ్డంగా వాడేస్తూ ఉంటారు. ఉద్యమానికి ముందు రెండు గదుల అద్దె ఇంట్లో ఉన్న కవిత 2024 నాటికి వందల కోట్లకు ఎదిగింది.బంజారాహిల్స్ లో ఆమె నివసించే 6000 గజాల ఇల్లు ఖరీదే 200 కోట్లకు చేస్తుంది. ఇంత డబ్బు, సంపద కవితకు ఎలా వచ్చిందో సామాన్య జనం ఆలోచించరా? 2014 తర్వాత కవిత ,ఆమె భర్త రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు.
అసలు అన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళకి మూలధనం ఎలా వచ్చింది? ఆస్తులు కొన్నారు, స్థలాలు కొన్నారు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇంటి నిండా ఫార్చునర్ కార్లు, మెర్సిడెస్ బెంజ్ లు, బీఎండబ్ల్యూలు ఎక్కడి నుంచి వచ్చాయి? మూడు నాలుగు చోట్ల ఫార్మ్ హౌస్ లు…. షాపింగ్ కాంప్లెక్స్ లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏం కష్టం చేసి సంపాదించారు? కవిత చేతికి పెట్టుకునే వాచ్ ఖరీదే కోటి రూపాయలు ఉంటే…. ఆర్థికంగా కెసిఆర్ కుటుంబ సభ్యులు ఏ రేంజ్ కి వెళ్ళిపోయారో జనం అర్థం చేసుకోలేరా? తెలంగాణ వెనుకబాటుతనాన్ని, పేదరికాన్ని ప్రచారం చేసుకొని అధికారం కైవసం చేసుకుని, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కెసిఆర్ కుటుంబ సభ్యులు, వాళ్ల వెనక తిరిగే నాయకులు వేల కోట్ల రూపాయలు, వేల ఎకరాల భూములు సంపాదించుకున్నారు.2014… 24 మధ్య పెరిగిన వాళ్ళ ఆస్తులే సాక్ష్యాలు.
అవన్నీ మర్చిపోయి, కవిత కడిగిన ముత్యం అని కెసిఆర్ చెప్పుకుంటే జనం నమ్మేస్తారా? అందుకే ఆమెపై సానుభూతి లేదు. నిజామాబాద్ ఎంపీగా జనం కవితను ఓడించారు. జనం తీర్పుకు వ్యతిరేకంగా ఓడిపోయిన కొన్ని నెలల్లోనే కెసిఆర్ ఆమెను ఎమ్మెల్సీ చేశారు. అంటే జనం తీర్పుపై గౌరవం లేదు కెసిఆర్ కి. జనం తిరస్కరించిన వ్యక్తిని తాను పదవి ఇచ్చి గౌరవిస్తాడు. దీనినే కుటుంబ పాలన అంటారు. దీనినే రాజరిక వ్యవస్థ అంటారు. కాకపోతే తన రాజరిక పోకడలకి కెసిఆర్ తెలివిగా జై తెలంగాణ ట్యాగ్ లైన్ ని తగిలిస్తాడు . తాము చేసే తప్పుడు పనులకి జై తెలంగాణ టాగ్ లైన్ తగిలించినంతకాలం కెసిఆర్ కుటుంబం పై, కవితపై జనంలో సానుభూతి రాదు. తెలంగాణలో ఎంతోమంది బి ఆర్ ఎస్ నాయకులు ఉండగా వాళ్లను వదిలేసి, కెసిఆర్ కుటుంబంలో కీలక పాత్ర పోషించే కేటీఆర్, హరీష్ రావులను కూడా వదిలేసి కవిత మీది ఎందుకు కేసు పెట్టారు? లిక్కర్ స్కామ్ లో కవిత పేరు మాత్రమే ఎందుకు తీసుకొచ్చారు? ఇవన్నీ జనం గమనిస్తూ ఉంటారు. \
రాజకీయ దురుద్దేశాలతో కేంద్రంలో ఉన్న బిజెపి కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు చేయించి ఉండవచ్చు. కానీ లిక్కర్ కేసులో కవిత పాత్ర ఏమాత్రం లేదని అనలేం. తెలంగాణ జనం ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. కోర్టులు కూడా ఆమె నిర్దోషి అని చెప్పలేదు. క్లీన్ చీట్ ఇవ్వలేదు. లిక్కర్ స్కామ్ లో కవిత ఇంకా నిందితురాలే. ఆ విషయాన్ని మర్చిపోయి జై తెలంగాణ అని మూడుసార్లు అరిస్తే నిర్దోషి కాదు. కాలేదు కూడా. అంతకు అంత పగ తీర్చుకుంటానని ,వడ్డీతో సహా చెల్లిస్తానని చేసిన ప్రకటన బి ఆర్ ఎస్ కేడర్ లో ఉత్సాహం తెచ్చి ఉండవచ్చు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి ఆమె నిర్దోషిగా బయటపడినప్పుడు మాత్రమే అవన్నీ సాధ్యమవుతాయి. అప్పటి వరకు కవితపై తెలంగాణలో ఎవ్వరికీ సానుభూతి రాదు.