గ్రీన్ కార్డ్ ఉన్నా వెళ్ళిపోవాల్సిందే..!

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా తరచూ నిలుస్తున్నారు. దాంతో బాగా ట్రోల్ అవుతున్నారు. అయినా ఆయన తీరు మారలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2025 | 10:47 AMLast Updated on: Mar 17, 2025 | 10:47 AM

Even If You Have A Green Card You Have To Leave

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా తరచూ నిలుస్తున్నారు. దాంతో బాగా ట్రోల్ అవుతున్నారు. అయినా ఆయన తీరు మారలేదు. పైగా తమ అధ్యక్షుడి తీరును అందిపుచ్చుకుంటున్నారు. లేటెస్ట్‌గా ఆయన గ్రీన్‌కార్డ్‌పై చేసిన కామెంట్స్ అమెరికాను కుదిపేస్తున్నాయి. గ్రీన్‌కార్డ్‌ పొందినంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండిపోయే హక్కులేదంటూ కామెంట్ చేశారు. అమెరికా పౌరులుగా ఎవరిని మాలో కలుపుకోవాలో మాకు తెలుసు అంటూ మాట్లాడారు. విదేశీ వ్యవహారాల శాఖ కానీ, అధ్యక్షుడు కానీ ఓ వ్యక్తిని అమెరికా ఉండొద్దు అంటే వాళ్లను పంపించేయాల్సిందే అన్నారు. దీంతో ఇది వైరల్ అయ్యింది. నిజానికి గ్రీన్‌కార్డ్ వస్తే అమెరికన్ పౌరసత్వం వచ్చినట్లే… వారు అమెరికన్ పౌరులు అయిపోయినట్లే అన్నది అందరి భావన.

కానీ అది నిజం కాదు అన్నది వాన్స్ వాదన. 1952 అమెరికా ఇమ్మిగ్రేషన్ నేషనాలిటీ చట్టం ప్రకారం దేశ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించే వలసదారులు ఎవరినైనా వెనక్కు పంపొచ్చు. నేరాలకు పాల్పడినా, సుదీర్ఘకాలం దేశంలో నివసించకపోయినా పౌరసత్వం రద్దు చేయవచ్చు. కానీ అత్యంత అరుదైన సందర్భాల్లోనే దీన్ని ప్రయోగిస్తారు. కానీ ఇప్పుడు దీన్ని మరోసారి తెరపైకి తెచ్చి గ్రీన్‌కార్డ్‌ పొందిన లక్షలమందిని టెన్షన్‌లోకి నెట్టారు వాన్స్. గ్రీన్‌కార్డ్‌ పొందిన మహ్మద్‌ ఖలీల్ అనే సిరియా వలసదారుడు ఇటీవల కొలంబియా యూనివర్శిటీలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలకు నాయకత్వం వహించాడు. అతడిని శనివారం అరెస్ట్‌ చేశారు. ఇప్పుడు అతడ్ని స్వదేశానికి పంపడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే జేడీ వాన్స్ గ్రీన్‌కార్డ్స్‌పై కామెంట్ చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో చేసినా ఇప్పుడది కొత్త చర్చకు, రచ్చకు దారి తీసింది. ఇప్పటికే ప్రెసిడెంట్ ట్రంప్ గోల్డ్‌కార్డ్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో వాన్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇకపై గ్రీన్‌కార్డులు ఇస్తారా లేదా అన్న భయం కూడా మొదలైంది. గ్రీన్‌కార్డ్‌ ఉన్నా సేఫ్ కాదు గోల్డ్‌కార్డ్ బెటర్ అన్న ఫీలింగ్‌ తీసుకురావడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు కూడా రేగుతున్నాయి.

గ్రీన్‌కార్డ్ హోల్డర్ల హక్కుల విషయంలో కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవం. గ్రీన్‌కార్డ్ వస్తే అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవచ్చు… పని చేసుకోవచ్చు… వారికి చట్టపరమైన రక్షణ ఉంటుంది. ఆ తర్వాత అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవ్చు. అయితే గ్రీన్‌కార్డుదారులు ఓటేయలేరు. కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. ఇక రూల్స్, పన్నుల చెల్లింపులో చట్టాలను పాటించాలన్నది నిబంధన. ఫస్ట్‌ ఎమెండ్‌మెంట్ ప్రకారం అమెరికా పౌరులకు ఎలాంటి హక్కులుంటాయో గ్రీన్‌కార్డుదారులకు కూడా అవే హక్కులుంటాయి. వాక్‌ స్వాతంత్ర్యం, శాంతియుత నిరసనలు చేసుకోవచ్చు. అమెరికా, రాష్ట్రాల్లోని చట్టాలను పాటించాలి. ఎప్పటికప్పుడు పన్నులు చెల్లించాలి. వీటిలో ఏమైనా తప్పులు జరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు కానీ గ్రీన్‌కార్డులు రద్దు చేయరు. తీవ్రమైన నేరాల విషయంలోనే గ్రీన్‌కార్డులను రద్దు చేయవచ్చు. జేడీవాన్స్‌ మాత్రం గ్రీన్‌కార్డ్‌ ఉన్నంతమాత్రాన పర్మనెంట్‌గా దేశంలో ఉండలేరంటూ అందరికీ దాన్ని ఆపాదించేశారు. దీంతోనే టెన్షన్ మొదలైంది.

భారతీయ గ్రీన్‌కార్డు దారులకు కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు. పరిస్థితులు బాగోలేని ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రూల్స్ ఉల్లంఘించవద్దని సూచిస్తున్నారు. చిన్న సమస్య కూడా రెసిడెన్సీ స్టేటస్‌ను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. అలాగే గ్రీన్‌కార్డ్ ఉంది కదా అని వేరే ప్రాంతాల్లో ఎక్కువకాలం ఉండొద్దు. గ్రీన్‌కార్డ్‌దారులు తాము డిపోర్టేషన్ సమస్య ఎదుర్కొంటుంటే వారికి కొన్ని న్యాయపరమైన అవకాశాలున్నాయి. అయితే వాటివల్ల కచ్చితంగా ఊరట ఉంటుందని చెప్పలేం కాబట్టి అలాంటి పరిస్థితి రానివ్వొద్దన్నది నిపుణుల సూచన. మొత్తానికి ఇమ్మిగ్రేషన్‌పై ఇంత రచ్చ జరుగుతున్న సమయంలో జేడీ వాన్స్ తీసుకొచ్చిన కొత్త వివాదం ఎటు మలుపులు తిరుగుతుందోనన్న టెన్షన్ అందరిలో నెలకొంది.