7 నిమిషాల్లోనే అంతా ఫినిష్ SLBC ప్రమాదంలో కీలక మలుపు
SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు నెల రోజులు దాటినా మృత దేహాల జాడ మాత్రం ఇప్పటికే తెలియరాలేదు.

SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు నెల రోజులు దాటినా మృత దేహాల జాడ మాత్రం ఇప్పటికే తెలియరాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించి ఓ కీలక విషయాన్ని అధికారులు బయటపెట్టారు. టన్నెల్‌లో ప్రమాదం జరిగిన 7 నిమిషాల్లోనే 8 మంది చనిపోయినట్టు నిర్ధారించుకున్నారు. నిజానికి టన్నెల్ లోపల ప్రమాదం జరిగినప్పుడు అక్కడ 40 మంది ఉన్నారు. కానీ అందులో 32 మంది మాత్రమే సురక్షితం బయటికి వచ్చారు. మిగిలిన 8 మందికి పారిపోయే గ్యాప్‌లోనే పైకప్పు కూలిపోయి నిమిషాల్లోనే వాళ్లంతా చనిపోయినట్టు నిర్ధారించుకున్నారు అధికారులు. లోపల ఉన్న బురద మట్టి కారణంగా మృతదేమాల వెలికితీ కష్టంగా మారిందని చెప్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన 15 రోజుల తరువాత ఓ మృతదేహాన్ని గుర్తించారు రెస్క్యూ సిబ్బంది.
ఆ డెడ్‌బాడీ టన్నెల్ బోర్ మెషీన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం. మరో ఏడుగురు కార్మికుల ఆచూకీ నెల రోజులు గడుస్తున్నా ఇంకా లభించలేదు. అధికారులు, సహాయక బృందాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నా.. వారి ఆచూకీ మాత్రం దొరకడం లేదు. SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం 12 రెస్క్యూ టీంలు గత నెల రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్టీఆర్ఎఫ్, ర్యాట్‌హోల్ మైనర్స్, సింగరేణి, హైడ్రా సహా.. దేశంలోని అత్యుత్తమ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. దాదాపు 1000 మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
సొరంగం మెుత్తం పొడవు 14 కిలో మీటర్లు. 13.85 కిలో మీటర్ల దగ్గర టన్నెల్ పైకప్పు కూలిపోయింది. మట్టి, రాళ్లు, భారీగా పేరుకుపోయిన బురద, సిమెంట్ దిమ్మెలు, నీరు, టీబీఎం శిథిలాలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. నిమిషానికి దాదాపుగా 5 వేల లీటర్ల నీరు ఊరుతుండటంతో అందులోని మట్టి గట్టిగా మారింది. టన్నెల్ లోపల మట్టి గట్టిగా ఉండటం, పైకప్పు బలహీనంగా ఉండటంతో సహాయక చర్యలు జాగ్రత్తగా కొనసాగిస్తున్నారు. బురద వల్ల మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉంటాయని భావిస్తున్నారు. వారిని బయటకు తీయటం అసాధ్యమని. ఇదే విషయాన్ని సీఎంకు వివరించేందుకు అధికారులు ఓ నివేదిక సిద్ధం చేశారు. సమీక్ష అనంతరం టన్నెల్ ప్రమాదం రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.