తండ్రి సిఎం కావడమే ఈ ఆడబిడ్డలకు శాపమా…? వీరి జీవితాల్లో అన్నీ కష్టాలే
తండ్రి సిఎం కావడమే ఆ ఆడబిడ్డలకు శాపం. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగే ఆ ఆడబిడ్డలు ఆ తర్వాత జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నారు. పూలపాన్పు కావాల్సిన జీవితం జైలు పాలు అవుతోంది. కొందరు తమ తప్పులతో కష్టాలు పడుతుంటే మరికొందరు మాత్రం విధి రాతతో కష్టాలు ఎదుర్కొంటున్నారు.
తండ్రి సిఎం కావడమే ఆ ఆడబిడ్డలకు శాపం. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగే ఆ ఆడబిడ్డలు ఆ తర్వాత జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నారు. పూలపాన్పు కావాల్సిన జీవితం జైలు పాలు అవుతోంది. కొందరు తమ తప్పులతో కష్టాలు పడుతుంటే మరికొందరు మాత్రం విధి రాతతో కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొందరు జైలు పాలు, మరికొందరు రాజకీయ జీవితంలో కష్టాలు, కొందరు భర్తలను కోల్పోయి, మరికొందరు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయి ఇలా మాజీ ముఖ్యమంత్రుల ఆడబిడ్డల జీవితాల్లో విషాదాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.
అలా కష్టాలు ఎదుర్కొన్న కొందరు మాజీ ముఖ్యమంత్రుల ఆడ బిడ్డలను చూద్దాం…
కనిమొళి: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ముద్దుల కుమార్తె. ఎన్నో పదవులను తన రాజకీయ జీవితంలో చూసిన కనిమొళి జైలు జీవితం గడిపారు. తండ్రి బ్రతికి ఉన్న సమయంలోనే 2జీ కేసులో ఆమె తీహార్ జైలుకి వెళ్ళారు. ఏ రాజాతో కలిసి జైలుకి వెళ్ళిన ఆమె నిర్దోషి అంటూ 2018 లో సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు అన్న… స్టాలిన్ ముఖ్యమంత్రి కావడంతో ప్రభుత్వంలో కూడా ఆమె కీలకంగా ఉన్నారు.
వైఎస్ షర్మిల: వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాల పట్టి అయిన షర్మిల జీవితం కూడా ఏమీ పూల పాన్పు కాదు. వైఎస్ మరణం తర్వాత సోదరుడు వైఎస్ జగన్ జైలుకి వెళ్ళడంతో ఆమె అప్పట్లో పాదయాత్ర చేసి వైసీపీలో నూతన ఉత్సాహం నింపారు. అయితే పదవులు మాత్రం ఆమెకు దూరంగానే ఉన్నాయి. 2014లో ఖమ్మం ఎంపీ సీటు, 2019 లో కడప ఎంపీ సీటు, ఆ తర్వాత అన్న ప్రభుత్వంలో మంత్రి పదవి ఇలా ఎన్నో ఆశించినా నిరాశే ఎదురైంది. 2024 ఎన్నికల్లో కడప ఎంపీగా ఎన్నికై ఓటమి పాలయ్యారు షర్మిల. అన్నతో వచ్చిన విభేదాలతో సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా ఉన్నారు.
కల్వకుంట్ల కవిత: తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల తనయ కవిత. ఈమె జీవితం కూడా అంత సాఫీగా ఏమీ కనపడటం లేదనే చెప్పాలి. 2014 లో నిజామాబాద్ ఎంపీగా ఎన్నికైన కవిత 2019 లో ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ పదవి వరించింది. అనూహ్యంగా 2022 నుంచి కవిత లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు. అప్పటి నుంచి వెంటాడిన లిక్కర్ కేసులో ఆమె 155 రోజుల పాటు జైలు జీవితం గడిపి బెయిల్ పై విడుదలయ్యారు. ఆ కేసు తేలే వరకు కవితకు మనస్సాంతి ఉండకపోవచ్చు.
ఉమా మహేశ్వరి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్న కుమార్తె అయిన ఉమా మహేశ్వరి కూడా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. 2022లో ఆమె ఆరోగ్య, కుటుంబ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎప్పుడూ మీడియాలో కూడా ఆమె కనపడే వారు కాదు. కుటుంబానికి కూడా ఆమె దూరంగానే ఉండేవారు. అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడం కుటుంబంలో విషాదం నింపింది.
మాళవిక హెగ్డే: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కుమార్తె మాళవిక. భర్త వీజీ సిద్దార్థ. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు. కాఫీ డే నష్టాల్లో కూరుకుపోవడం, అప్పుల పాలు కావడంతో సిద్దార్థ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత మాళవిక ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అయినా సరే ఆ కష్టాల నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కాఫీడే ని లాభాల బాట పట్టించారు. కాని భర్త లేని లోటు ఆమెను వెంటాడుతుంది. ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్… వీరి కుమార్తెను తన కొడుకుకు ఇచ్చి వివాహం చేసారు.
హంస మొయిలి: కర్ణాటక మాజీ సిఎం వీరప్ప మొయిలి కుమార్తె అయిన హంస మొయిలీ… 46 ఏళ్ళ వయసులో ప్రాణాలు విడిచారు. అనారోగ్య కారణాలతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె జీవితం కూడా పూలపాన్పు ఏమీ కాదు. భారత నాట్యం వంటి వాటిల్లో ప్రావిణ్యం సంపాదించినా అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు హంస.
ఇలా మాజీ ముఖ్యమంత్రుల గారాల పట్టీలు అందరూ జీవితంలో కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె మాత్రమే కాస్త రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె బారామతి ఎంపీగా ఉన్నారు.