PV Ramesh: మేఘా సంస్థకు పీవీ రమేష్ రాజీనామా.. కీలక విషయాలు వెల్లడిస్తారా..?
పీవీ రమేష్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం విచారణ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన వాంగ్మూలం వల్లే కేసు విచారణ జరుగుతుండటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
PV Ramesh: ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్.. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) సంస్థకు రాజీనామా చేశారు. ఆయన మేఘా సంస్థలో సలహాదారు పదవిలో కొనసాగారు. తాజాగా చంద్రబాబు అరెస్టైన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో పీవీ రమేష్ పేరు కూడా వినిపిస్తోంది. పీవీ రమేష్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం విచారణ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన వాంగ్మూలం వల్లే కేసు విచారణ జరుగుతుండటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై పీవీ రమేష్ వివరణ ఇచ్చేందుకు సోమవారం ప్రెస్‌మీట్ పెట్టాలనుకున్నారు. దీనికి మేఘా సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ సంస్థలో కొనసాగుతూ అలాంటి ప్రెస్‌మీట్లు పెట్టడం సరికాదని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. రాజీనామా అనంతరం ఆయన ప్రెస్‌మీట్ పెట్టి, ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టైన తర్వాతే పీవీ రమేష్ మేఘా సంస్థకు రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పీవీ రమేష్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయనను సీఐడీ విచారించింది. ఆయన ఈ అంశంలో లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. పీవీ రమేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందని ప్రచారం జరుగుతోంది.
అలాగే ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారినట్లు కూడా ప్రచారం మొదలైంది. దీంతో ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రయత్నిస్తుండగా, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మేఘా సంస్థ అడ్డుపడినట్లు తెలుస్తోంది. తమ కంపెనీలో సలహాదారుగా ఉంటూ.. రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని సంస్థ కోరింది. దీంతో రమేష్ మేఘాలో తన పదవికి రాజీనామా చేశారు. తాను ఈ కేసులో అప్రూవర్‌గా మారినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు. అలాగే తాను రాజీనామా చేయడానికి వ్యక్తిగత కారణాలే తప్ప.. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రమేష్ చేసిన ఆరోపణలపై సీఐడీ స్పందించింది. ఆయన వ్యాఖ్యల్ని ఖండించింది. రమేష్ వ్యాఖ్యల ఆధారంగానే కేసు నమోదు చేయలేదని, దీనికి తగిన ఆధారాలున్నాయని, కేసు విచారణలో రమేష్ ఒక భాగం మాత్రమేనని సీఐడీ తెలిపింది.
ఆయన వ్యాఖ్యలు దర్యాప్తును, విచారణను ప్రభావితం చేయడమే అవుతుందని సీఐడీ అధికారులు అన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉండగా పీవీ రమేష్ చేసిన వ్యాఖ్యలు అయోమయానికి గురిచేయడమే అన్నారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం అంశంపై రమేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తను ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా, ప్రజలకోసమే పని చేశానని తెలిపారు.