Perni Nani: జగన్ ముందే రాజకీయాలపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..!
మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయాల నుంచి తప్పకుంటున్నట్టు ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు.
మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయాల నుంచి తప్పకుంటున్నట్టు ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. పేర్ని నాని రాజకీయాల నుంచి తప్పుకుని కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దింపాలని చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లు అర్థమవుతోంది. తాను రిటైర్ అవబోతున్నానని పేర్ని నాని చెప్పేశారు. జగన్ తో తనకు ఇదే చివరి సమావేశం కావచ్చని సంచలన ప్రకటన చేశారు.
బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పోర్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని ప్రసంగించారు. సీఎం జగన్ తో తనకు ఇదే చివరి సమావేశం కావచ్చన్నారు. దీంతో అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇంతలో పక్కనున్న వ్యక్తి ఏదో కామెంట్ చేయగా..హా.. అవును … రిటైర్ అవుతున్నాను అని మైక్ లోనే చెప్పేశారు. దీంతో ఆయన అనుచరులంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
కృష్ణా జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ లీడర్లలో పేర్ని నానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వైసీపీ వెంటే ఉన్నారు. కష్టశుఖాల్లో జగన్ వెంటే నడిచారు. ఆ కృతజ్ఞతతోనే 2019లో గెలిచిన వెంటనే పేర్ని నానికి మంత్రిపదవి అప్పగించారు. అనంతరం మూడేళ్ల తర్వాత మంత్రి పదవి తప్పించినా కూడా పేర్ని నాని ఆయన వెంటే నడిచారు. తాను బతికున్నంతకాలం జగన్ తోనే ఉంటానని పలుమార్లు చెప్పేవారు. అయితే రాజకీయాల నుంచి తాను తప్పుకుని కుమారుడిని రంగంలోకి దింపాలని ఎంతోకాలంగా ఆలోచిస్తున్నారు. అయితే జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఇన్నాళ్లూ కామ్ గా ఉండిపోయారు.
అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్ని నాని భావించారు. అందుకే తాను తప్పుకుని కుమారుడ్ని యాక్టివ్ చేయాలనకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే ప్రకటించేశారు. తనకు ఇదే చివరి సమావేశం కావచ్చన్నారు. బందరుకోసం అడిగినవన్నీ ఇచ్చిన జగన్ కు పాదాభివందనం చేయాలని ఉందని, కానీ వయసులో తనకంటే చిన్నవాడు కాబట్టి ఆ పని చేయలేకపోతున్నానన్నారు. ఎన్ని జన్మలెత్తినా బందరు ప్రజలు జగన్ రుణం తీర్చుకోలేరన్నారు.