BJP: ఎన్నికల మూడ్‌లోకి బీజేపీ.. త్వరలో నేతల యాత్రలు.. పార్టీకి కలిసొచ్చేనా..?

ఎన్నికల మూడ్‌లోకి వెళ్లేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ప్రజలకు దగ్గరయ్యే ఉద్దేశంతో త్వరలోనే యాత్రలకు ప్లాన్ చేస్తోంది. అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సహా పార్టీ నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 11, 2023 | 10:33 AMLast Updated on: Jul 11, 2023 | 10:33 AM

Eye On Polls Bjp Plans To Start Yatras Soon In Telangana

BJP: బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు సర్దుకున్నట్లే కనిపిస్తోంది. బండిని తొలగించి, కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో చాలా మంది నేతలు అసంతృప్తిని పక్కనపెట్టేశారేమో అనిపిస్తోంది. పార్టీలో విబేధాల పరిస్థితి ఎలా ఉన్నా.. కలిసి పని చేసేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఇక ఎన్నికల మూడ్‌లోకి వెళ్లేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ప్రజలకు దగ్గరయ్యే ఉద్దేశంతో త్వరలోనే యాత్రలకు ప్లాన్ చేస్తోంది. అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సహా పార్టీ నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే యాత్రలు నిర్వహించబోతున్నారు.
తెలంగాణ అంతా కవర్ అయ్యేలా..
బస్సు యాత్ర చేయాలా.. పాదయాత్ర చేయాలా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ తెలంగాణలోని అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా యాత్రలు ప్లాన్ చేస్తోంది బీజేపీ. ఈ అంశంపై నేతలు ఇప్పటికే ప్రాథమికంగా చర్చించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ బీజేపీలో పాదయాత్ర ట్రెండ్ ప్రారంభించింది బండి సంజయ్. ఆయన ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో పర్యటించి, పార్టీని జనంలోకి తీసుకెళ్లగలిగారు. ఈసారి ప్రజా సంగ్రామ యాత్రను మించేలా ఈ యాత్రలు నిర్వహించబోతున్నారు. నేతలంతా ఒకే చోటు నుంచి కాకుండా తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల నుంచి యాత్రలు ప్రారంభిస్తారు. అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా.. ఎవరు, ఎక్కడ నుంచి యాత్ర ప్రారంభించాలో త్వరలో నిర్ణయిస్తారు. యాత్ర షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.
వచ్చే నెలలో ప్రారంభం
ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తేనే బాగుంటుందని నాయకత్వం భావిస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఈ యాత్ర సాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కేంద్రం మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బండి సంజయ్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో ఈటల రాజేందర్ యాత్రలు నిర్వహిస్తారు. భద్రాచలం నుంచి బండి సంజయ్, కొండగట్టు నుంచి ఈటల యాత్రలు ప్రారంభిస్తారు. ఈ యాత్రలో పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను కూడా భాగస్వామ్యం చేయాలని పార్టీ భావిస్తోంది. యాత్రలో పాల్గొనే ఇతర నేతలు, షెడ్యూల్‌పై పార్టీ కసరత్తు చేస్తోంది.
బీఆర్ఎస్‌ను ఎలా ఎదుర్కొనేది..?
బీజేపీ ఎంతగా ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేసినా.. ఆ పార్టీ, బీఆర్ఎస్ ఒక్కటేనని జరుగుతున్న ప్రచారం ఇబ్బందిగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ప్రజల్లోకి వెళ్తే ముందుగా ఈ అంశంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. తాము ఒక్కటి కాదని బీజేపీ నిరూపించుకోవాలి. ఆ దిశగా బీఆర్ఎస్‌పై విమర్శలు చేయాలి. లిక్కర్ స్కాం విషయంలో కేంద్రం నుంచి తగిన చర్యలు ఉండాలి. అప్పుడు మాత్రమే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదని జనం నమ్ముతారు. లేదంటే కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు బీజేపీ మూల్యం చెల్లించుకోకతప్పదు.