KCR FAMILY : లోక్ సభ ఎన్నికలకు ఫ్యామిలీ ప్యాకేజీ.. జాతీయ రాజకీయాల్లోకి కేటీఆర్ ?
మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణలో 17 నియోజకవర్గాల్లో గతంలో బీఆర్ఎస్ సత్తా చాటింది. 9 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంది. పైగా మోడీ మేనియాతో తెలంగాణ ఓటర్లు బీజేపీకి కూడా ఓట్లేస్తే.. ఆ పార్టీ కూడా గతంలో లాగే.. లేదంటే గతం కన్నా ఎక్కువే ఎంపీ సీట్లు గెలుచుకునే ఛాన్సుంది. కాంగ్రెస్, బీజేపీ ఓకే. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి.
మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణలో 17 నియోజకవర్గాల్లో గతంలో బీఆర్ఎస్ సత్తా చాటింది. 9 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంది. పైగా మోడీ మేనియాతో తెలంగాణ ఓటర్లు బీజేపీకి కూడా ఓట్లేస్తే.. ఆ పార్టీ కూడా గతంలో లాగే.. లేదంటే గతం కన్నా ఎక్కువే ఎంపీ సీట్లు గెలుచుకునే ఛాన్సుంది. కాంగ్రెస్, బీజేపీ ఓకే. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన జనం పార్లమెంట్ కు గెలిపిస్తారా.. పార్టీ గెలుపోటములు ఎలా ఉన్నా.. ఈసారి కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ముగ్గురు లోక్ సభకు పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవిత బరిలో ఉంటారనీ.. తెలంగాణ బాధ్యతలను హరీష్ కి ఇస్తారని అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయింది BRS. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే పరిస్థితి రిపీటైతే… పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమని గులాబీ బాస్ భావిస్తున్నారు. అందుకే ఈసారి ఫ్యామిలీ ప్యాకేజీ వైపు మొగ్గుచూపిస్తున్నట్టు తెలుస్తోంది. కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి.. కేసీఆర్, కేటీఆర్, కవిత లోక్ సభకు పోటీ చేయబోతున్నట్టు సమాచారం. మాజీ సీఎం కేసీఆర్.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని ఫేస్ చేయలేక.. మెదక్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని గతంలోనే టాక్ వచ్చింది. ఇక నిజామాబాద్ సీటు ఎలాగూ కవితకు పక్కాగా ఇస్తారు. మరి కేటీఆర్ పేరు ఎందుకు కొత్తగా వార్తల్లోకి వచ్చిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కేటీఆర్.. మల్కాజ్ గిరి లేదా సికింద్రాబాద్ స్థానాల నుంచి లోక్ సభకు బరిలో ఉంటారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా BRS ఎమ్మెల్యేలే గెలిచారు. దాంతో కేటీఆర్ గెలుపు ఈజీ అవుతుందని భావిస్తున్నారు. దీనిపై ఇటీవల పార్టీ సమీక్షా సమావేశాల్లో చర్చకు రాగా.. కేటీఆర్ దీన్ని ఖండించలేదు. అలాగని సమర్థించలేదు కూడా. ఉన్నట్టుండి కేటీఆర్ పేరు రావడానికి కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు లీడర్లు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్ సభ ఎలక్షన్స్ వస్తున్నాయి. అక్కడ పోయిన పరువును ఇక్కడ దక్కించుకోవాలి. అందుకే వేరే ఎవరికో టిక్కెట్ ఇచ్చే బదులు.. కేటీఆర్ పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ కదా అన్న నమ్మకంలో ఉన్నారు గులాబీ బాస్.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరిగాయని గతంలో వార్తలు వచ్చాయి. అందుకే బీఆర్ఎస్ బాధ్యతలను హరీష్ రావు చేతుల్లో పెడతారని అంటున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ చేస్తారని సమాచారం. మూడు రోజుల క్రితం హరీష్ ఓ ప్రకటన చేశారు. కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారు. ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్ కు వస్తారు. జిల్లాల వారీగా పర్యటన చేస్తారని చెప్పారు. కానీ గత కొన్నేళ్ళుగా.. పార్టీ వ్యవహారాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదు. మొత్తం కేటీఆర్ కే అప్పగించారు. మరి మళ్ళీ కేసీఆర్ రావడం ఏంటి… అంటే కేటీఆర్ ను పక్కనపెట్టినట్టేగా అన్న చర్చ పార్టీ కేడర్ లో మొదలైంది.
మళ్ళీ బీఆర్ఎస్ ను బలోపేతం చేయాలంటే.. అది కేసీఆర్, హరీష్ రావు వల్లే సాధ్యమవుతుందని భావిస్తున్నారు. గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీని మళ్ళీ నిర్మించడం.. జనంతో.. కార్యకర్తలు, అభిమానులతో రిలేషన్ మెయింటైన్ చేయాలంటే అది హరీష్ వల్లే అవుతుందని భావిస్తున్నారు. అందుకే.. కేటీఆర్ ను లోక్ సభకు పంపి.. హరీష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారన్న టాక్ BRS వర్గాల్లో నడుస్తోంది.