February 14: వాలెంటైన్స్ డే – కౌ హగ్ డే వెనుక ఇన్ని రాజకీయాలా..?
ఫిబ్రవరి 14 అంటే 20-30 దశాబ్దాల క్రితం ఏమో అనేవారు. అయితే ప్రస్తుత కాలంలో పరిస్థితులు మారిపోయాయి. స్కూల్ లో చదివే అప్పర్ ప్రైమరీ విద్యార్థులను అడిగినా వాలెంటైన్స్ డే అని చెబుతారు. దీనికి వారం రోజుల ముందే రోజుకో ప్రాధాన్యం ఇస్తూ జరుపుకునే సంప్రదాయానికి ఇప్పటి యువత శ్రీకారం చుట్టింది.
ఇలా ఈ ప్రాశ్చాత్య సంస్కృతి మనకు విస్తరించడానికి ప్రదానకారణం మన దేశ పరిస్థితులు, పెరుగుతున్న జనాభా, ఉపాధి లేని చదువులు. ప్రస్తుత దేశ జనాభా చైనాను వెనక్కి నెట్టి ముందుకు దూసుకెళ్తోంది. దీంతో యువతరం బాగా పెరిగిపోయింది. యువభారత్ గా మన దేశం యవ్వనంగా ఉందని సంబరపడాలో లేక ఇలా సరదాలకు ప్రాముఖ్యం ఇస్తూ కాలం వెళ్లబుచ్చుతుందని చెప్పాలో తెలియని గందరగోళ పరిస్థితులకు చేరుకున్నాయి.
పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా:
పారిశ్రామీకరణ పెరిగిన తరువాత ఆధునిక జీవన పద్దతులు మెరుగుపడ్డాయి. అప్పుడప్పుడే యువతను ఆకట్టుకునే ప్రేమ పేరుతో అనేక రకాలా సినిమాలు, గ్రీటింగ్ కార్డులు, సెల్ ఫోన్లు ఇలా ఒక్కొక్కటి అందుబాటులోకి వచ్చాయి. సినిమాను చూసి జనం ఇలా తయారవుతున్నారని కొందరు వాదిస్తే.. నిజజీవితం ఆధారంగానే మేము పాత్రలను పెట్టి సినిమా తీశామని సినీపరిశ్రమకు చెందిన కొందరు ఖండించారు. ఇలా ఒకరినొకరు ఆరోపణలు చేస్తూ కాలం వృధా చేయడమే కాకుండా సరికొత్త పోకడలను స్వాగతించారు. వీటితో పాటూ పెట్టుబడిదారులు ఇలాంటి వారిని ఆకర్షించేందుకు రకరకాలుగా ప్రచారాల పేరుతో దంచి కొడుతున్నారు. పలు ప్రముఖ చాక్లెట్ కంపెనీ వారు పాటను కూడా రంగరించి చాక్లెట్ ఎలా తినాలో చెప్పేంతలా ప్రభావం చూపుతున్నారు. ప్రేమించకపోతే అదేదో తప్పుచేసినట్టుగా సమాజంలో కలిసిపోలేనంతగా ఫీలవుతున్నారు నేటి యువత. నాకు ప్రేయసిలేదు, నేను ఎవరినీ ప్రేమించలేదు అంటే అతనిని సమాజం గుర్తించనంతగా పరిస్థితులు మారిపోయాయి.
నిరుద్యోగమే ప్రదాన కారణం:
2021లెక్కల ప్రకారం దేశ జనాభా 141కోట్లు. ప్రస్తుతం 150 దాటేసింది. ఇందులో సగం పైగా యువకులే. వీరిలో కొంతమంది చదువుకున్నవారు ఉన్నారు. మరికొందరు చదువులేని వారూ ఉన్నారు. వారివారి ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఇలా తయారవుతున్నారు. కొంతో గొప్పో చదువుకున్నప్పటికీ ఆ చదువుకు తగిన ఉద్యోగం వెంటనే లభించడం లేదు. దీంతో నిరుద్యోగ సమస్య ఎక్కువైంది. ఖాళీగా ఉండలేడు. ఏదో ఒక కోర్స్ పేరుతో మెట్రో నగరాల్లో వెళ్లి ఇన్సిట్యూట్లో చేరతారు. అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా అమ్మాయిలు, అబ్బాయిలూ అందరూ కలివిడిగా ఉండాల్సిన పరిస్థితి. ఇలా కొందరి ప్రయాణం స్నేహంగా చిగురిస్తుంది. స్నేహం కాస్త ప్రేమగా మారి సిటీ కల్చర్ కి అలవాటుపడి కోర్సును కోచింగ్ సెంటర్లో అటకెక్కిస్తున్నారు.
ప్రేమ పేరుతో పలు మోసాలు:
అబ్బాయి,అమ్మాయిలు ఇద్దరూ కలిసి పార్కులు, షాపింగులు, సినిమాలు, పబ్బులు, రెస్టారెంట్లు ఇలా ఒకటా రెండా ఎటుచూసినా వీళ్లే దర్శనమిస్తారు. ఇలా నమ్మి విచ్చలవిడిగా తిరిగి మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు. చివరకు అబ్బాయి.. అమ్మాయినైనా వదిలేస్తాడు. లేదా అమ్మాయి.. అబ్బాయినైనా విడిచి వేరో పెళ్ళి చేసుకొని వెళ్లిపోతుంది. ఇలా ప్రేమ అనే ముసుగులో చాలా నేరాలు వెలుగులోకి వచ్చాయి. రోజూ తిరిగే ఇలాంటి జంటలు ప్రేమికుల రోజు పేరుతో ఇంకొంచం డోసుపెంచి తమ పైత్యాన్ని చూపిస్తున్నాయి. వాలెంటైన్స్ డే రోజు రకరకాలా గిప్ట్ లు, రోజాలు, కేకులు, చాక్లెట్లు మరికొందరైతే బంగారు ఆభరణాలు కొని ఇవ్వడం పరిపాటిగా మారింది. వాలెంటైన్స్ డే రోజు బహుమతి తప్పకుండా ఇవ్వాలట. లేకుంటే ఫీలవుతున్నారట. ఇలా బహుమతి ఇవ్వలేని కారణంగా దేశంలో 79శాతం మంది యువతీ యువకులు ఫీలవుతున్నారని క్యాష్ కరో డాట్ కాం సర్వేలో వెలుగులోనికి వచ్చింది. కేవలం గిప్ట్ ఇస్తేనే ప్రేమ ఉన్నట్లా ఇవ్వకపోతే లేనట్లేనా. కేవలం గిప్ట్ కోసం ప్రేమిస్తారా..? గిప్ట్ ఇవ్వకుంటే ప్రేమ ఉండదా..? అనేది ఇక్కడ గమనించవల్సిన ప్రదాన అంశం.
కేంద్రప్రభుత్వం చేసిన ప్రతిపాదన:
ప్రేమికుల గొడవ ఇలా ఉంటే తాజాగా ఈ ప్రాశ్చాత్య ప్రేమికుల రోజును అరికట్టేందుకు కూసింత భక్తి భావాన్ని జోడించి కౌ హగ్ డే పేరుతో ఒక కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది కేంద్రప్రభుత్వం. ఫిబ్రవరి 14 రోజున ఆవును కౌంగిలించుకొని మన సంప్రదాయాన్ని కాపాడాలనే సందేశాన్ని తెలిపింది. దీంతో సామాజిక మధ్యమాల్లో వాదప్రతివాదాలు, విమర్శలు మిన్నంటాయి. ఇక చేసేదేమీ లేక కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. యూరప్ వాలెంటైన్స్ డే సంస్కృతిని అరికట్టాలంటే నేరుగా నిషేదాజ్ఞలు జారీచేయాలి. ఇలా చేసిన వారికి కఠిన చర్యలు తప్పవని నూతన చట్టాన్ని తీసుకురావాలి. వీరికి ప్రోత్సహిస్తూ ప్రేరణ కలిగించి ఆకర్షిస్తున్న పారిశ్రామిక వేత్తలకు శిక్షలు పడేలా చేయాలి. అంతే తప్ప ఇలా ఏదో ఒక పేరుతో అర్థం లేని ప్రతిపాదన చేస్తే సరిపోదు.
లాజిక్ లేని ఆవు ఆలింగన దినోత్సవం:
గ్రీటింగ్స్, చాక్లేట్స్, డ్రస్, జువెలరీ అమ్మే సంస్థలను ప్రోత్సహిస్తూ ఇలాంటి భక్తిపరమైన వ్యాఖ్యలు చేయడం సరైన పద్దతి కాదు. ఒకవేళ ఇలా గనుక ప్రభుత్వ చేస్తే యువకుల ఓట్లు పక్కకు పోయే ప్రమాదం ఉంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా యువకులదే నేటి భారతం. వీరికి వ్యతిరేకంగా వెళితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. అలాగని పారిశ్రామిక వేత్తల వద్దకు వెళితే పార్టీలకు రావల్సిన లబ్ధి ఆగిపోతుంది. అందుకే కట్టె విరగకూడదు.. పామూ చావకూడదు అన్న తీరులో మన గ్రామీణ పశుసంపదను కాపాడుకుంటూ దేశప్రగతిలో కీలకపాత్ర పోషిస్తున్న గోమాతను ప్రేమించాలని ఒక లాజిక్ లేని సందేశాన్ని తీసుకువచ్చింది. చివరకు దీనిపై విమర్శలు వచ్చేసరికి వెనుకడుగు వేస్తూ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
గోవులను గాలికొదిలేసి:
నిజంగా గోవుమీద అంత ప్రేమ ఉంటే ఆవులకు వస్తున్న లంపీ వైరస్ పై చర్యలు తీసుకొని గోపరిరక్షణను చేపట్టాలి. వాటికి సరైన వైద్య చికిత్సకు పూనుకోవాలి. అవసరమైన ఆసుపత్రులను నిర్మించాలి. ఇంకా ఆధారాతో చెప్పాలంటే గోవు అనేది దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరభారత దేశంలోనే ఎక్కువ సంఖ్యలో పాడిపోషణ చేస్తుంది. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ లో ఆవులకు సరైన సౌకర్యలు కల్పించలేని కారణంగా రోడ్లపైకి వచ్చాయి. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. చివరకు ఇది ఎన్నికల్లో ప్రధాన సమస్యగా చర్చనీయాంశమైంది. దీంతో పాటూ గుజరాత్ లో కూడా గోవులకు సంబంధించిన సమస్య ఒకటి రాజకీయంగా మారింది.
దక్షిణ భారతదేశాన్ని లెక్కలోకి తీసుకోలేదా..?
మన దక్షిణ భారతదేశం విషయానికొస్తే ఇక్కడ ఆవును కేవలం ఆరాధించే కోణంలో మాత్రమే చూస్తారు. మనకు పాడిపరంగా అభివృద్ది చెందడం అంటే అది కేవలం గేదెల వల్లే అని చెప్పాలి. ఇక్కడ కేంద్రం ప్రతిపాదించిన అంశంలో గ్రామీణ అభివృద్దిలో ఆవులు కీలకపాత్రపోషిస్తున్నాయనే విధంగా తెలిపింది. అందులో ఇక్కడా గేదెను పేర్కొనలేదు. కానీ ఇక్కడ మనకు గేదే ప్రదాన పాడినిచ్చే జంతువు. ఒకటి ప్రతిపాదనను అయినా మార్చుకోవాలి. లేకపోతే గేదెనైనా ప్రతిపాదనలో చేర్చాలి. ఇలా అవగాహన లేకుండా ఆదేశాలు జారీ చేస్తే పరిస్థితి సమస్యాత్మకంగా మారే ప్రమాదం ఉంది. ఏదైనా అభిప్రాయాన్ని కేవలం రాజకీయ కోణంలో నుంచి కాకుండా సామాజిక, భౌగోళిక కోణంలో నుంచి కూడా చూడాలి. అప్పుడే చేసిన ప్రతిపాదనకు అర్ధం చేకూరుతుందని చెప్పాలి.
T.V.SRIKAR