జగన్ ను ఏకాకి చేస్తున్న వైసీపీ నేతలు పార్టీ వీక్ అవుతోందా ? వీకయ్యేలా చేస్తున్నారా ?

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని...ఆయన నమ్ముకున్న నేతలే ముంచేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం పదవులు అనుభవించారు. భారీగా ఆస్తులు కూడబెట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2025 | 03:47 PMLast Updated on: Jan 31, 2025 | 3:47 PM

Former Chief Minister And Ycp Leader Jagan Mohan Reddy Is Being Drowned By The Leaders He Believed In

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని…ఆయన నమ్ముకున్న నేతలే ముంచేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం పదవులు అనుభవించారు. భారీగా ఆస్తులు కూడబెట్టారు. తీరా వైసీపీ ఓడిపోయేసరికి…జగన్ అంటే ఎవరో అనే వ్యవహరిస్తున్నారు. జగన్ తో రాసుకు పూసుకొని తిరిగిన నేతలంతా…ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం…జగన్ పై ప్రశంసలు కురిపించిన నాయకులే…ఇపుడు తెగుడుతున్నారు. మరికొందరు విమర్శలు చేయకపోయినా…పార్టీకి మాత్రం రాం రాం చెబుతున్నారు. ఇంకొందరు అదే ఆలోచనల్లో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వైసీపీలో నెంబర్-2గా ఓ వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డి…రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో…ఇతర నేతలంతా పునరాలోచనలో పడ్డారు. నాలుగు దశాబ్దాల అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డే…జగన్ కు, పార్టీకి దూరమైతే…మనమెంత అని ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఏ మంత్రి పార్టీకి ఝలక్ ఇస్తాడో…? ఏ మున్సిపల్ ఛైర్మన్ కండువా మార్చేస్తాడో ? అన్న టెన్షన్ వైసీపీ నేతలకు పట్టుకుంది.

కాంగ్రెస్ ను ఎదిరించి…పార్టీని స్థాపించారు జగన్. 2019 ఎన్నికల్లో సింగిల్ పోటీ చేసి…151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ స్థానాలతో పార్టీని విజయపథంలో నడిపించారు. కనీవినీ ఎరుగని సీట్లు సాధించిన జగన్…ఐదేళ్లు తిరిగే సరికి…చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా…జస్ట్ 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం అయ్యారు. అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డికి వరుస కష్టాలు షురూ అయ్యాయి. నేతలంతా తలో దారి చూసుకుంటున్నారు. మొన్నటి వరకు ఏ పార్టీని అయితే నానా బూతులు తిట్టారో…ఇప్పుడు అదే పార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నారు. మరికొందరు ఇప్పటికే కండువాలు మార్చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో కీలక నేతలంతా సైలెంట్ అవ్వడం, ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండడంతో…పార్టీ పరిస్థితిపై అంతర్గత చర్చ మొదలైందని సమాచారం. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన గ్రాఫ్ ను చక్కదిద్దే పనులు వైసీపీ చేస్తుందా ? అంటే లేదనే చెప్పాలి. తాజా పరిస్థితులు చూస్తుంటే మళ్లీ ఎన్నికల సమయానికి అసలు పార్టీలో ఉండేదెవరు ? వీడెదవరు ? అన్నట్లు పార్థీ పరిస్థితి తయారైంది.

మంత్రులుగా పని చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, అవంతి శ్రీనివాస్, వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, మాజీ ఐఏఎస్ ఇంతియాజ్…ఇప్పటికే వైసీపీకి గుడ్ చెప్పేశారు. తాజాగా విజయసాయిరెడ్డి రాజకీయాలకే రాం రాం చెప్పేశారు. బయట నుంచి ఒత్తిళ్లు, పార్టీలో పరిస్థితులతో వీరంతా వైసీపీని వీడినట్లు తెలుస్తోంది. పార్టీ వీడుతున్న నేతలను బుజ్జగించాల్సిన జగన్…తనకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పైగా పార్టీ నుంచి వెళ్లిపోయే వారంతా…వెళ్లిపోవచ్చని బహిరంగంగా చెబుతున్నారు. నా అనుకున్న వాళ్లే పార్టీలో ఉంటారని…సమీక్ష సమావేశాల్లో తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. నాయకుడిగా నేతలను బుజ్జగించాల్సింది పోయి…పోతే పోనీలే అనేలా వ్యవహరించడం నేతలకు మింగుడు పడటం లేదు. అధినేతకే పార్టీని కాపాడుకోవాలన్న కోరిక లేకపోతే…తమకు ఎలా ఉంటుందని నేతలు తమ సన్నిహితులు వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇస్తున్న జగన్…తాను మాత్రం పాల్గొనకపోవడం…కింది స్థాయి నేతలతో పాటు కార్యకర్తలకు రుచించడం లేదు. ముందుండి నడిపించాల్సిన నాయకుడే…బెంగళూరుకు వెళ్లి జల్సాలు చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

పార్టీలో నంబర్-2గా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో…ఇతర నేతలు ఆందోళనలో పడిపోయారు. విజయసాయిరెడ్డి వైసీపీని వీడడం, రాజకీయాలకు గుడ్ బై చెప్పడం…చూస్తుంటే…వైసీపీ కోలుకుంటుందా ? అన్న చర్చ మొదలైంది. వైసీపీకి ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిలో కొందరు ఇప్పటికే బీజేపీ, టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. జగన్ తోపాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అయోధ్య రామిరెడ్డి…రేపో మాపో రాజీనామా చేస్తారన్న ప్రచారం సాగుతూనే ఉంది. ఆయనొక్కడే కాదు…మిగిలిన ఎంపీలంతా ఎవరికి వారు…తమ ప్రయత్నాల్లో మునిగిపోయినట్లు కోడైకూస్తోంది. పార్టీ క్యాడర్, కీలక నేతలకు జగన్ అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తానన్న వైఎస్ జగన్.. ఇంకా తన పర్యటనపై స్పష్టత ఇవ్వలేదు. వైసీపీ కనీసం ప్రతిపక్షంగా కూడా పనిచెయ్యట్లేదనే విమర్శలు వస్తున్నాయి.