Top story:మరోసారి తెరపైకి కేతిరెడ్డి గెస్ట్ హౌస్ వివాదం, ప్రభుత్వ భూమి కబ్జా – గుర్రాలకొండపై నిర్మాణం

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి రెవెన్యూ అధికారులు షాకిచ్చారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గుర్రాల కొండపై గెస్ట్ హౌస్ నిర్మించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2025 | 02:20 PMLast Updated on: Apr 04, 2025 | 2:20 PM

Former Dharmavaram Mla And Ysrcp Leader Kethireddy Venkatrami Reddy Was Shocked By The Revenue Officials

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి రెవెన్యూ అధికారులు షాకిచ్చారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గుర్రాల కొండపై గెస్ట్ హౌస్ నిర్మించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి…గెస్ట్ హౌస్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ స్థలం ప్రభుత్వ భూమి కాదని…గతంలోనే కోర్టును ఆశ్రయించారు కేతిరెడ్డి. దీంతో రెవెన్యూ శాఖ పూర్తి సర్వే చేసింది. మొత్తం రెండున్నర ఎకరాల భూమిని కుటుంబసభ్యుల పేరుతో రిజిస్ట్రర్ చేయించినట్లు గుర్తించింది. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెళ్లారు. కొండపైకి వెళ్లే మార్గం గేటుకు తాళం వేసి ఉండటంతో రెవెన్యూ అధికారులు వెనక్కి వచ్చేశారు. త్వరలో కేతిరెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. గెస్ట్ హౌస్‌ను ఖాళీ చేయాలని, లేదంటే తామే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు చెప్పే అవకాశం ఉంది.

ధర్మవరం శక్తివడియార్ చెరువు భూమిని, అక్రమ నిర్మాణాలను నిగ్గు తేల్చడానికి రెవెన్యూ, చిన్ననీటి పారుదలశాఖ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి గతంలోనే నోటీసులు ఇచ్చారు. ఆక్రమిత భూములను బినామీ పేర్లతో రికార్డులు సృష్టించిన వైనంపై రికార్డులు వెలికితీసిన అధికారులు, బినామీదారులకు కూడా నోటీసులు ఇచ్చారు. ప్రకృతి సిద్ధమైన నీటి వనరులు ఆక్రమిస్తున్నారని…వైసీపీ హయాంలో ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోలేదు. గతేడాది ప్రభుత్వం మారగానే చెరువును ఆక్రమించారంటూ నోటీసులిచ్చారు. చెరువు భూమిని ఆక్రమించారని, వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వంలో చెరువు భూములను ఆక్రమించి బినామీలుగా బంధువులు, అనుచరుల పేర్లతో రికార్డులు సృష్టించినట్లు గతంలోనే తేల్చారు.

ధర్మవరం మండలంలోని శక్తివడియార్ చెరువు, దాని పరీవాహక ప్రాంత భూమికి సంబంధించి దశాబ్దాలనాటి రికార్డులను అధికారులు బయటకు తీశారు. ఈ చెరువుకు సంబంధించి సర్వే నెంబర్ 908లో 9.30 ఎకరాలు, 909 సర్వే నెంబర్​లో 7.90 ఎకరాలు, 910లో 2.50, సర్వే నెంబర్ 661-1లో 0.91 సెంట్లను ఆక్రమించారని గాలి వసుమతి, తదితరులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆక్రమిత భూమి వివరాలను సమగ్రంగా నోటీసులో చూపుతూ 20.61 ఎకరాల భూమిని వారం రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు చెప్పారు. నోటీసులు నేరుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి చిరునామాకు పంపించారు. ఆ సమయంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య వసుమతి ఇంట్లో లేకపోవడంతో, వెంకట్రామిరెడ్డి పీఏ ముకేష్ నోటీసులు తీసుకున్నారు.

చెరువుతో పాటు చుట్టూ పరీవాహక ప్రాంతంలోని నీటిపారుదలశాఖతో పాటు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని నోటీసులో చూపించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెరువును ఆక్రమించారని గతంలో జంగా రమేష్ అనే సామాజిక వేత్త అధికారులకు ఫిర్యాదులు చేశారు. అధికారుల అవినీతిని, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆక్రమణలను ఎండగడుతూ రమేష్ హరిత ట్రైబ్యునల్​ను ఆశ్రయించారు. హరిత ట్రైబ్యునల్​లో కేసు విషయాన్ని కూడా తహసీల్దార్ నోటీసులో చెప్పుకొచ్చారు. గుర్రాలకోటను బద్దలు కొట్టి, భూములు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమాయత్తం అవుతున్నారు.