Harisha Rao : కండువా మార్చిన హరీష్..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కండువా మార్చారు. ఆయన మెడలో మళ్లీ పాత కండువా దర్శనమిచ్చింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కండువా మార్చారు. ఆయన మెడలో మళ్లీ పాత కండువా దర్శనమిచ్చింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో… పటాన్‌చెరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో హరీష్ పాల్గొన్నారు. హరీష్ రావు మెడలో బీఆర్ఎస్‌కి బదులు టీఆర్ఎస్ కండువా ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. అక్కడున్న కార్యకర్తల మెడలో బీఆర్ఎస్ కండువా ఉండగా.. హరీష్ ఒక్కరే టీఆర్ఎస్ కండువా వేసుకున్నారు.
దీంతో బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్‌గా మారుతుందన్న చర్చ మళ్లీ మొదలైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పార్టీ పేరు తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలని పార్టీ నేతల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయ్. ఈ మధ్యే మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా.. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మారడంతో తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆరేళ్ల పాటు ఇతరులకు కేటాయించకుండా ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలంటే ఎన్నికల సంఘం అంగీకరించాల్సి ఉంటుంది. పేరు మార్పు కోసం పార్టీ నియమావళిని సైతం మార్చాల్సి ఉంటుందని సమాచారం.
ఇప్పటికే ఈ దిశగా చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల మధ్య.. హరీష్ మెడలో కండువా కొత్త చర్చకు కారణం అవుతోంది. బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా మారనుందా… హరీష్ అదే సంకేతం ఇచ్చారు.. బీఆర్ఎస్ కండువాకి బదులు టీఆర్ఎస్ కండువా వేసుకోవడం వెనుక ఆంతర్యమేంటనే డిస్కషన్ మొదలైంది. పొరపాటున ఆ కండువా వేసుకున్నారా.. లేక కావాలనే వేసుకున్నారా.. కండువాలు లేక పాత కండువా వేసుకోవాల్సి వచ్చిందా అనేది ఆసక్తికరంగా మారింది.