Imran Khan: నాడు పీఎంగా రాజభోగం.. నేడు ఖైదీగా మిలిటెంట్లతో సావాసం
ఇమ్రాన్‌ఖాన్.. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి.. పాక్ పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ ఆడిన ఇమ్రాన్ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. పాక్ రాజకీయ చరిత్రలో చాలా మంది ప్రముఖులు జైలు జీవితం అనుభవించారు. కానీ ఇమ్రాన్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది.
ఇమ్రాన్‌ఖాన్.. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి.. పాక్ పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ ఆడిన ఇమ్రాన్ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. పాక్ రాజకీయ చరిత్రలో చాలా మంది ప్రముఖులు జైలు జీవితం అనుభవించారు. కానీ ఇమ్రాన్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఒకప్పుడు ప్రధాని కార్యాలయంలో బ్యూరోక్రట్స్, పొలిటికల్ లీడర్స్ మధ్య నిత్యం కాలం గడిపిన ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు కరుడుగట్టిన మిలిటెంట్లతో సావాసం చేస్తున్నారు. రాజకీయ నేతగా ఆయన చేసిన వివాదాస్పద ప్రయాణం ఇప్పుడు ఇమ్రాన్‌ను కరుడుగట్టిన నేరస్థుల వద్దకు చేర్చింది.
నాటికీ నేటికీ ఎంత తేడానో..!
గతేడాది ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి.. పదవి నుంచి తప్పుకున్న ఇమ్రాన్ అప్పటి నుంచి రాజకీయంగా సంక్షోభాన్ని చూస్తున్నారు. అవినీతి కేసులు ఒక్కసారిగా చుట్టు ముట్టాయి. పదవి నుంచి తప్పించడానికి వ్యతిరేకంగా ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టినా ఇప్పుడా పరిస్థితి లేదు. గతేడాది మేలో ఆయన్ను కస్టోడియల్ కండిషన్ పై అదుపులోకి తీసుకున్నప్పుడు ఆయన్ను ఇస్లామాబాద్‌లో ఓ గెస్ట్ హౌస్‌లో ఉంచారు. ప్రజలను పార్టీ నేతలను కలవడానికి కూడా సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఆయన ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలంటే.. పక్కనే ఉండేది కరుడుగట్టిన నేరస్థులు మాత్రమే.
ఆ జైల్లో ఉండేది వాళ్లు మాత్రమే..!
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావెన్స్ లో ఉంది అటోక్ జైలు. ఈ జైల్లో ఉండేది సాధారణ ఖైదీలు కాదు. ఎక్కువ మంది కరుడుగట్టిన నేరస్థులే. వీరిలో ఉగ్రవాదులు కూడా ఉంటారు. జీవితంలో తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లను ఈ జైల్లో ఉంచుతారు. జైల్లో పరిస్థితులు కూడా చాలా దారుణంగా , కఠినంగా ఉంటాయి. నొటోరియస్ క్రిమినల్స్ ను ఎలా ట్రీట్ చేయాలో అలాంటి కండిషన్స్ ఇక్కడ ఉంటాయి. అలాంటి జైల్లో.. ఉగ్రవాదుల మధ్య..రోజులు గడపాల్సి వస్తుందని ఇమ్రాన్ ఖాన్ ఊహించి ఉండరు. పాకిస్థాన్ చరిత్రలో ఒక మాజీ ప్రధానిని అటోక్ జైల్లో ఉంచడం ఇదే తొలిసారి. ఈ జైల్లో పేరుకే వీవీఐపీ సెల్స్ ఉంటాయి. సౌకర్యాలు మాత్రం సాధారణ ఖైదీలతో సమానంగా ఉంటాయి.
ఆ జైల్లో పెట్టడం వెనుక కుట్ర ఉందా ?
తోషిఖానా కేసులో న్యాయస్థానం ఇమ్రాన్ ఖాన్‌కు జైలు శిక్ష విధించినా ఆయన్ను అటోక్ జైలుకు తరలించమని మాత్రం ఆదేశించలేదు. రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలిస్తారని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం అనూహ్యంగా ఇమ్రాన్‌ను కరుడుగట్టిన నేరస్థులు ఉండే అటోక్ జైల్లో పెట్టింది. ఇమ్రాన్ పొలిటికల్ కెరీర్‌ను అంతమొందించేందుకే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించి ఉంటుందని ఆయన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.