Actress Divya Vani: కాంగ్రెస్ గూటికి సినీ నటి దివ్యవాణి.. మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో చేరిక
గత ఏడాది జరిగిన టీడీపీ మహానాడు వేదికపై ఆమెకు సరైన గౌరవం దక్కలేదు. నేతల తీరు కూడా సరిగ్గా లేకపోవడంతో దివ్యవాణి మనస్థాపానికి గురయ్యారు. కొంతకాలం పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు 2022 మే 31న టీడీపీకి రాజీనామా చేశారు.
Actress Divya Vani: సినీ నటి, టీడీపీ మాజీ నేత దివ్య వాణి చౌదరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే.. దివ్యవాణికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివ్యవాణి గతంలో టీడీపీలో పని చేశారు. సుదీర్ఘకాలం ఆమె టీడీపీకి సేవలందించారు. ఏపీ టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. టీడీపీలో ఉన్న సమయంలో వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే, ఆ తర్వాత నుంచి ఆమెకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది.
గత ఏడాది జరిగిన టీడీపీ మహానాడు వేదికపై ఆమెకు సరైన గౌరవం దక్కలేదు. నేతల తీరు కూడా సరిగ్గా లేకపోవడంతో దివ్యవాణి మనస్థాపానికి గురయ్యారు. కొంతకాలం పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు 2022 మే 31న టీడీపీకి రాజీనామా చేశారు. అయినప్పటికీ తన పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడతానని చెప్పారు. చంద్రబాబుతో చర్చించిన తర్వాత టీడీపీలో కొనసాగుతానని చెప్పుకొచ్చారు. కానీ, పార్టీ నుంచి సరైన స్పందన రాలేదు. ఆ తర్వాత బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లుగానే ఆమె కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి అగ్రనేతలతో సమావేశమయ్యారు. కానీ ముందడుగు పడలేదు. దీంతో ఇంతకాలం సరైన రాజకీయ వేదిక కోసం వేచి చూసిన దివ్య వాణి తాజాగా కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ మంచి జోష్ మీదున్న సంగతి తెలిసిందే.
ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. పార్టీ కూడా చేరికలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. దివ్యవాణికి ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఆమెకు ప్రచార బాధ్యతల్ని అప్పగించినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయబోతున్నారు. దివ్య వాణి ప్రచారం పార్టీకి ఏమేరకు కలిసొస్తుందో చూడాలి.