గులాబి సింగం బయటకు వచ్చింది.. అసెంబ్లీలో జూలు విదిలిస్తుందా…?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచడానికి రెడీ అయ్యారు. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న కేసీఆర్.. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచడానికి రెడీ అయ్యారు. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న కేసీఆర్.. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయంగా తెలంగాణలో తమ పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు కేసిఆర్ సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ఆయన బయటకు రావడం లేదని.. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు బయటకు రావడానికి ఆసక్తి చూపించలేదు.
2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆయన పెద్దగా బయటకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అటు ఆయనపై విమర్శలు చేస్తున్నా.. ఇటు పార్టీ ఇబ్బందులు పడుతున్నా.. మరోవైపు కేటీఆర్ పై కేసులు నమోదు చేస్తున్నా… ఆయన మాత్రం బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. అటు కవిత బెయిల్ పై రిలీజ్ అయిన తర్వాత కూడా కెసిఆర్ బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇక కేటీఆర్ ను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నా… రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్న కేసీఆర్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు.
ఇక తాజాగా ఆయన ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ నేతలతో చర్చించారు కేసీఆర్. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టాలి.. బడ్జెట్ సమావేశాల్లో పోరాటాలు ఏ విధంగా చేయాలి అనేదానిపై ఆయన పార్టీ నేతలతో చర్చించారు. ఇక పార్టీ పెట్టి 24 ఏళ్లు పూర్తయి.. 25వ ఏట అడుగు పెడుతున్న నేపథ్యంలో కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
కెసిఆర్ కు జాతీయ, రాష్ట్రస్థాయి మీడియాలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఆయన మీడియా సమావేశాలను జాతీయ మీడియా కూడా గమనిస్తూ ఉంటుంది. చాన్నాళ్ల తర్వాత కేసీఆర్ బయటకు రావడంతో ఆయన ఏం మాట్లాడతారు అనే దానిపై అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందనే ప్రచారం కూడా కొన్నాళ్లుగా జరుగుతుంది. పార్టీలోని కీలక నేతలకు, మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఎండగట్టాలని.. గతంలో వివిధ వర్గాలకు భారత రాష్ట్ర సమితి చేసిన మేలును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆయన తెలంగాణ భవన్ కు వెళ్లడంతో కచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు కూడా వస్తారని అంచనా వేస్తున్నారు పార్టీ నేతలు. ఇక త్వరలోనే గులాబీ పార్టీ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తోంది.