Gaddar: అవిశ్రాంత పోరాట యోధుడు గద్దర్.. అసంతృప్తితో నిష్క్రమించారా..?

తెలంగాణ ఉద్యమానికి గొంతిస్తే... తెలంగాణ వచ్చిన తర్వాత గుర్తింపు లేకుండా పోయింది. తాను హైదరాబాదులో కుటుంబంతో సుఖంగా ఉన్నానని... తన మాటకు పాటకు ప్రభావితమై వందల మంది అమరులైపోయారని విమర్శ మిగిలింది. గద్దర్ ఎవరి వాడు... తెలియని అయోమయ స్థితిలో ఆయన అంతిమయాత్ర నడిచింది. నీ చివరి రోజు నీ ఆత్మ కథకు శీర్షిక అవుతుందనే మాట గద్దర్ జీవితం నిజం చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 7, 2023 | 02:33 PMLast Updated on: Aug 07, 2023 | 2:33 PM

Gaddar A Tireless Fighter Did He Quit With Dissatisfaction

గద్దర్ అడవిని ఎందుకు వదిలిపెట్టాడు? మావోయిస్టులు బయటికి పంపారా? ఆయనే మావోయిస్టులని వదిలిపెట్టారా అన్నది ఇప్పటికి వివాదాస్పద రహస్యంగానే మిగిలిపోయింది. నువ్వు జనంలో తిరుగుతున్నావ్… ఒక స్కూలు పెట్టు కున్నావ్.. కుటుంబంతో కలిసి బతుకుతున్నావ్? నీ మాటకు నీ పాటకు ప్రభావితమై అడవుల్లోకి వెళ్లి.. అన్యాయం అయిపోయిన వాళ్ల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నకు గద్దర్ నుంచి ఎప్పుడూ సంపూర్ణమైన సమాధానం రాలేదు? అన్నిటికీ మించి 2018లో ఆయన ప్రజాస్వామిక ఎన్నికల్లో ఓటేశారు? అంతకు ముందు నుంచి రకరకాల రాజకీయ ప్రయోగాలు చేశారు. సొంతంగా పార్టీ పెట్టారు.. కేఏ పాల్ పార్టీలోకి వెళ్లారు, తన కొడుకు చేరారు, ఆ తర్వాత గద్దర్ చేరారు.. ఈమధ్య రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఏకంగా సభలో రాహుల్ గాంధీని కౌగిలించుకుని ముద్దాడి తాను పూర్తిస్థాయి కాంగ్రెస్ వాదిగా మారిన విషయాన్ని జనం ముందు ఉంచారు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి… ఇన్నేళ్లు ఉద్యమం ఇంత రక్త తర్పణం.. ఈ పోరాటం ఇవన్నీ అవసరమా అనే ప్రశ్న కూడా వెల్లువెత్తింది.

గద్దర్ ఏమిటి… బూర్జువా పార్టీల చెంతన చేరడం ఏమిటి..? భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే..? అవి జెండా రంగులే వేరు తప్ప అన్ని పార్టీలు ఒకే రకంగా.. ఫైనల్ గా అధికారాన్ని ఛేదించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాయి. ఆమాత్రం దానికి ఏ పార్టీ అయినా ఒకటే.. అడవిని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత తన విధానాన్ని గద్దర్ స్పష్టంగా చెప్పలేకపోయారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుందా రాదా అన్నది తేల్చి చెప్పలేకపోయారు. కొన్నాళ్ళు మావోయిస్టులకు అనుకూలంగా గొంతు వినిపించడం… మరికొన్నాళ్లు తెలంగాణకు అనుకూలంగా.. గొంతు  పలకడం.. తన స్పష్టమైన విధానాన్ని గద్దర్ జనం ముందు ఉంచలేకపోయారు. కొందరు విమర్శకులు అస్తిత్వం కోసం చివరి రోజుల్లో గద్దర్ తపనపడ్డాడని… అన్నారు కూడా. ప్రతి గూటికి వెళ్లి.. ఆ పక్షి కూస్తే అది ఏ గూటి పక్షో ఎలా తెలుస్తుంది. గద్దర్ విషయంలోనూ అదే జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక.. గద్దర్ కు ఏదైనా పదవి వస్తుందని అందరూ ఆశించారు. కోదండ రామ్ నే.. పూచిక పుల్లలా పక్కన పెట్టిన కేసీఆర్… తెలంగాణ క్రెడిట్ ని మరొకరికి ఇస్తారా? స్టేజ్ కూడా ఎక్కనివ్వలేదు? అంతేకాదు గాయకుడు గోరేటి వెంకన్నకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.. ఏదో ఒక గుర్తింపు దక్కుతుందనుకున్న గద్దర్ కి… ఇది చాలా అవమానకరంగా అనిపించింది. అసలు తన ప్రయాణం ఎటువైపు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి. తాను నమ్ముకున్న తుపాకీ గొట్టం.. వామపక్ష ఉద్యమం.. ఆర్థిక సంస్కరణ తర్వాత పూర్తిగా విఫల ప్రయత్నం అని తెలిసిపోయింది.

తెలంగాణ ఉద్యమానికి గొంతిస్తే… తెలంగాణ వచ్చిన తర్వాత గుర్తింపు లేకుండా పోయింది. తాను హైదరాబాదులో కుటుంబంతో సుఖంగా ఉన్నానని… తన మాటకు పాటకు ప్రభావితమై వందల మంది అమరులైపోయారని విమర్శ మిగిలింది. చివరికి తెలంగాణ… కుహానా ప్రజాస్వామ్య పార్టీలు పెట్టుబడిదారుల చేతికి చిక్కింది. పోరాటాల స్వరం ఒకే ప్రాంతానికి పరిమితం అయిపోయింది. వందల వేల మంది నక్సలైట్లను హత్య చేసిన కాంగ్రెస్ పార్టీ చెంతకు ఆయన చేరాల్సి వచ్చింది. గద్దర్ ఎవరి వాడు… తెలియని అయోమయ స్థితిలో ఆయన అంతిమయాత్ర నడిచింది. నీ చివరి రోజు నీ ఆత్మ కథకు శీర్షిక అవుతుందనే మాట గద్దర్ జీవితం నిజం చేసింది.