Galla Jaya Dev: యాక్టివ్‌ పాలిటిక్స్‌కు గల్లా జయదేవ్‌ గుడ్‌బై

రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్‌.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం కాబోతున్నారా..? బిజినెస్‌, పాలిటిక్స్‌ రెండింటిలో తన ఓటు బిజినెస్‌కే అని ఆయన తేల్చారా..? రాజకీయం ఎఫెక్ట్ తన వ్యాపారంపై పడకుండానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 16, 2023 | 03:07 PMLast Updated on: Jul 16, 2023 | 3:07 PM

Galla Jayadev Who Contested As Mp From Guntur Wants To Say Goodbye To Politics And Develop His Businesses

గల్లా జయదేవ్‌..టీడీపీ నేత..గుంటూరు ఎంపీ.. 2014లో తొలిసారి ఎంపీగా గెలిచారు. 2019లో జగన్‌ వేవ్‌ను కూడా తట్టుకుని రెండోసారి గుంటూరు నుంచే విజయం సాధించారు. అయితే ముచ్చటగా మూడోసారి పోటీకి మాత్రం నై అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ మరింత పుంజుకున్నా, మరోసారి గెలిచే అవకాశం ఉన్నా ఆయన మాత్రం పోటీపై ఆసక్తి చూపించడం లేదని సమాచారం. గత అనుభవాలు, వైసీపీ ప్రభుత్వం తనను, తన వ్యాపారాన్ని టార్గెట్ చేసిన తీరు చూశాక ఆయన పోటీ చేయకుండా ఉంటే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కుటుంబ రాజకీయ నేపథ్యం
గల్లా జయదేవ్ ప్రస్తుతం అమర్‌రాజా బ్యాటరీస్‌కు ఛైర్మన్‌, ఎండీ, సీఈఓగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరారు. తల్లి గల్లా అరుణ కుమారి అడుగుజాడల్లో నడిచారు. ఆమె 2004 నుంచి 2014వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. గల్లా తాత కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన గల్లా ఇప్పుడు రాజకీయాలకు దూరం కావడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. రాజకీయం ప్రభావం గల్లా కుటుంబ వ్యాపారంపై పడింది.

అసలు ఏం జరిగింది..?
గల్లాపై ఫోకస్ పెట్టిన వైసీపీ ప్రభుత్వం అమరరాజా బ్యాటరీస్‌ను టార్గెట్ చేసింది. తిరుపతిలోని కరకంబాడి, నూనెగుండపల్లి ప్లాంట్లను మూసివేయాలంటూ పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డు నోటీసులు ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని ఆరోపించింది. హైకోర్టు ఆ నోటీసులపై స్టే ఇచ్చింది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ వ్యవహారం తమ వ్యాపార విస్తరణపై పడిందని అమర్‌రాజా బ్యాటరీస్ చెబుతోంది. తన ఆర్థిక మూలాలను దెబ్బతీయడంతో గల్లా తట్టుకోలేకపోయారు. ఏపీలోని తమ విస్తరణ ప్రణాళికలను ఆపివేసారు. ఈ ఏడాది మేలో తెలంగాణలో గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు అమర్‌రాజా ప్రకటించింది. రూ.9,500కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది.

టీడీపీతో దూరం.. దూరం
వైసీపీ ప్రభుత్వం తనను టార్గెట్ చేశాక గల్లా జయదేవ్‌ టీడీపీతో దూరంగా ఉంటున్నారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నా పార్టీ కార్యక్రమాలకు మాత్రం రావట్లేదు. నియోజకవర్గానికి వచ్చి చాలా రోజులైంది. కనీసం ఎన్నికల సమయంలో అయినా ఆయన గుంటూరుకు వస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా యాక్టివ్‌ పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పాలన్న నిర్ణయానికి గల్లా వచ్చినట్లు తెలుస్తోంది.

రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటే వైసీపీ ప్రభుత్వం తన వ్యాపారాన్ని మరింత దెబ్బతీస్తుందని గల్లా జయదేవ్‌ భయపడుతున్నారు. ఇప్పటికే తమ వ్యాపారంపై దాని ప్రభావం పడిందని, ఆ కేసుల నుంచి బయట పడటానికే చాలా సమయం పడుతుందని ఆయన సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. మరోసారి పోటీ చేసి తలబొప్పి కట్టించుకోలేనని చెబుతున్నారట. టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా గల్లా జయదేవ్ తన నిర్ణయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తొందరపడొద్దని మరోసారి ఆలోచించాలని బాబు సూచించారంటున్నారు. అయినా సరే గల్లా జయదేవ్ తన నిర్ణయం మార్చుకోకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గుంటూరు లోక్‌సభ బరిలో ఈసారి టీడీపీ తరపున కొత్తముఖం బరిలోకి దిగే అవకాశం ఉంది.