Top story: అమ్మ అదానీ… ఇంత చేశావా….? జగనన్న పేరు కూడా ఉందండోయ్…!
మల్టీ బిలియనీర్ అదానీ చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోంది... ఆర్థిక నేరాల కేసులో ఆయన అరెస్ట్ కు అమెరికాలో వారంట్ జారీ అయ్యింది. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం వేల కోట్లు లంచాలు వెదజల్లినట్లు అదానీపై ఆరోపణ. ఈ ఎపిసోడ్ లో వైఎస్ జగన్ పేరుండడం మరో ట్విస్ట్...
మల్టీ బిలియనీర్ అదానీ చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోంది… ఆర్థిక నేరాల కేసులో ఆయన అరెస్ట్ కు అమెరికాలో వారంట్ జారీ అయ్యింది. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం వేల కోట్లు లంచాలు వెదజల్లినట్లు అదానీపై ఆరోపణ. ఈ ఎపిసోడ్ లో వైఎస్ జగన్ పేరుండడం మరో ట్విస్ట్…
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఈసారి పెద్ద సూప్ లోనే చిక్కుకున్నారు. కేవలం ఆరోపణలు కాదు… అమెరికాలో ఏకంగా కేసే నమోదైంది. అమెరికన్లను మోసం చేసినందుకు బ్రూక్లిన్ లోని ఫెడరల్ కోర్టు అదానీపై అభియోగాలు మోపింది. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రియాన్ పీస్ ఆదేశాల మేరకు మొత్తం ఐదు అభియోగాలతో అదానీ సహా ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో గౌతమ్ అదానీ మేనల్లుడు సాగర్ అదానీ కూడా ఉన్నారు.
భారత్ లో భారీ సోలార్ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ భారీగా లంచాలు ఇచ్చారు. భారతీయ అధికారులకు దాదాపు 265మిలియన్ డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 2వేల 29 కోట్లకు పైగా వెదజల్లారు. మన దేశంలో ప్రాజెక్టు కోసం మన దేశపు అధికారులకు లంచాలు మేపితే అమెరికా మధ్యలో ఎందుకు దూరింది అన్న సందేహం వస్తుంది కదా…! అక్కడే ఉంది అసలు కథంతా… మన దగ్గర వస్తున్న ప్రాజెక్టును చూపి అమెరికాలో ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు వసూలు చేశారు అదానీ. దాదాపు 2 బిలియన్ డాలర్లు 2 సిండికేట్ల నుంచి రాబట్టారు. ఇక అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలు ఇచ్చిన భరోసాను చూపించి అమెరికా సహా పలుదేశాల్లో ఇన్వెస్టర్ల నుంచి బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను రిలీజ్ చేసేందుకు స్కెచ్ వేశారు అదానీ. ఆ డబ్బును ఇక్కడ లంచాలుగా మేపారు. ఫారెన్ కరెప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఉల్లంఘన జరిగినట్లు అమెరికా సంస్థలు చెబుతున్నాయి. ఇది అక్కడ తీవ్రమైన నేరం. గౌతమ్ అదానీ మేనల్లుడు సాగర్ అదానీ ఫోన్ ను గతంలో అమెరికా పోలీసులు సీజ్ చేశారు. అందులో ఈ మొత్తం కేసుకు సంబంధించి కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవే గౌతమ్ అదానీ మెడకు ఉచ్చు బిగించొచ్చన్న అనుమానాలున్నాయి.
సంచలనమైన విషయం ఈ స్కామ్ లో ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అదానీ మొత్తం దేశంలో వెదజల్లిన 2వేల 29కోట్లలో అధిక భాగం అంటే 1,750 కోట్లు ఏపీలోనే ముట్టచెప్పినట్లు సమాచారం. గత ప్రభుత్వంతో అదానీ సంస్థలకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య 7వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. గౌతమ్ అదానీ స్వయంగా వచ్చి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. అమెరికా కోర్టు అభియోగాల్లో ఫారిన్ అఫిషియల్ అని ఉంది. ఆ ఫారిన్ అఫిషియల్ ఏపీకి చెందిన వ్యక్తే అని స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ ఫారిన్ అఫిషియల్ ఎవరు అన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తి అయి ఉంటాడని అనుమానాలున్నాయి.
తాము ఎలాంటి తప్పుడు పనులు చేయలేదని అదానీ గ్రూప్ స్పందించింది. దీనిపై న్యాయపరంగానే ముందుకెళతామని తెలిపింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఆర్థిక అరాచకాలకు పాల్పడుతున్న అదానీ వెనక నరేంద్రమోడీ ఉన్నారని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అదానీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. అదానీని అరెస్ట్ చేస్తే ఆ వెనకే ప్రధాని మోడీ కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అదానీ వెనక ఎవరున్నారో దేశం మొత్తానికి తెలుసన్నారు రాహుల్. మిగిలిన పార్టీలు కూడా బీజేపీపై దాడిని తీవ్రతరం చేశాయి. అయితే బీజేపీ మాత్రం ఈ కుంభకోణం జరిగిన రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు అధికారంలో లేవని అంటున్నాయి. ఏపీ, తమిళనాడు, ఒడిశాల్లో అప్పుడు బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయని… ఈ లంచాలతో తమకు సంబంధం లేదని వాదిస్తోంది బీజేపీ.
అదానీపై నమోదైన అభియోగాలు మాములువి కాదు.. చాలా తీవ్రమైనవి. దానిపై బైడెన్ సర్కార్ విచారణ జరుపుతోంది. తర్వాత వచ్చే ట్రంప్ సర్కార్ ఎలా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది. అమెరికాలో వేలకోట్ల పెట్టుబడులు పెట్టి 15వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని అదానీ గతంలో ప్రకటించారు. కోర్టులో విచారణ జరిగి అదానీ దోషి అని తేలితే మాత్రం ఆయన్ను అరెస్ట్ చేయక తప్పదు. భారత్-అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. అమెరికా ఒత్తిడి చేస్తే అదానీని అప్పగించాల్సి రావచ్చు. ట్రంప్-మోడీ మధ్య టర్మ్స్ బాగున్నాయి. ఒకవేళ మోడీ సాయంతో అదానీ అక్కడ్నుంచి తప్పించుకుంటారేమో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. దేశంలో చాలామంది మాత్రం ఏదో ఓ అస్త్రం ప్రయోగించి అదానీ తప్పించుకుంటారని భావిస్తున్నారు. గతంలో హిండెన్ బర్గ్ రిపోర్ట్ ప్రకంపనల నుంచి అదానీ సేఫ్ గా బయటపడ్డారు.. ఈసారి కూడా అలాంటి ఎత్తైమైనా వేస్తారేమో చూడాలి…