అదానీ ఊపిరి పీల్చుకో ట్రంప్ వచ్చాడు…
మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్న డైలాగ్...వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అప్లయి అవుతుంది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్న డైలాగ్…వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అప్లయి అవుతుంది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పటికపుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇస్తూ…ప్రపంచ దేశాలకు ఊహించని షాకులు ఇస్తున్నారు. తాజాగా ఇండియాకు చెందిన అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీకి ఊరట లభించే నిర్ణయం తీసుకున్నారు. అదానీ గ్రూప్, గ్రూప్‌లో పని చేసే వారిపై నమోదైన లంచం కేసు అంశంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అదానీపై దర్యాప్తు కోసం వినియోగించిన 50 ఏళ్ల నాటి చట్టం అమలుకు పూర్తిగా బ్రేకులు వేశారు. ఈ చట్టం అవసరం లేదని…విరామం ప్రకటించాలని యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండికి ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారాల్లో కొనసాగడానికి, ప్రాజెక్టులు దక్కించుకోవడానికి విదేశీ ప్రభుత్వాలు, అధికారులకు లంచం ఇచ్చే అమెరికా కంపెనీలు, విదేశీ సంస్థలపై చర్యలు తీసుకునే 1977 ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అమలును నిలిపేశారు.
సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడంలో భాగంగా అదానీ గ్రూపు రూ.2,100 కోట్లు భారత అధికారులకు లంచం ఇవ్వజూపిందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. గౌతమ్ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. అదానీపై దర్యాప్తు చేపట్టాలంటూ అమెరికా అధ్యక్షుడిగా అప్పుడున్న జోబైడన్ నేతృత్వంలోని న్యాయ శాఖ ఆదేశాలు జారీ చేయడంతో అదానీ గ్రూప్ ఛైర్మన్‌తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ లంచాలను చెల్లించడానికి, ప్రాజెక్టు నిధుల నిమిత్తం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికా బ్యాంకులు, పెట్టుబడిదార్ల నుంచి అదానీ గ్రూప్ భారీమొత్తంలో నిధులు సమీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.
తమ దర్యాప్తు దూకుడుగా కొనసాగుతుందని జస్టిస్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ లీసా హెచ్ మిల్లర్ తెలిపారు. ప్రపంచంలో ఏమూలైనా అమెరికా చట్టాలను ఉల్లంఘించినా సహించబోమని వెల్లడించారు. దీని ప్రభావం గౌతమ్ అదానీపై అమెరికా మోపిన అభియోగాల ప్రభావం…అదానీ కంపెనీలపై పడింది. అదానీ కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. అదానీ లిస్టెడ్ కంపెనీల మొత్తం వ్యాల్యూలో రూ.2.45 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. కొంతకాలంగా అవన్నీ పుంజుకుంటున్నాయి. అప్పట్లోనే అవినీతి ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను తోసిపుచ్చింది. అదానీ గ్రూపుపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేసింది. చట్టాలకు లోబడి తమ గ్రూపు నడుచుకుంటోందని వివరణ ఇచ్చింది. న్యాయపరంగా ముందుకెళ్తామనే అప్పట్లోనే ప్రకటించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత…గౌతమ్ అదానీ శుభాకాంక్షలు చెప్పారు. తాను అమెరికాలో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి 15,000 ఉద్యోగాలు సృష్టిస్తానని తెలిపారు. అదానీపై కేసుకు ఆదేశాలు జారీ చేసిన ప్రాసిక్యూటర్ బ్రియాన్ పీస్‌ను బైడెన్ కార్యవర్గం నియమించింది. ట్రంప్ అధికారంలోకి రాగానే పీస్ పదవి నుంచి దిగిపోవచ్చని భావించారు. అయితే అదానీపై ప్రయోగించి విదేశీ లంచాల చట్టాన్నే పూర్తి రద్దు చేశారు డోనాల్డ్ ట్రంప్.