ఖురాన్ పెన్ను ఇవ్వండి.. ఎన్‌ఐఏ ముందు తహవూర్ రాణా డిమాండ్లు
26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాను...జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. విచారణ అధికారులను...తహవూర్ రాణా ఏమేం కావాలని కోరాడు. మానసిక స్థితి, మతపరమైన నమ్మకం ఉందనేలా...కోరికలను బయటపెట్టాడు.

26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాను…జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. విచారణ అధికారులను…తహవూర్ రాణా ఏమేం కావాలని కోరాడు. మానసిక స్థితి, మతపరమైన నమ్మకం ఉందనేలా…కోరికలను బయటపెట్టాడు. మరి ఎన్‌ఐఏ అధికారులు…తహవూర్ అడిగినవన్నీ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ముంబై 26/11 దాడుల సూత్రధారి తహవూర్ రాణాను…ఎన్‌ఐఏ విచారిస్తోంది. జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ అధికారుల ముందు… తహవూర్ రాణా పలు డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. కస్టడీలో ఉన్న రాణా…తనకు ఇస్లామిక్ పవిత్ర గ్రంథం ఖురాన్, ఒక పెన్ను అడిగినట్లు సమాచారం. ఇవి అతని మానసిక స్థితి, మతపరమైన నమ్మకంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. తహవూర్ రాణా ఖురాన్‌ను అడగడం…అతని మతపరమైన అభిరుచులను సూచిస్తోంది. పెన్ను కావాలనడం ఏదైనా ముఖ్యమైన అంశాలను రాతపూర్వకంగా ఇవ్వడానికి లేదా నోట్స్ తీసుకుంటాడా అన్నది తెలియడం లేదు. ఇక ముడవది.. అతి ముఖ్యమైనది 26/11 దాడుల గురించి ప్రశ్నించే అవకాశం కోరడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. 26/11 దాడుల్లో తన పాత్రను వివరించాలనుకుంటున్నాడా ? లేదంటే మరేదైనా సమాచారాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నాడా అన్నది విచారణ అధికారులకు అంతుచిక్కడం లేదు.
ముంబయి ఉగ్రదాడి సూత్రధారి తహవూర్ రాణా విచారణలో కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఆర్మీ వైద్య దళంలో కొంతకాలం పనిచేసి బయటికొచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కూడా లష్కరే తోయిబా ఉగ్రవాదులు, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సంబంధీకులను కలిసేటప్పుడు ఆర్మీ యూనిఫాంనే రాణా ధరించానని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని విచారణ క్రమంలో ఎన్‌ఐఏ అధికారులకు రాణా చెప్పాడని తెలుస్తోంది. రాణా పాకిస్థాన్ సైనిక యూనిఫాంలో ఆర్మీకి చెందిన మేజర్ ఇక్బాల్‌ను కలిశాడని ఎన్ఐఏ వర్గాలు విచారణలో తేలింది. ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ నిఘా కార్యకలాపాలకు నిధులను సమకూర్చడం, పర్యవేక్షించడం, దిశానిర్దేశం చేయడం వంటివన్నీ ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్ చేసినట్లు అమెరికా అభియోగాలు నమోదు చేసింది. తనది పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న చిచావత్ని గ్రామమని రాణా చెప్పినట్లు సమాచారం. తన తండ్రి ఒక పాఠశాల ప్రిన్సిపాల్ అని తహవూర్ రాణా చెప్పినట్లు సమాచారం. ముగ్గురు అన్నదమ్ములలో రాణా ఒకడు. అతడి సోదరులలో ఒకరు పాకిస్తాన్ సైన్యంలో వైద్యుడిగా, మరొకరు జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.
అంతర్జాతీయ ఉగ్రవాది, భారతదేశ మోస్ట్ వాంటెడ్ నేరస్థుల్లో ఒకడైన సాజిద్ మీర్‌తో రాణాకు మంచి సంబంధాలు ఉండేవని దర్యాప్తులో వెల్లడైంది. 2008 నవంబరు 26 నుంచి 29 వరకు జరిగిన ముంబయి ఉగ్రదాడుల్లో మీర్ కీలక పాత్ర పోషించినట్లు తేలింది. ఆరుగురు బందీల మరణానికి దారితీసిన చాబాద్ హౌస్ ముట్టడికి ప్లాన్ ఇచ్చింది సాజిద్ మీరే అని ఆరోపణలు ఉన్నాయి. మీర్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చే వారికి 5 మిలియన్ల డాలర్ల బహుమతిని ఇస్తామని అమెరికా ప్రకటించింది. 2008లో ముంబయిలోని చాబాద్ హౌస్‌ను ఉగ్రవాదులు ముట్టడించే వేళ వారితో సాజిద్ మీర్ సమన్వయం చేసుకున్నట్లు నిర్ధరించే ఆడియో క్లిప్‌లను 2022లో ఐక్యరాజ్యసమితికి భారత్ అందించింది.