డాలర్ డ్రీమ్స్ వదులుకోండి…!

ఆ ఆశలు వదులుకోండి... మీ పిల్లలు అక్కడ్నుంచి ఏ క్షణమైనా వెనక్కు వచ్చేయాల్సి రావచ్చు. లేదు లేదు వాళ్లను అక్కడ్నుంచి వెనక్కు పంపించేయవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 9, 2025 | 01:30 PMLast Updated on: Apr 09, 2025 | 1:30 PM

Give Up Dollar Dreams Americas Hopes Are Empty

ఆ ఆశలు వదులుకోండి… మీ పిల్లలు అక్కడ్నుంచి ఏ క్షణమైనా వెనక్కు వచ్చేయాల్సి రావచ్చు. లేదు లేదు వాళ్లను అక్కడ్నుంచి వెనక్కు పంపించేయవచ్చు. తప్పు చేయాల్సిన పనిలేదు. చిన్న మిస్టేక్ వారి పాలిట కాస్ట్‌లీగా మారబోతోంది. అమెరికాలో ఉంటున్న ఇండియన్ స్టూడెంట్స్ లైఫ్‌ను మరింత నరకంగా మార్చేస్తున్నారు ట్రంప్. ఇప్పటికే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్లు అవుతోంది. విద్యార్థుల పాత తప్పులను తవ్వి తీస్తున్నారు అమెరికా అధికారులు. తప్పులంటే పెద్దపెద్దవి కాదు. కారు కాస్త స్పీడ్‌గా నడపడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, దురుసుగా ప్రవర్తించడం వంటి కారణాలు చూపించి వీసాలు రద్దు చేసేస్తున్నారు. గతంలో వీటికి చిన్న చిన్న ఫైన్లు మాత్రమే వేసేవారు.

కానీ ఇప్పుడు వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. కనీసం వీసా క్యాన్సిల్ చేసిన సమాచారాన్ని కాలేజీలకు కూడా ఇవ్వడం లేదు. నేరుగా విద్యార్థులకే ఆ ఇన్ఫో తెలిపి వారిని ఫ్లైట్ ఎక్కించేస్తున్నారు. గతంలో తప్పుచేసి వాటిని న్యాయపరంగా పరిష్కరించుకున్నా సరే ఆ కారణాన్ని చూపి ఇప్పుడు వీసా రద్దు చేసి పారేస్తున్నారు. ఇవే కాదు యూనివర్శిటీల్లో ఏదైనా ఆందోళనల్లో పాల్గొన్నా, వాటికి మద్దతు ఇచ్చినా, సోషల్ మీడియాలో వాటి అనుకూల వ్యాఖ్యలు చేసినా సరే కొంప మునిగిపోతోంది. వీసా రద్దు చేయడంతో వారు వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాల్సి వస్తోంది. ఒక్క భారతీయులనే కాదు అమెరికాలోని విదేశీ విద్యార్థులందరి పరిస్థితీ ఇదే.

ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అమెరికాలో తమ చదువు పూర్తికాగానే 12నెలల పాటు విదేశీ విద్యార్థులు తమ కోర్సులకు సంబంధించిన ప్రాక్రికల్ ట్రైనింగ్ కోసం అమెరికాలో ఉండే వీలుంటుంది. ఇంజనీరింగ్, మెడికల్ వంటి విభాగాల్లో ఉన్నవారికి అదనంగా మరో రెండేళ్లు అవకాశం దక్కుతుంది. ఈ సమయంలో ఏదో ఓ ఉద్యోగం తెచ్చుకుని ఆ వెంటనే H1B వీసాకోసం ప్రయత్నించేవారు. ఇది మన వాళ్లందరికీ ఓ వరంలా మారింది. రెండేళ్లలో ఎలాగోలా తిప్పలు పడి ఉద్యోగం సాధించేవారు. నైపుణ్యం కలిగిన వారికి ఆరేళ్లు అవకాశం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఓటీపీ విధానానికి మంగళం పాడాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అంటే చదువు పూర్తైన వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాల్సిందే. కొన్నాళ్లు అక్కడ ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నించే వీలుండదు. విదేశీ విద్యార్థులకు ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్‌కి ఇది గట్టి ఎదురు దెబ్బ.

భారతీయ విద్యార్థుల్లో ఎక్కువమంది తెలుగువారే. ఇప్పుడు వారందరి జీవితాలను దెబ్బకొట్టబోతున్నారు ట్రంప్. త్వరలోనే దీన్ని ఆమోదించుకోవాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. అదే జరిగితే అమెరికాలో చదువు ఆలోచనలను వదులుకోవాల్సిందే. గతేడాది 3.31లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకున్నారు. వీరిలో సుమారు లక్షమంది ఓపీటీని ఎంచుకున్నారు. ఇలాంటి లక్షలమందికి ఇక ఓపీటీ దూరం కానుంది. లక్షలు అప్పు తీసుకుని అమెరికాలో చదువుకుని అక్కడే ఉద్యోగం చేసి ఎలాగోలా ఆ భారాన్ని తొలగించుకునేవారు మన విద్యార్థులు. కానీ ఇకపై అలా కుదరదు. పరిస్థితులు బాగోలేకపోవడంతో చాలా యూనివర్శిటీలు మన విద్యార్థుల్ని సెలవలకు కూడా ఇళ్లకు వెళ్లొద్దని సూచిస్తున్నాయి. చదువుపూర్తై ఓపీటీలో ఉన్నవారు బయటకు వెళితే ఇక తిరిగి రాలేరని హెచ్చరిస్తున్నాయి. నిజానికి ఓపీటీ విధానాన్ని రద్దు చేయడానికి గతంలో చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ అది ఫలించలేదు. కోర్టులు కూడా జోక్యం చేసుకున్నాయి. అయినా సరే ట్రంప్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ఎలాగైనా ఈసారి దాన్ని గట్టెక్కించాలన్న పట్టుదలతో పావులు కదుపుతున్నారు.

కోటి ఆశలతో అగ్రరాజ్యం అమెరికాలో అడుగుపెట్టిన వారు ఇప్పుడు అర్థంతరంగా ఆ దేశాన్ని వదిలి రావాల్సి వస్తోంది. దీంతో నిపుణులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచిస్తున్నారు. మరి కొన్నేళ్లు అమెరికాను నమ్ముకుంటే కష్టమని అంటున్నారు. ట్రంప్ విధానాలనే తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఫాలో అయ్యే పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి వేరే దేశాలు ఎంచుకుంటే మంచిదంటున్నారు. లేదా మన దేశంలోనే ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీలను ఎంచుకోమని చెబుతున్నారు. ఓవైపు విద్యార్థి వీసాల్లో కోత, మరోవైపు ఓపీటీకి ఎండ్ కార్డ్, మరోవైపు H1B వీసాల్లో మార్పులు, ఫోర్స్ డిపోర్టేషన్ ఇలా మొత్తంగా అమెరికన్ల పాలిట విలన్‌లా మారారు ట్రంప్. ఇవేనా లేక ఇంకేమైనా తింగరి నిర్ణయాలు తీసుకుని మనవాళ్లను మరింత ముంచేస్తారో చూడాల్సిందే.