Top story: ఇది కదా గోల్డెన్ ఆఫర్…బంగారం ఎంత దాకా తగ్గుతుందంటే..

గోల్డ్‌ లవర్స్‌... బీ రెడీ... మీరు ఊహించని బంపర్ ఆఫర్.. ఎగిరెగిరి పడ్డ బంగారం అందుబాటులోకి వస్తోంది. ట్రంప్‌ గెలుపు ఇండియన్స్‌కు గోల్డెన్‌ ఆఫర్ ఇచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 16, 2024 | 03:39 PMLast Updated on: Nov 16, 2024 | 3:39 PM

Gold Rate Downfall Starts In India

గోల్డ్‌ లవర్స్‌… బీ రెడీ… మీరు ఊహించని బంపర్ ఆఫర్.. ఎగిరెగిరి పడ్డ బంగారం అందుబాటులోకి వస్తోంది. ట్రంప్‌ గెలుపు ఇండియన్స్‌కు గోల్డెన్‌ ఆఫర్ ఇచ్చింది. పసిడి ధర 15రోజుల్లో 5వేలు తగ్గింది. మరి బంగారం ఇంకెంతకాలం పడిపోతుంది…? 50-60వేల స్థాయికి వస్తుందా…? ఇప్పుడు కొనాలా ఇంకా వెయిట్‌ చేయాలా….?

మగువలకు మంచి కిక్కిచ్చే వార్త ఇది. ఇన్నాళ్లూ వారిని బెంబేలెత్తించిన బంగారం ఇప్పుడు దిగి వస్తోంది. ఎవరూ ఊహించని స్థాయిలో పడిపోతూ మగువల మనసుల్ని బంగారం షాపులవైపు తెగ లాగుతోంది. రారమ్మని రారారమ్మని ఊరిస్తోంది. ఇంట్లో పెళ్లో మరో శుభకార్యమో ఉంటే మాత్రం ఇది వారికి నిజంగా బంగారం లాంటి అవకాశమే. ట్రంప్ గెలిస్తే రేటు తగ్గుతుందని భావించినా ఈ స్థాయిలో పడిపోవడాన్ని మాత్రం ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వరుసగా నాలుగు రోజులు బంగారం ధర దిగివచ్చింది. హైదరాబాద్‌లో 10గ్రాముల బంగారం రోజుకు వేయి రూపాయల వరకూ పడిపోతోంది. నాలుగు రోజుల్లో 3వేల 7వందల రూపాయలు పడిపోయింది. హైదరాబాద్‌లో 24క్యారెట్ల పసిడి 10గ్రాముల ధర 75వేల 760రూపాయలుగా ఉంది. నవంబర్‌1న ఇది 80వేల 560 రూపాయలు. అంటే 15రోజుల్లో దాదాపు 5వేలు తగ్గింది. ఇక 22క్యారెట్ల బంగారం కూడా అప్పుడు 73వేల 850 రూపాయలుంటే ఇప్పుడు 69వేల 450రూపాయలుగా ఉంది. అంటే నాలుగున్నర వేలు డ్రాప్ అయ్యింది. ఇక సిల్వర్‌ అయితే ఒక్క రోజులో 2వేలు తగ్గి లక్షకు దిగువకు వచ్చింది. నవంబర్1న లక్షా ఆరువేలున్న కేజీ వెండి ఇప్పుడు 99వేలకు తగ్గింది. అంటే ఏకంగా 7వేలు పడిపోయిందన్నమాట. ట్రంప్ గెలవడం, డాలర్ బలపడటం, బాండ్ రాబడులు పెరగడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు బంగారం పతనానికి కారణమవుతున్నాయి. సాధారణంగా స్టాక్‌మార్కెట్లు పడిపోతున్న సమయంలో బంగారం మెరవాలి.. కానీ ఈసారి అదీ, ఇదీ రెండు పడిపోవడం విచిత్రమే. అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఔన్సు బంగారం ధర ఒక్కరోజులో 40 డాలర్లు తగ్గింది. ఇది కూడా దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమవుతోంది. బిట్‌కాయిన్ బూమ్‌ కూడా గోల్డ్‌ను దెబ్బతీస్తోంది. ప్రస్తుతం బంగారం ధరలు నెల రోజుల కనిష్ఠంలో ట్రేడ్ అవుతున్నాయి.

ఇంతకీ బంగారం ఇంకెంత పడిపోతుందన్న ప్రశ్నకు నిపుణుల నుంచి కూడా సరైన సమాధానం లేదు. ఎవరూ కూడా ఎంతవరకు రేటు పడిపోతుందన్నది చెప్పలేకపోతున్నారు. ఎవరి లెక్కలు వారివి.. ఎవరి అంచనాలు వారివి. డాలర్ బలపడే కొద్దీ దేశీయంగా బంగారం ధర మరింత తగ్గుతుంది. ట్రంప్ అధికారం చేపట్టేవరకు డాలర్ ర్యాలీ కొనసాగుతుందన్నది ఓ అంచనా. ఆ ప్రకారం చూసుకుంటే మరో రెండు నెలల పాటు బంగారానికి గడ్డు రోజులే. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్‌ ఔన్స్ బంగారం ధర కీలకమైన సపోర్ట్‌ లెవల్‌ 2వేల600డాలర్ల దిగువకు పడిపోవడంతో మరింత తగ్గుతుందన్న అంచనాలున్నాయి. దిగుమతులపై సుంకాలు విధించడం, పన్నులు తగ్గించడం వంటి ట్రంప్ నిర్ణయాలు అమెరికాలో ద్రవ్యోల్బణం పెంచే అవకాశం ఉంది. దీంతో ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపును ఆపివేయవచ్చు. అదే జరిగితే బంగారంవైపు పెట్టుబడులు మరింత తగ్గుతాయి. దీంతో బంగారం ధర మరింత తగ్గుతుంది.

తులం బంగారం 50నుంచి 60వేల మార్క్‌ను టచ్ చేస్తుందని కొందరు చెబుతున్నప్పటికీ ఆ స్థాయిలో పడిపోయే అవకాశాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరో 10శాతం వరకు కరెక్షన్ రావొచ్చని 24క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర 72-74వేల వరకు వచ్చి ఆ తర్వాత అక్కడే స్థిరపడొచ్చని అంటున్నారు. మధ్యలో అంతర్జాతీయ పరిణామాలతో ఒకట్రెండు రోజులు కాస్త పెరిగినా షార్ట్‌టర్మ్‌లో మాత్రం తగ్గుతుందన్నది మెజారిటీ ఎనలిస్టుల మాట. గతేడాది ఇదే సమయానికి 10గ్రాముల బంగారం ధర 60వేల 350 రూపాయల వరకు ఉంది. ఇప్పుడు అది 75వేల దగ్గర ఉంది. దాదాపు 22శాతం పెరిగింది. ఈ పదిరోజుల్లో తగ్గకపోతే ఇంకా ఎక్కువే ఉండేది. ఆ దూకుడు ఇప్పట్లో ఉండే అవకాశాలు లేవు. కొన్నాళ్ల పాటు ఇదే రేటుకు కాస్త అటూ ఇటుగా కదలాడొచ్చు. మార్కెట్ అంచనాల ప్రకారం 24క్యారెట్ల బంగారం 10గ్రాములకు 72వేల 623రూపాయల దగ్గర సపోర్ట్‌ ఉంది. అంతకుమించి తగ్గితే 70వేల280వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ పుంజుకోవచ్చు. ప్రస్తుతానికి గోల్డ్ బేరిష్ గా ఉన్నా అది షార్ట్‌ టర్మ్‌కే అంటున్నారు. మీడియం, లాంగ్‌టర్మ్‌లో మళ్లీ పరుగు మొదలుపెడుతుందని భావిస్తున్నారు. కాబట్టి పడినప్పుడల్లా కొంత కొంత కొనుక్కోవడం మంచిదంటున్నారు. అందరూ అంచనా వేస్తున్నట్లు 50-60వేల రేంజ్‌కు మాత్రం రాకపోవచ్చు. వస్తే 70వేల వరకు వచ్చి మళ్లీ పెరిగే అవకాశాలున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చాక మళ్లీ పరిస్థితులు కుదుటపడి బంగారం మళ్లీ పుంజుకుంటుందని వచ్చే ఏడాదికి మళ్లీ పరుగు మొదలుపెట్టడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక వెండి కూడా 88వేల వరకూ వస్తుందని కొందరు లెక్కగడుతున్నారు. కాబట్టి బంగారం కొనడానికి ఇదే మంచి సమయం అని భావించొచ్చు. రేటు ఏ మాత్రం తగ్గినా కొని పెట్టుకోవడం మంచిదని నిపుణుల సూచన.