చరిత్రకి తెలియని నిజం..!

ఛావా” అంటే మరాఠీ భాషలో పులిబిడ్డ అని అర్ధం. ది గ్రేట్ ఛత్రపతి శివాజీ కుమారుడు అతని వారసత్వాన్ని నిలిపిన యోధుడు.. శంభాజీ. విక్కీ కౌశల్ శంభాజీగా చేసిన ఛావా సినిమా ఇప్పుడు సరికొత్త చర్చలకు దారి తీస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2025 | 03:45 PMLast Updated on: Feb 24, 2025 | 3:45 PM

Great History Of Shambhaji Maharaj

ఛావా” అంటే మరాఠీ భాషలో పులిబిడ్డ అని అర్ధం. ది గ్రేట్ ఛత్రపతి శివాజీ కుమారుడు అతని వారసత్వాన్ని నిలిపిన యోధుడు.. శంభాజీ. విక్కీ కౌశల్ శంభాజీగా చేసిన ఛావా సినిమా ఇప్పుడు సరికొత్త చర్చలకు దారి తీస్తోంది. అయితే శంభాజీ జీవితం.. భారతదేశ ఆధునిక చరిత్రలో ఒక గొప్ప మలుపు అని చాలా మందికి తెలియదు. ఆనాడు ఉన్మాద స్థాయిలో మతమార్పిడులు జరుగుతున్న కాలం. హిందూ ధర్మాన్ని ఎలాగైనా అంతం చేయాలని అప్పటి మొగల్ రాజు అత్యంత క్రూరడు ఔరంగజేబు.. కుట్రలు చేస్తున్నాడు. కానీ 9 ఏళ్ళే పరిపాలించినా.. ఆనాడు ఔరంగజేబును ముప్పతిప్పలు పెట్టాడు శంబాజీ.

అతను చూపించిన ధైర్యమే అప్పటి భారతీయుల్లో దేశభక్తిని రగిలించింది. అదే మొగల్ సామ్రాజ్య పతనాన్ని శాసించింది. అలాంటి గొప్ప వీరుడి గురించి చరిత్ర పుస్తకాల్లో కనిపించనీయకుండా కొందరు చరిత్రకారులు పెద్ద ద్రోహమే చేశారు అనేది నేటి చరిత్రకారులు చెప్తున్నా మాట. చరిత్రలో శంబాజీ గొప్పతనాన్ని తగ్గించి రాసి మన గొప్పతనాన్ని కనుమరుగు చేశారు.

ఛత్రపతి శివాజీకి ఇద్దరు కుమారులు వారిలో పెద్దవాడు శంబాజీ మహారాజ్. 1680లో రాయ్‌గఢ్‌ లో అనారోగ్యం కారణంగా శివాజీ మరణించారు అని చరిత్ర చెప్తోంది. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్దవాడు.. శంభాజీ మహారాజ్. శివాజీకి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య కొడుకు శంభాజీ. ఆయన తల్లి పేరు సాయి భాయి. ఇక రాజారాం మహారాజ్ రెండవ కుమారుడు. అతని తల్లి తల్లి సోయారాబాయి. శివాజీ మరణం అనంతరం.. శంభాజీ పరిపాలన బాధ్యతలు స్వీకరించి పరిపాలన మొదలుపెట్టాడు. సరిగా 9 ఏళ్ళ పాటు మరాఠా రాజ్యాన్ని పరిపాలించాడు శంభాజీ. 1689లో ఆయన ఔరంగజేబు చెరలో మరణించే వరకు మరాఠా రాజ్యానికి రాజుగా ఒక వెలుగు వెలిగాడు. శంభాజీతో పాటు.. ఆయన కుమారుడు షాహును కూడా జైలులో పెట్టి హింసించారు.

శంభాజీ చనిపోయిన తర్వాత ఆయన సోదరుడు రాజారామ్ మహారాజ్ కొన్నాళ్ళు మహారాష్ట్రలోనే ఉన్నారు. ఆ తర్వాత తమిళనాడులోని జింజి వద్ద ఉన్న మరాఠా స్వరాజ్య భూమికి వెళ్లి.. జింజిలోనే ఉండి రామచంద్ర పంత్ అమాత్య బావ్డేకర్, శాంతాజీ ఘోర్పడే, ధనాజీ జాదవ్ సాయంతో మహారాష్ట్ర, జింజి పాలనను పర్యవేక్షించారు అని చెప్తారు. 8 ఏళ్లు పాలించిన తర్వాత రాజారామ్ 1698లో తిరిగి మహారాష్ట్ర వచ్చారు. సరిగా రెండేళ్లకు ఆయన 30ఏళ్ల వయసులో సింహగఢ్‌లో కన్నుమూసారు.

అయితే అన్నతో పోలిస్తే గొప్ప పేరు ప్రఖ్యాతలు రాజారామ్ కు రాలేదని చెప్తారు చరిత్ర కారులు. శంభాజీ పరిపాలన స్టైల్ వేరు అని అంటారు. కేవలం హిందుత్వమే అతని ఎజెండా కాదు. న్యాయబద్ధమైన పరిపాలనతో పాటుగా ప్రజలందరికీ సంక్షేమం, సమర్థవంతమైన పన్నులపై శంభాజీ దృష్టి పెట్టి పరిపాలించారు. తన తండ్రి మరణం తర్వాత రాజ్యంలో అస్థిర పరిస్థితులను చక్కదిద్దుతూ.. ఇంకోవైపు మొఘలులతో తన తండ్రి శివాజీ మాదిరిగానే రాజీ లేని పోరాటం చేసాడు శంభాజీ. 1657, మే 14న శివాజీ, సాయిబాలకు మొదటి సంతానంగా జన్మించిన శంభాజీ బాల్యం మొత్తం కష్టంగానే గడిచింది.

రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయిన శంభాజీ.. బాల్యం అంతా నానమ్మ, శివాజీ తల్లి జిజియాబాయి వద్దనే ఎక్కువగా గడిచింది. శంభాజీ మహారాజ్ చాలా అందమైనవాడు అంటారు చరిత్ర కారులు. మరాఠాతో పాటుగా హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలను అతను అనర్గళంగా మాట్లాడగలడు. శివాజీ మహారాజ్ తన ఆగ్రా పర్యటనకు శంభాజీని కూడా తీసుకుని వెళ్ళారు. మొఘల్ దర్బారు, వారి రాజకీయ వ్యవహారాలు తెలుసుకుంటే భవిష్యత్తులో తనకు ఉపయోగపడుతుందని భావించి తనతో పాటు తీసుకెళ్లారు శివాజీ. అప్పటికి శంభాజీ రాజే వయసు కేవలం 9 ఏళ్ళు మాత్రమే. శివాజీ మహారాజ్ మొఘల్ నిర్బంధం నుండి తప్పించుకున్న అనంతరం శంభాజీని కొన్నాళ్ళ పాటు అజ్ఞాతంలో ఉంచారు.

మధురలో మోరోపంత్ పేష్వా బావమరిది ఇంట్లో ఉంచారట. ఇక తన కొడుకుని కాపాడుకోవడానికి శివాజీ చాలా కష్టపడ్డారట. మొఘల్ సైనికులు శంభాజీ రాజా వెంట పడకుండా ఉండేదుకు అతను చనిపోయాడు అని ఒక పుకారు పుట్టించాడు. ఆ తర్వాత శివాజీ ఆగ్రా నుంచి మహారాష్ట్ర చేరుకున్న అనంతరం.. శంభాజీ మహారాజ్ స్వరాజ్యానికి సురక్షితంగా చేరుకున్నాడు. పిలాజీ షిర్కే కుమార్తె జివుబాయిని శంభాజీ వివాహం చేసుకోగా.. ఆ తరువాత కాలంలో ఆమే యేసుబాయిగా పేరు మార్చుకున్నారట. ఆమెను కూడా మొఘల్ రాజులు అత్యంత హీనంగా చంపారని చెప్తారు. ఇక శంభాజీ జీవితంలో యుద్దాలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. తండ్రి మాదిరిగానే యోధుడిగా శంభాజీని చెప్తారు. ఎన్నో సైనిక దాడులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా నాయకత్వం వహించాడు.

బుర్హాన్‌పూర్‌ పై దాడి ఓ సంచలనం అంటారు చరిత్ర కారులు. ముఘల్ రాజులకు బుర్హాన్ పూర్ పెట్టని కోట. అలాంటి రాజ్యంపై శంభాజీ చేసిన దాడికి చరిత్రలో గొప్ప స్థానమే ఉంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్‌ ను జయించాలనే ప్రయత్నానికి శంభాజీ అనునిత్యం అడ్డుపడ్డారు. మరాఠా రాజ్యాన్ని కాపాడుకోడానికి 1682 నుంచి 1688 వరకు ఎన్నో పోరాటాలు చేయడమే కాకుండా పరిపాలనలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసారు. అలాగే తన హత్యకు కుట్రలు చేస్తోన్న వ్యక్తులను గుర్తించి.. వారిని చంపేశారు. రాజ్యంలో అంతర్గత సమస్యలు ఉన్నప్పటికీ.. మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి, తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించడంలో కీలక భూమిక పోషించారు.

1689లో శంభాజీని ఔరంగజేబు బంధించి, రోజుల తరబడి చిత్రహింసలకు గురి చేసాడు. ఈ చిత్ర హింసల గురించి సినిమాలో చాలా తక్కువగా చూపించారు. శంభాజీ కళ్ళల్లో ఇనుప చువ్వలు గుచ్చడం, అతని చర్మంపై ఉప్పు రాయడం, అతని నాలుక పీకడం వంటివి మాత్రమే చూపించారు. కాని.. అతని చర్మాన్ని వలచి ఆ చర్మానికి తాడు కట్టి.. గుర్రాలకు కట్టి పరిగెత్తించారు. అయినా సరే శంభాజీ మాత్రం వెనకడుగు వేయలేదు. అత్యంత దారుణంగా 1689 మార్చి 11న శంభాజీని ఉరి తీసి చంపేశారు. అంతటితో ఔరంగజేబు కోపం చల్లారకపోవడంతో శంభాజీ శవాన్ని ముక్కలుముక్కలు నరికి నదిలో పారేశారు.

అక్కడికి దగ్గరలోని వధు గ్రామస్థులు నదిలోకి దిగి శంభాజీ శరీర ఖండాలను వెదికి దొరికిన వాటిని అతికించి ఘనంగా అంతిమసంస్కారాలు నిర్వహించారు. ఇక తండ్రికి ఛత్రపతి బిరుదు ఉన్నట్టే శంభాజీని ధర్మవీర్‌గా అక్కడి ప్రజలు గౌరవించుకుంటారు. మరణం కళ్ల ముందు ఉన్నా సరే.. మొఘలులతో అతను రాజీ పడటానికి ఇష్టపడలేదు. హిందూ ధర్మం కోసం ప్రాణాలు వదలడానికే అతను మొగ్గు చూపించాడు.

అతని ధైర్యమే.. అతను నేడు భూమిపై లేకపోయినా మరాఠాల హృదయాల్లో ఆయనకు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించి పెట్టిందని చరిత్ర కారులు చెప్తున్నారు. ఇక శంభాజీ పాలనలో మరాఠాలకు విద్య వైద్యం విషయంలో పెద్ద ఎత్తున న్యాయం చేసినట్టు చరిత్ర చెప్తోంది. ప్రతీ ఒక్కరు చదువుకోవాలని శంభాజీ భావించారు. హిందూ చరిత్ర గొప్ప తనాన్ని చరిత్ర పాఠాల్లో చేర్చారు శంభాజీ. ఇక యుద్ద విద్యలను ఆయన స్వయంగా పర్యవేక్షించేవారు. శివాజీ పాలనలో వచ్చిన నేవీని మరింత బలోపేతం చేసారు శంభాజీ. ఇది శంభాజీ మహారాజ్ గొప్ప చరిత్ర.