పాక్‌లో మళ్లీ పేలిన అజ్ఞాత వ్యక్తుల తుపాకీ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబు ఖతల్ ఖతం
రియాసి టెర్రర్ అటాక్.. మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేసిన సమయంలో యావత్ దేశాన్ని ఉలికిపడేలా చేసిన ఉగ్రదాడి ఇది.

రియాసి టెర్రర్ అటాక్.. మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేసిన సమయంలో యావత్ దేశాన్ని ఉలికిపడేలా చేసిన ఉగ్రదాడి ఇది. జమ్మూకశ్మీర్‌లోని శివ ఖోరి ఆయలానికి వెళ్లి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సుపై పాకిస్తాన్ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపారు. దీంతో ఆ బస్సు లోయలో పడిపోయింది. ఈ దాడిలో 9 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 41 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం NIAను యాక్షన్‌లోకి దించింది. NIA ఇన్వెస్టిగేషన్‌లో రియాసి టెర్రర్ అటాక్ సూత్రధారిని గుర్తించింది. గుర్తించడం మాత్రమే కాదు.. అతడి కోసం తొమ్మిది నెలలుగా వెదుకుతూనే ఉంది. కట్‌చేస్తే.. ఆ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ పాకిస్తాన్‌లో కుక్కచావు చచ్చాడు. గుర్తుతెలియని వ్యక్తులు తూటాలతో అతడి శరీరాన్ని జల్లెడ చేసేశారు. దీంతో దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆ తొమ్మిది మంది యాత్రికుల ఆత్మలు శాంతించాయి. ఇంతకూ, ఎవరా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్? రియాసి ఉగ్రదాడిలో అతడి పాత్రేంటి? అన్నింటికీమించి పాకిస్తాన్‌లో అతడిని ఎవరు హతమార్చారు? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
2024 జూన్ 9వ తేదీ.. సమయం సాయంత్రం 6గంటల 10 నిమిషాలు.. భారత ప్రధానిగా మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యావత్ దేశం అటెన్షన్ ఆ కార్యక్రమం పైనే ఉంది. సరిగ్గా అదే సమయంలో జమ్మూకశ్మీర్ ఉలిక్కి పడింది. యాత్రికుల బస్సుపై బుల్లెట్ల వర్షం కురిసింది. ‘మే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ.. అని ప్రమాణ స్వీకారం చేస్తున్న అదే టైంలో జమ్మూలోని రియాసీ ప్రాంతం క్షతగాత్రుల హాహాకారాలతో భీతావహంగా మారిపోయింది. ఉగ్ర తూటాలు ఆ బస్సును జల్లెడ చేసేశాయి. చూస్తుండగానే కొందరి ప్రాణాలు పోయాయి. డ్రైవర్‌కు బుల్లెట్ తగలడంతో బస్సుపై నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు లోయలో పడిపోయింది. చాలా సేపటి తర్వాత ఈ వార్త బయటి ప్రపంచానికి తెలిసింది. కానీ, అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. భారత్‌లో చాలా కాలం తర్వా త జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి అది. పైగా ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఈ దాడి జరగడం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కట్‌చేస్తే.. జాతీయ దర్యాప్తు సంస్ధ యాక్షన్‌లోకి దిగింది. చాలా తక్కువ సమయంలోనే ఉగ్రదాడికి సూత్రధారి ఎవరో గుర్తించింది. అతడి పేరు జియా ఉర్ రెహమాన్.. అలియాస్ అబు ఖతల్..! లష్కరే తోయిబాలో అత్యంత కీలక సభ్యుడు.
2025 మార్చి 15.. రాత్రి 7 గంటల సమయంలో తన భద్రతా సిబ్బందితో కలిసి అబు ఖతల్ ప్రయాణిస్తున్నాడు. జీలం ప్రాంతంలోని దీనా పంజాబ్ యూనివర్శిటీ సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఫైరింగ్ జరిపారు. ఖతల్ కథ ముగించడమే లక్ష్యంగా ఏకంగా 15 నుంచి 20 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఖతల్‌తో పాటు అతడి సిబ్బందిలో ఒకడు దారుణంగా చచ్చాడు. అబు ఖతల్ ఒక్క రియాసీ దాడికే కాదు.. అంతకుముందు అంటే 2023 జనవరి 1న రాజౌరీ జిల్లాలోని ధంగ్రీలో జరిగిన ఉగ్రదాడి వెనుకా ఇతడి పాత్ర ఉంది. ఆ దాడిలో ఇద్దరు చిన్నారులతో పాటు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి రోజు ఐఈడీ పేలుడు కూడా జరిగింది. దీంతో అబు ఖతల్ కోసం నేషనల్ ఇన్వె స్టిగేషన్ ఏజెన్సీ నాటి నుంచే వేట మొదలు పెట్టింది. జమ్మూకశ్మీర్ మొత్తాన్నీ జల్లెడపట్టింది. కానీ, అబు ఖతల్ మాత్రం సేఫ్‌గా పాకిస్తాన్ చెక్కేశాడు. ఉగ్రవాదులకు స్వర్గధామం అయిన పాకిస్తాన్‌లో ఉన్నంత వరకూ తాను సేఫ్ అనుకున్నాడు. కానీ, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను వేటాడుతున్న గుర్తు తెలియని వ్యక్తులు చివరికి ఈ దుర్మార్గుడి కథ కూడా ముగించేశారు.
జమ్మూకశ్మీర్‌లో అబు ఖతల్ చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు. కశ్మీర్‌లో రెచ్చిపోతున్న పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి ప్రాక్సీ ఉగ్రవాద సంస్థలను సృష్టించాడు.
2023 ఏప్రిల్ 20, 2023 నవంబర్ 20, 2023 డిసెంబర్ 21న ఆర్మీ జవాన్లే లక్ష్యం జరిగిన దాడుల్లో పదిహేను మంది అమరులయ్యారు. ఈ మూడు ఘటనల వెనుకా ఉన్నది అబు ఖతల్ సృష్టించిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ సంస్థే. ఏదో ఒకదాడి చేసి సైలెంట్ అవ్వడం కాదు.. సేమ్ ప్యాట్రన్‌లో, సైనికులే టార్గెట్‌గా పక్కా ప్లానింగ్‌తో దాడులు చేస్తోందీ ఉగ్ర సంస్థ. పైగా చేసిందంతా చేసి ఆ దాడులకు తమదే బాధ్యత అంటూ ఇండియన్ ఆర్మీని రెచ్చగొడుతోంది. వీటన్నింటి వెనుకా ఉన్న ఒకే ఒక్క మాస్టర్ మైండ్ అబు ఖతల్. ఎట్టకేలకు గుర్తు తెలియని వ్యక్తులు ఆ కేటుగాడి ఆట కట్టించారు. అయితే, ఈ దాడి ఎవరు చేశారు అనే ప్రశ్నకు ఎప్పట్లానే సమాధానం దొరకడం లేదు. పాకిస్తానీలు కూడా ఎప్పట్లానే భారత గూఢచారుల పని కావచ్చంటున్నారు. మరికొందరు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థల మధ్య అంతర్గత విభేదాతోనే హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అబు ఖతల్ మరణం లష్కరే తోయిబా కార్యకలాపాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ ఏంటంటే.. ఆ గుర్తు తెలియని వ్యక్తుల అసలు లక్ష్యం అబు ఖతల్ కాదు.. వాడి బాస్ హఫీజ్ సయీద్. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే.. జమాత్-ఉత్-దవా చీఫ్‌ను ఎలిమినేట్ చేయడమే వాళ్ల లక్ష్యం.
హఫీజ్ సయీద్.. 26/11 ముంబై దాడుల మాస్టర్‌మైండ్. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఈ నెల 15 సాయంత్రం పాక్ ఆర్మీ కార్ప్స్ కమాండర్‌ను కలవడానికి హఫీజ్ సయీద్ వెళ్లాడు. అబు ఖతల్ అతడి వెంటే ఉన్నాడు. తిరుగు ప్రయాణంలో గుర్తు తెలియని వ్యక్తులు హఫీజ్ సయీద్‌పై ఫైరింగ్ జరిపారు. పాపి చిరాయువు అన్నట్టుగా జమాత్-ఉత్-దవా చీఫ్ తృటిలో తప్పించుకున్నాడు. రియాసీలో భక్తుల బస్సుపై దాడికి వ్యూహరచన చేసిన అబు ఖతల్ మాత్రం ఖతం అయిపోయాడు. వాస్తవానికి అబు ఖతల్‌తో పాటు హఫీజ్ సయీద్‌కూడా ప్రాణాలు కోల్పోయాడని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. కానీ, అది నిజం కాదు.. హఫజ్ ఇంకా ప్రాణాల్తోనే ఉన్నాడు. కాల్పుల్లో గాయపడిన హఫీజ్ సయీద్ చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు కథకూడా ముగించేస్తారేమో చూడాలి.