జీవి రెడ్డిని అందుకే లేపేసారా?

ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి వ్యవహారం కంపు కంపు అయిపోయింది. అటు పార్టీలోనూ.... ప్రభుత్వంలోనూ జీవి రెడ్డి రాజీనామా పెద్ద చర్చకే దారితీసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 26, 2025 | 12:50 PMLast Updated on: Feb 26, 2025 | 12:50 PM

Gv Reddy Resignation Led To A Big Debate In Ap Politics

ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి వ్యవహారం కంపు కంపు అయిపోయింది. అటు పార్టీలోనూ…. ప్రభుత్వంలోనూ జీవి రెడ్డి రాజీనామా పెద్ద చర్చకే దారితీసింది. తన పట్ల పార్టీ అధినేత అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి, టిడిపికి రాజీనామా చేశారు జీవి రెడ్డి. అయితే దీని వెనక పెద్ద కథే నడిచింది. ఎన్నికల్లో తనను వాడుకొని… ఇప్పుడు కరివేపాకుల తీసి పడేస్తున్నారని జీవి రెడ్డి ఎక్కడపడితే అక్కడ మాట్లాడడమే ఆయన కొంప కూల్చింది.

జీవి రెడ్డి వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్. పారిశ్రామిక వేత్త కూడా. ప్రకాశం జిల్లా వైసీపీలో కీలక పాత్ర పోషించాడు. గిద్దలూరు ఎమ్మెల్యే సీటు ఆశించాడు. జగన్ కరుణించకపోవడంతో నిరాశ చెందాడు. సహజంగా సహనం తక్కువ… హడావుడి ఎక్కువ చేసే జీవి రెడ్డి లాంటి వాళ్లకి ప్రాంతీయ పార్టీల్లో మనుగడ చాలా కష్టం. స్పెషల్ ఐడెంటిటీ కోరుకునే జీవి రెడ్డి లాంటి వాళ్లకు వైసిపి అయినా… టిడిపి అయినా ఒకటే. వైసీపీ అధినేత జగన్ పై అసహనంతో ఆ పార్టీని వీడి టిడిపిలో చేరాడు జీవి రెడ్డి. లోకేష్ కి దగ్గరగా ఉంటూ పార్టీకి చాలా ఫండింగ్ కూడా చేశాడు. అయితే ఎల్లో మీడియాకు చెందిన ఒక ఛానల్ జర్నలిస్టు జీవి రెడ్డికి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆయన సలహాలు పైనే జీవి రెడ్డి టిడిపిలో తన సొంత ఐడెంటిటి కోసం జోరు పెంచాడు.

ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ తన స్థాయికి అది చాలా తక్కువ అని… ఓపెన్ గానే కామెంట్లు చేశాడు. ఇదంతా ఆ జర్నలిస్టు సలహాల వల్లే జరిగింది. జీవి రెడ్డి ఓపెన్ గా ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడటం, జగన్ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ బాగా పని చేసిందని కితాబ్ ఇవ్వడం ఇవన్నీ చంద్రబాబు లోకేష్ లకి కొంత సృష్టించాయి. వివాదాస్పదంగా మాట్లాడితేనే పార్టీలో ఐడెంటిటీ దొరుకుతుందని… రెచ్చిపోయాడు జీవి రెడ్డి.ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగులు ఎవరు తనకు సహకరించడం లేదని, ఎండి సహకారం అస్సలు లేదని బహిరంగంగానే కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు.

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్‌కు, ఎండీకి మధ్య విభేదాలతో ఫైబర్‌ గ్రిడ్‌ ఫైర్ అయింది. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థల మధ్య సమన్వయం లేకపోవడం , గొడవలు బయటకి పొక్కి నానా యాగి అవ్వడం చంద్రబాబు లో చాలా అసహనాన్ని సృష్టించింది. దీని ఫలితంగానే సంస్థ ఛైర్మన్‌ జీవీరెడ్డి తన పదవితో పాటు ఏకంగా తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన రాజీనామా ఒక ఎత్తయితే… ప్రభుత్వం వెంటనే ఆమోదించడం మరో ఎత్తు . అదే సమయంలో ఫైబర్‌ నెట్‌ ఎండీ బాధ్యతల నుంచి దినేష్‌కుమార్‌ను తప్పించి జీఏడీకి అటాచ్‌ కూడా చేశారు. గొడవ పడుతున్న ఇద్దరిలో జీవీరెడ్డి రాజీనామాను మరో ఆలోచన లేకుండా ఆమోదించడం, అధికారిని జీఏడీకి అటాచ్‌ చేయడాన్ని బట్టి చూస్తే…ఈ విషయంలో సీఎం చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారని అర్థమవుతుంది. జోడెద్దుల్లా సంస్థల్ని నడపాల్సిన వాళ్ళు గొడవలు పడి వీధికెక్కితే… అటు పార్టీ పరువు పోవడంతోపాటు ఇటు పరిపాలన గాడి తప్పుతుందన్న అభిప్రాయం బలంగా ఉంది బాబు లో. అందుకే ఇద్దరిలో ఎవర్నీ ఉపేక్షించలేదు.

దీన్ని ఇలాగే వదిలేసి మెతగ్గా ఉంటే… ఈ ఎపిసోడ్‌ని చూసి మరో కార్పొరేషన్‌లో వివాదం పుడుతుందని… అలా వదిలేసుకుంటూ పోతుంటే… పూర్తిగా ఔటాఫ్‌ కంట్రోల్‌ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఫైబర్‌ గ్రిడ్‌ వివాదానికి చెక్‌ పెట్టారు చంద్రబాబు. క్రమశిక్షణ తప్పితే ఎవ్వర్నీ ఉపేక్షించబోనని ఈ ఎపిసోడ్‌ ద్వారా సీఎం చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ఛైర్మన్‌గా రాజీనామా చేసిన జీవీ రెడ్డి దినేష్‌కుమార్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. సంస్థ నష్టాలకు కారణం ఎండీ వైఖరేనంటూ మండిపడ్డారు. దీనిపై మంత్రి, ముఖ్యమంత్రి
ఆయన్ని పిలవడం, వివరణ అడగడం….చక చకా జరిగిపోయాయి. ఇక్కడే కథ కీలక మలుపు తిరిగింది. జీవీ రెడ్డి సీఎం చంద్రబాబును కలిశాక సీన్‌ మొత్తం మారిపోయింది. జీవీ రెడ్డి వైఖరిపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఆ తర్వాతే జీవి రెడ్డి రాజీనామాకు మొగ్గినట్టు తెలిసింది. ఇటు ఛైర్మన్‌ రాజీనామాకు ఆమోదం, అటు ఎండీ బదిలీని ఏక కాలంలో చేయడం ద్వారా….ప్రభుత్వ పదవుల్లోఉండి వ్యతిరేకంగా మాట్లాడే నాయకులకు,ఇబ్బందికరంగా తయారవుతున్న అధికారులకు గట్టి సంకేతాలు పంపారు చంద్రబాబు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రభుత్వానికి అప్పుడప్పుడూ అంటిస్తున్న చురకలతో ఇబ్బందిగా ఉందని, ఈ పరిస్థితుల్లో ఇక కార్పొరేషన్స్‌ ఛైర్మన్లు కూడా వీధినపడితే… మరింత ఇరుకున పడతామన్న ఉద్దేశ్యంతోనే జీవీరెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించి ఉండవచ్చు. గతంలో హోం మంత్రి అనిత పనితీరు మీద పవన్‌ సీరియస్‌ అవడం, తర్వాత ఆమె వివరణ ఇవ్వడంలాంటి పరిణామాలు ప్రభుత్వం పరువు తీసేయ్. ఇక తిరుపతిలో తొక్కిసలాట వ్యవహారంపై కూడా అందరికంటే ముందే డిప్యూటీ సీఎం క్షమాపణ అడగడం కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. అందుకే మళ్లీ ఇలాంటివి అంశాలపై రచ్చ జరిగితే ఎవరో ఒకరు బయట నుంచి కామెంట్ చేయడం కన్నా తానే ముందు యాక్షన్ తీసుకోవడం మంచిదని చంద్రబాబు భావించారు.

జీవి రెడ్డిని ఫైబర్ నెట్ చైర్మన్ పదవి నుంచి, పార్టీ నుంచి పొమ్మనుకుండానే పొగ పెట్టడం వెనక పెద్ద కారణం వేరే ఉంది. ఓ ఎల్లో జర్నలిస్టు డైరెక్షన్లో జీవి రెడ్డి చెలరేగిపోవడం, వచ్చినట్లు మాట్లాడటం… ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పోస్టు…. అదేదో అమెరికా అధ్యక్షుడు పోస్ట్ లాగా ఫీల్ అయిపోయి ప్రెస్ మీట్ లు పెట్టి ఓపెన్ గా మాట్లాడటం ఇవన్నీ లోకేష్ కి ,చంద్రబాబు కి తలనొప్పిగా మారాయి. వైసీపీ నుంచి వచ్చిన జీవీ రెడ్డి ఇప్పటికీ వైసీపీ లీడర్ లాగే వ్యవహరిస్తున్నాడని స్ట్రాంగ్ ఒపీనియన్ కి వచ్చేసారు చంద్రబాబు. అందుకే జీవి రెడ్డి నీ తెలివిగా వదిలించుకున్నారు. వైసీపీ టీడీపీలో పనిచేసిన తర్వాత కూడా ప్రాంతీయ పార్టీల్లో సంస్కృతి ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోయాడు జీవీ రెడ్డి. ప్రాంతీయ పార్టీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటిదని, పార్టీ అధ్యక్షుడు, ఆయన కుటుంబమే ముఖ్యం తప్ప మిగతా వాళ్ళందరికీ అంత విలువ ఉండదని అర్థం చేసుకో లేకపోయినా జీవి రెడ్డి…. చివరికి ఇలా దెబ్బ అయిపోయాడు.