Karnataka elections: లాభం లేదు.. వీళ్లకి హనుమంతుడి గదే కరెక్టు! ఏమన్నా లాజిక్ ఉందా అసలు!
రాజకీయ నాయకుల లాజిక్‌లకు అర్థంపర్థం ఏడవదు.. ప్రజల ఏమోషన్స్‌తో ఓట్లు పిండుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు..! కర్ణాటక ఎన్నికల్లోనూ అదే చేస్తున్నారు.. అనవసరంగా హనుమంతుడిని ఈ రాజకీయ కంపులోకి లాగేశారు.
అదానీని ఎవరైనా ఏమైనా చిన్నమాట అంటే అది దేశాన్ని అన్నట్లట.. అదానీకి దేశానికి లింకేంటి..? పర్యావరణాన్ని బుగ్గిపాలు చేసిన అదానీ కంపెనీ.. స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలతో షేర్ల విలువను విపరీతంగా పెరిగేలా చేసిందని ఈ ఏడాది జనవరిలో సంచలన నివేదికను విడుదల చేసింది హిండెన్‌బర్గ్. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించిన వారిని దేశ వ్యతిరేకులగా చిత్రకరించే ప్రయత్నం జరిగింది..అదానీకి సంబంధించి బయటకు వచ్చిన ఓ నివేదిక..ఇండియాకు సంబంధించిన రిపోర్టు ఎలా అవుతుంది..? సరే గుజరాతీలపై ప్రేమ అనుకుందాం.. అయనకు కేంద్రంలోని పెద్దలతో మంచి స్నేహముందనుకుందాం.. ఆ ఫ్రెండ్‌షిప్ కోటాలోనే ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడేశారనుకుందాం..! కానీ ఇప్పుడు లిమిట్ దాటిపోయారు.. ఏకంగా తమ ఓట్ల కోసం దేవుడినే రాజకీయాల్లోకి లాగేశారు..! అవును..! హనుమంతుడి చుట్టూనే ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు తిరుగుతున్నాయి.. మధ్యలో ఆంజనేయుడు ఎందుకు వచ్చినట్లు? ఆయన రాలేదు.. లాక్కొచ్చారు..
బజరంగ్ దళ్ కోసం బజరంగబలిని లాగారు:
కర్ణాటక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ ఏడాది పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందో.. కాంగ్రెసే విజయం సాధిస్తుందో.. లేక బీజేపీకే ప్రజలు బ్రహ్మరథం పడతారో.. కింగ్‌మేకర్‌గా కుమారస్వామి నిలుస్తారో.. ఇవ్వని కాసేపు పక్కన పెడదాం..! నిజానికి జనాలు కూడా ఈ విషయాలను పక్కన పెట్టేశారు. ఎందుకంటే వాళ్లకి మాట్లాడుకోవడానికి, ఇప్పటివరకు జరిగిన విషయాలను మర్చిపోవడానికి ఓ మంచి టాపిక్‌ను ఎన్నుకున్నాయి అక్కడ ప్రధాన పార్టీలు. అదే బజరంగ్ దళ్..! కాంగ్రెస్ మేనిఫెస్టో తర్వాత కన్నడ రాజకీయాలు ఇప్పుడు హనుమంతుడి చుట్టే తిరగడం మొదలుపెట్టాయి.. ఆంజనేయుడి ఆలయాలు చుట్టూ రాజకీయా నాయకులు ఎప్పుడూ లేనంతగా తిరుగుతున్నారు. హనుమంతుడికి ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారు.. కొంతమంది కాళ్ల మీద కూడా పడుతున్నారు.. ఇదంతా ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు కాదు..ఓటర్లను మభ్యపెట్టేందుకు..!
బజరంగ్ దళ్‌ని బ్యాన్ చేస్తారట:
అప్పుడెప్పుడో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)ను కేంద్రం నిషేధించేసింది..! భారత్‌లో ఇస్లామిక్ పాలనకు పీఎఫ్‌ఐ కుట్ర చేసిందన్న ఆరోపణలకు సాక్ష్యాలు కూడా దొరికాయి..మంచి పనే.. మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే గ్రూపులను బ్యాన్ చేసేయడం కరెక్టే.. కర్ణాటక కాంగ్రెస్ కూడా అధికారంలోకి వస్తే అదే చేస్తానంది. అయితే తప్పుడు పనులు చేస్తే బజరంగ్ దళ్‌ని బ్యాన్ చేస్తానని చెప్పింది. అయితే ఇక్కడే బీజేపీకి మండింది. బజరంగ్ దళ్‌ను పీఎఫ్‌ఐతో పోల్చడం దేశాన్నిముందుండి నడిపిస్తున్న లీడర్లకు కూడా నచ్చలేదు..హనుమంతుడి భక్తులను జైల్లో పెట్టాలని కాంగ్రెస్ చూస్తున్నదంటూ ప్రచారం మొదలుపెట్టారు.. ఈ రచ్చ కాస్త దేశమంతా పాకింది.. తెలంగాణలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మరో అడుగు ముందుకేశాడు. ఆంజనేయుడి భక్తులను కాదు.. హనుమంతుడిని చెరసాలలో పెడతారా అంటూ ప్రశ్నించారు.
బజరంగ్ దళ్ అంటే జనాలకు తెలిసిందదే:
బజరంగ్ దళ్ అంటే లవర్స్ డే నాడు పార్కుల్లో కనపడిన వారికి పెళ్లిళ్లు చేసే సంస్థగానే చాలా మందికి తెలుసు. పేరులో బజరంగ్ అనే పదం ఉందని.. వాళ్లని ఆంజనేయుడి భక్తులకు జనాలు భావించిన సందర్భాలు వేల మీద కూడా లెక్కపెట్టలేం.. ఎందుకంటే దేశ ప్రజల మనసులో హనుమంతుడి స్థానం వేరు..చాలా మంది భక్తులకు ఆయనో స్ఫూర్తి..! అలాంటి ఆంజనేయుడిని కూడా వదల్లేదు.. ఆయన పేరుమీదే ఓట్లు రాబట్టుకునే పనిలో పడిపోయాయి ప్రధాన పార్టీలు. బజరంగ్ దళ్‌ని బ్యాన్ చేస్తామంటే దేవుడిని బ్యాన్ చేసినట్లు ప్రచారం చేస్తున్నాయి.. ఇది ఇలానే కొనసాగితే.. భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే.. పేరులో భారతీయ అనే పదం ఉందని.. దేశాన్ని అవమానించినట్లేనని వితండ ప్రచారం మొదలుపెట్టిన పెడతారు.