BRS Party: మూడు నెలల ముందే టికెట్లు.. కేసీఆర్ అసలుకే ఎసరు తెచ్చుకున్నారా?
ఎన్నికలకు మూడు నెలల ముందే సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన నిర్ణయం కారు పార్టీకి మైనస్ పాయింట్ గా మారినా ఆశ్చర్యం లేదని అభిప్రాయపడుతున్నారు.

Has CM KCR created problems by announcing 115 MLA candidates
115 అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను మూడు నెలల ముందే కేసీఆర్ ప్రకటించడాన్ని కొందరు ‘రాకెట్ స్పీడ్’ తో పోలుస్తుంటే.. ఇంకొందరు ‘తొందరపడి ఒక కోయిల ముందే కూసింది’ అని అభివర్ణిస్తున్నారు. ఈ నిర్ణయం కారు పార్టీకి మైనస్ పాయింట్ గా మారినా ఆశ్చర్యం లేదని అభిప్రాయపడుతున్నారు. ఇంత ముందస్తుగా అభ్యర్థులను అనౌన్స్ చేయడమనేది అభ్యర్థులపై ఒత్తిడిని చాలా పెంచుతుందని చెబుతున్నారు. ఈ సుదీర్ఘ వ్యవధిలో నియోజకవర్గాల్లో ఏదైనా ప్రతికూల పరిణామాలు జరిగినా.. ఎవరైనా మరో పార్టీకి జంప్ అయినా అభ్యర్థుల టెన్షన్ పీక్స్ కు చేరుతుందని అంటున్నారు. రాబోయే 100 రోజుల టైంలో తమకు అభ్యర్థులు ఎంతమేరకు అందుబాటులో ఉంటున్నారు ? తమ పనులు ఎంతమేరకు చేస్తున్నారు ? సంక్షేమ పథకాల అమలు ఎలా జరుగుతోంది ? అనే అంశాలను ఆయా నియోజకవర్గాల ప్రజలు నిశితంగా పరిశీలించే ఛాన్స్ ఉంది. దాని ఆధారంగా ఎన్నికల్లో తీర్పు వస్తుంది. కాబట్టి ఈ 100 రోజుల్లో ప్రజలను మెప్పించేలా నడుచుకోవాలనే ఒత్తిడి బీఆర్ఎస్ క్యాండిడెట్స్ ను వెంటాడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
విపక్షాలు అలర్ట్ అయితే.. సీన్ రివర్స్
ఈ పరిణామాలను.. రాబోయే 100 రోజుల టైంను.. విపక్షాలు సమర్ధంగా వినియోగించుకునేలా ప్రణాళికను రెడీ చేసుకుంటే బీఆర్ఎస్ కు చెమటలు పట్టడం ఖాయమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల అక్రమాలు, నేర చరిత్ర, ప్రజలతో వారికున్న సంబంధాలు, హామీల అమలులో వైఫల్యం వంటి వివరాలను సేకరించి ప్రతిపక్షాలు బలంగా జనంలోకి వెళితే బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వొచ్చని రాజకీయ పండితులు సూచిస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకోని సామాజిక వర్గాలపై ఫోకస్ చేస్తే ప్రతిపక్ష పార్టీలకు కచ్చితంగా కలిసి వస్తుందని అంటున్నారు. కేసీఆర్ ప్రకటించిన 115 స్థానాల్లో చాలావరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వారంతా సుదీర్ఘ కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్నందున సహజంగానే కొంత ప్రజా వ్యతిరేకత ఉంటుంది. దానిపైనా విపక్షాలు వర్క్ ఔట్ చేసే ఛాన్స్ ఉంది.
నిరాశలో ఉన్న వందలాది మంది.. ఏం చేస్తారు ?
వీటన్నింటిని మించిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. బీఆర్ఎస్ టికెట్ కోసం ట్రై చేసి నిరాశచెందిన కీలక లీడర్లు. వీరిని తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్, బీజేపీలో ఇప్పటికే బిజీగా ఉన్నాయి. దీనిపై ఎంత ఫోకస్ చేస్తే.. విపక్షాలకు అంత ప్లస్ , బీఆర్ఎస్ కు అంత మైనస్ అవుతుందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. టికెట్స్ కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టికెట్ ఆశించి భంగపడ్డ వందలాది మంది సీనియర్ నేతలను శాంతింపజేసేందుకు కేసీఆర్ అండ్ టీమ్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినప్పటికీ.. ఆశించిన రేంజ్ లో ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు. దీన్ని అడ్వాంటేజ్ గా మలుచుకునేందుకు విపక్షాలు యత్నాలు చేస్తే చాలా నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ అవుతుంది. ఈనేపథ్యంలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ టికెట్స్ కన్ఫామ్ అయిన కొందరు అభ్యర్థులకు బీఫామ్ ను నిరాకరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదని బీజేపీ నేత బండి సంజయ్ ఇటీవల కామెంట్ చేశారు. ఈ అవకాశాన్ని విపక్షాలు అందిపుచ్చుకొని ప్లస్ పాయింట్ గా మార్చకుంటాయా ? కేసీఆర్ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడమే సక్సెస్ అవుతుందా ? వేచిచూద్దాం !!