బీఆర్‌ఎస్‌కు ఎన్నికల టెన్షన్‌ మొదలైందా ? ఓటమి భయంతో ఎమ్మల్సీ ఎన్నికలకు దూరమైందా ?

అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన షాక్‌తో తేరుకోలేకపోయింది బీఆర్ఎస్‌. ఆ తర్వాత పార్లమెంట్‌ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 10, 2025 | 08:15 PMLast Updated on: Feb 10, 2025 | 8:15 PM

Has Election Tension Started For Brs

అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన షాక్‌తో తేరుకోలేకపోయింది బీఆర్ఎస్‌. ఆ తర్వాత పార్లమెంట్‌ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. ఆ పార్టీ ఒక్కటంటే ఒక్క పార్లమెంట్‌ సీటు కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్‌, బీజేపీలు…చెరో 8 లోక్‌సభ సీట్లను సొంతం చేసుకున్నాయి. బీఆర్ఎస్‌ ఆవిర్భావం తర్వాత…తొలిసారి పార్లమెంట్‌లో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఫలితాల నుంచి బీఆర్ఎస్‌ ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే తెలంగాణలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలకు పింక్‌ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. నిజామాబాద్, కరీంగనర్, మెదక్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ స్థానాలకు, వరంగల్, ఖమ్మం, నల్లగొండ టీచర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది.

అసెంబ్లీ, పార్లమెంట్‌, పంచాయత్, మున్సిపల్‌…ఇలా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గెలుపు మాదే అంటూ గులాబీ పార్టీ నేతలు బీరాలు పలికారు. ఏ ఎన్నికలు వచ్చినా దూకుడుగా వ్యవహరించారు బీఆర్ఎస్‌ నేతలు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కారణాలేంటని ప్రత్యర్థులు ఆరా తీస్తున్నారు. పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించకూడదని, ఎవరికీ మద్దతు ఇవ్వకూడదనే నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. ఇటీవల ఆ పార్టీ అధినేత కేసీఆర్‌తో…మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహా ఇతర ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పలువురు పార్టీ నేతల పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే ఎవరినీ పోటీలోకి దించకూడదని కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారు. ఏ అభ్యర్థికి మద్దతు కూడా ఇవ్వవద్దని…నేతలకు చెప్పారు.

ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణాలు ఉన్నట్లు బీఆర్ఎస్‌ పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ఓకే…పరాజయం పాలయితే ఎంటని పునరాలోచనలో పడిందట. మండలి ఎన్నికల్లో ఓడిపోతే…ఉన్న ఇజ్జత్ కూడా పోతుందనే భయం పట్టుకుందట ఆ పార్టీ నేతలకు. అందుకే పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని, వాటి కంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని కారు పార్టీ నేతలు పైకి చెబుతున్నారు. కొందరు ఆశావహులు మాత్రం తమకు అవకాశం ఇవ్వాలని నాయకత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయిందని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనే పరాజయం పాలయింది. ఆ సీటును కాంగ్రెస్‌ గెలుచుకుంది. మిగిలిన 38 మంది ఎమ్మెల్యేల్లో పది మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. 17 లోక్‌సభ స్థానాల్లో ఒక్క సీటుకూడా గెలువలేకపోయింది. తర్వాత జరిగిన నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగులపల్లి రాకేశ్ రెడ్డిని పార్టీ బరిలోకి దించింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న చేతిలో పరాజయం పాలయ్యారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్న బీఆర్ఎస్ మరోసారి ఇబ్బంది పడొద్దనే…పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.