Nijamabad BJP: నిజామాబాద్ లో బీజేపీకి వినయ్ రాజీనామా వెనుక కారణాలు ఇవేనా..
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో వర్గపోరు, ఆధిపత్యపోరు లోలోపల ఎక్కువైపోతోంది. దీనికి కారణాలు ఏవైనా ఇలాంటి పరిస్థితులు బీజేపీకి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందని చెప్పాలి. ధర్మపురి పార్టీలో పెద్ద సమస్యగా మారారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాగైతే తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.
నిజామాబాద్ కేంద్రంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో పలువురు లోకల్ నాయకులకు పొసగడంలేదు. దీని ప్రభావం పార్టీ మీద బలంగా పడుతోంది. ఇతని నియంతృత్వ పోకడలు పార్టీలోని కొందరికి ఆగ్రహం తెప్పించాయి. తాజాగా ఆర్మూర్ లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన పార్టీ ప్రథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను విడుదల చేశారు. దీంతో నిజామాబాద్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అసలే కేసీఆర్ అభ్యర్థుల జాబితాను సిద్దం చేసి రేపో మాపో విడుదలకు సిద్దంగా ఉన్న తరుణంలో ఇలాంటి పరిస్థితులు బీజేపీకి తీవ్ర నష్టం కలిగిస్తాయి. దీనిపై కేంద్ర పెద్దలు ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
వినయ్ దారెటు.?
వినయ్ గత కొంతకాలంగా స్థానికంగా ప్రజల్లో తిరుగుతూ కొంతో గోప్పో మైలేజి సాధించారు. 2018లో ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దాదాపు 20వేల ఓట్లు సాధించగలిగారు. 2023 తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దంగా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందా లేదా అనే అంశం పక్కన పెడితే ఆశావాహుల్లో వినయ్ కూడా ఒకరు. ప్రస్తుతం రాజీనామానంతరం ఏపార్టీలో వెళతారు అనే చర్చ మొదలైంది. ఇతనికి కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రొద్దుటూరి వినయ్ మాత్రం స్పష్టం చేయలేదు. బీఆర్ఎస్ లో ఇప్పటికే బలమైన అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉండటంతో ఆ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగే అవకాశాలు లేనట్టే అని చెప్పాలి.
ధర్మపురితో ఇంకెంత మందికి పడటం లేదు..
ధర్మపురి అరవింద్ ఈ మధ్య కాలంలో పార్టీ పెద్దలకు చెప్పకుండా తనకు కావల్సిన వారిని మండల ఇంఛార్జ్ పదవులు కట్టబెట్టారు. దీంతో స్థానిక నాయకులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. అతని పార్టీ ఆఫీసుపై దాడి కూడా చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు. దీంతో బీజేపీలో స్థానికంగా పనిచేసే క్యాడర్ అసంతృప్తితో ఉంది. ప్రస్తుతం వినయ్ రాజీనామాతో ఆ అసమ్మతి బయటపడింది. బీజేపీ ఇప్పటికైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోక పోతే రానున్న రోజుల్లో చాలా మంది లోకల్ నాయకులు పార్టీ వీడి బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇలగైతే 2024లో అధికారం దక్కేనా.!
ఎంత పెద్ద పార్టీ అయినా.. కేంద్రంలో చక్రం తిప్పినప్పటికీ రాష్ట్రంలో వచ్చే సరికి దీని పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. లోకల్ లీడర్లకు, పార్టీలకు ఒకింత మైలేజ్, సెంటిమెంట్ ఉంటుంది. దీనిని అదునుగా చేసుకొని నాయకులు బలపడుతూ ఉంటారు. అయితే ఇప్పడు బీజేపీలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. దీనికి కారణం స్థానిక నాయకుల మధ్యే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవడమే. వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన చర్యలు తీసుకోవడంలో బీజేపీ విఫలం అవతుందోంది అని చెప్పాలి. ఇలాగే కొనసాగితే 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అటుంచి అభ్యర్థుల కొరతతో పోటీ నుంచి వెనుదిరగవలసి వుంటుంది.
జాతీయ పార్టీల్లో ఇలాంటివి మామూలేనా..
ఇలాంటి లోకల్ రాజకీయాలు కేవలం జాతీయ పార్టీల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. మన్నటి వరకూ కాంగ్రెస్ లో సీనియర్.. జూనియర్ లీడర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వ్యతరేకత ఉండేది. ఇప్పుడు అందరినీ కలుపుకొని పోయి ఎలాగైనా తెలంగాణలో అధికారం సాధిస్తాం అంటోంది కాంగ్రెస్. మన్నటి వరకూ చేసిన తప్పును ఇప్పుడు సరిదిద్దుకొని బాధ్యతాయుతంగా నడుచుకోవడంలో కొంతమేర విజయం సాధించిందని చెప్పాలి. అయితే తాజాగా బీజేపీలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం సరికొత్త చర్చకు కారణం అయింది. మన్నటి వరకూ బండి సంజయ్, ఈటెల రాజేందర్, రఘునందన్ మధ్య కూడా ఇలాంటి వాతావరణమే చోటు చేసుకుంది. కీలక పదవులు కట్టబెట్టే విషయంలో రఘునందన్ బాహాటంగానే కేంద్ర పెద్దలను విమర్శించారు. దీనిపై వెంటనే స్పందించి అతనిపై యాక్షన్ తీసుకోవడంతో మళ్లీ కాస్త శాంతించారు. ఇలాగే ప్రతిసారీ, ప్రతి ఊళ్లో జరిగితే జాతీయపార్టీలపై లోకల్ నాయకుల్లో నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది.
రాష్ట్రఅధ్యక్షుడి మార్పు ప్రభావమేనా..?
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కేంద్రమంతి కిషన్ రెడ్డి తొలిరోజు నుంచే మెరుగైన కార్యాచరణను చేపట్టడంలో విఫలం అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని వర్గాల వారిని కలుపుకుని పోవడంలో కొంత ఆలోచిస్తున్నారని పార్టీలో ఒకవర్గం వాదన. తనకు అనుకూలమైన వారితోనే మీటింగులు, చర్చలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని పార్టీలో కొందరు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. బండి సంజయ్ ఉన్నప్పుడు చేరికలు ఉంటే.. కిషన్ రెడ్డి నాయకత్వలో పార్టీ వీడి పోవడాలే దీనికి నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ వ్యాప్తంగా కలియతిరిగి ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది. ఎవరు ఎవరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పార్టీకి జెండా మోసేవారు ఎవరు. వారికి కావల్సిన కనీస అవసరాలు ఏంటి అని చూసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఒక వర్గం కోడైకూస్తుంది. రాష్ట్రస్థాయి నాయకుడు పట్టించుకోక పోవడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటో చేసుకుంటున్నాయని రాజకీయాలన దగ్గరి నుంచి గమనిస్తున్న కొందరు చెబుతున్నారు.
T.V.SRIKAR