యూఎస్ వీసా అపాయింట్‌మెంట్ రద్దైందా….?
భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం 2వేల వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. అపాయింట్‌మెంట్ విధానంలో ఉన్న చిన్న లోపాన్ని అడ్డుపెట్టుకుని బాట్స్ ద్వారా ఈ అప్లికేషన్స్ వేశారని గుర్తించినట్లు ప్రకటించింది.

భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం 2వేల వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. అపాయింట్‌మెంట్ విధానంలో ఉన్న చిన్న లోపాన్ని అడ్డుపెట్టుకుని బాట్స్ ద్వారా ఈ అప్లికేషన్స్ వేశారని గుర్తించినట్లు ప్రకటించింది. ఏజెంట్లు, ఫిక్సర్లు కలిసి అపాయింట్‌మెంట్లను అమ్ముకుంటున్నారని తేల్చారు అమెరికన్ అధికారులు. అందులో భాగమే ఈ నిర్ణయం. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేస్తే అపాయింట్‌మెంట్‌కే కొన్ని నెలలు పడుతోంది. ఇప్పుడు అప్లయ్ చేస్తే ఈ ఏడాది చివరికో వచ్చే ఏడాది మొదట్లోనో టైమ్ ఇస్తున్నారు. ఇంకా ఆలస్యం అయినా ఆశ్చర్యం లేదు.
అందుకే చాలామంది అంత టైమ్ వేచి చూడలేక ఏజెంట్లను నమ్ముకుంటున్నారు. వారి సాయంతో సాధ్యమైనంత త్వరగా అపాయింట్‌మెంట్లు ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ఏజెంట్లు భారీగానే వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి 30-40వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత బాట్స్ను వినియోగించి స్లాట్ బ్లాక్ చేస్తున్నారు. ఇలాంటి వారికి నెల రోజుల్లోనే అపాయింట్‌మెంట్ దక్కుతుంది. ఈ విషయం అమెరికా ఎంబసీ దృష్టికి వెళ్లడంతో ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టింది. అలాంటి అపాయింట్‌మెంట్లను క్యాన్సిల్ చేసి పారేస్తోంది. అంతేకాకుండా అలాంటి వాటికి సహకరించిన ఏజెంట్ల అకౌంట్లకు షెడ్యూలింగ్ ప్రివిలేజెస్ క్యాన్సిల్ చేస్తోంది.
ఏజెంట్లు బాట్ ద్వారా అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. దీనిపై కంప్లయింట్స్ రావడంతో అమెరికన్ అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించారు. దాదాపు 30మంది ఏజెంట్లు ఇలా తప్పుడు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. తప్పుడు డాక్యుమెంట్లు కూడా సమర్పిస్తున్నట్లు గుర్తించారు. వీసా కన్సల్టెంట్లు, డాక్యుమెంట్ వెండర్లు, పాస్‌పోర్ట్ డెలివరీ సర్వీసులు, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు ఈ రింగ్‌లో భాగమని వెల్లడైంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అమెరికన్ ఎంబసీ అధికారులు ఢిల్లీ పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
తప్పుడు మార్గాల ద్వారా వీసా అపాయింట్‌మెంట్లు పొందిన వారి పరిస్థితి ఇప్పుడు అయోమయంలో పడింది. మళ్లీ అపాయింట్‌మెంట్ ఇస్తారా అంటే డౌటే. ఇలాంటి వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నారు. వీరికి మళ్లీ అపాయింట్‌మెంట్ ఇవ్వరు. ఇచ్చినా అప్లికేషన్‌ను ఒకటికి పదిసార్లు స్క్రూటినీ చేస్తారు. ఏ చిన్న తేడా వచ్చినా వారు ఇక జీవితంలో అమెరికాలో అడుగు పెట్టడం అనుమానమే.
ట్రంప్ సర్కార్ వచ్చిన దగ్గర్నుంచి వీసా రిజక్షన్ రేటు పెరిగిపోతోంది. స్టూడెంట్ వీసాలకు కూడా గ్యారెంటీ లేదు. ఈ పరిస్థితుల్లో ఈ అపాయింట్‌మెంట్ స్కామ్ బయటపడింది. దీంతో అమెరికన్ అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి అప్లికేషన్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తారు. వారికి చిన్న డౌట్ వచ్చినా నిర్దాక్షణ్యంగా రిజక్ట్ చేసేస్తారు. ఎందుకు అన్న దానికి సమాధానం కూడా దొరకదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏజెంట్లను నమ్ముకోకపోతే మంచిది. వారు ఎలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టారో తెలియదు. పైగా ఇప్పుడు బాట్ స్కామ్ బయటకు వచ్చింది. కాబట్టి ఇక తప్పుడు పద్దతులను నమ్ముకోకండి.
వెయిటింగ్ పిరియడ్ ఎక్కువగా ఉన్నా సరే నార్మల్ అపాయింట్‌మెంట్ తీసుకోవడం మంచిది. సబ్మిట్ చేసే ప్రతి డాక్యుమెంట్ ఒరిజనలై ఉండాలి. తప్పుడు సమాచారం ఇవ్వకండి. దానివల్ల ఇక జీవితంలో అమెరికాలో అడుగుపెట్టే అవకాశం లేకుండా చేస్తారు. మాములుగా రిజక్ట్ చేస్తే మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ తప్పుడు పద్దతుల్లో ఎంట్రీకి ప్రయత్నించారని తెలిస్తే పూర్తిగా బ్లాక్ చేసే అవకాశాలూ లేకపోలేదు. ప్రస్తుతం పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ కారణంగా అక్కడ ఉన్నవారికే చెమటలు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా వెళ్లేవారు తప్పుడు పద్దతుల్లో వెళితే మాత్రం వారిని దయ లేకుండా వెనక్కు పంపేస్తారు. కాబట్టి ఫెయిర్ ప్రాక్టీసెస్ బెటర్.