Eetela Rajender: బీజేపీలో ఈటలకు పొగపెడుతున్న సీనియర్లు కాంగ్రెస్‌లో చేరిక ఖాయమైపోయినట్లేనా ?
కాంగ్రెస్‌లానే తయారైంది బీజేపీ తెలంగాణలో ! వాళ్లు రోజూ బయటపడతారు.. వీళ్లు అప్పుడప్పుడు బయటపడతారు అంతే ! మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈటల వర్సెస్ సీనియర్లు అంటూ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పుడు జనాల్లో జరుగుతున్న చర్చ ఇదే. తెలంగాణ బీజేపీ రెండు వర్గాలు విడిపోయింది.
ఒకటి బండి సంజయ్ గ్రూప్.. రెండు ఈటల వర్గం. ఉప్పు నిప్పులా తయారైంది ఈ రెండు వర్గాల మధ్య పరిస్థితి. అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తున్నాయ్. ఇలాంటి పరిస్థితుల మధ్య.. ఈటల ఢిల్లీ పర్యటన సాగింది. ఇది పర్యటన కాదు.. ఒకరకంగా బలప్రదర్శనకు వేదికగా ! బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పిస్తారని ఒకసారి.. ప్రచార కమిటీ బాధ్యతలు ఈటలకు అప్పగిస్తారని ఇంకోసారి.. ఇలా ఆ తర్వాత వినిపించిన లీక్‌లు అన్నీ ఇన్నీ కావు. పార్టీ నేతలు ఈ ప్రచారానికి ఎప్పటికప్పుడు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నా.. లీక్‌లు మాత్రం ఆగడం లేదు.
ఈటల రాజేందర్‌కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగిస్తారంటూ లీక్‌లు బయటకు రావడంతో.. బండి సంజయ్ వర్గంలో టెన్షన్ మొదలైంది. సీనియర్లంతా ఏకం అయ్యారు. రహస్యంగా భేటీ అయ్యారు. ఈటల రాజేందర్‌కు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై వారు అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. తాము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని… ఈటలకు పదవి ఇస్తే, తమకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని చర్చించుకున్నట్లు టాక్. ఇలా ఈటలను కావాలని సీనియర్లు అంతా టార్గెట్ చేస్తున్నట్లు సీన్ కనిపిస్తోంది.
ఒకరకంగా సీనియర్లంతా కలిసి.. ఈటలను పొమ్మనలేక పొగపెడుతున్నట్లు పరిస్థితి తయారైందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. దీంతో తెలంగాణ బీజేపీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఆసక్తి కనిపిస్తోంది. చాలారోజుల ఆలోచనల తర్వాత బీజేపీలో చేరారు ఈటల. ఆ తర్వాత చేరికల కమిటీకి ఆయనను అధ్యక్షుడిగా చేసినా.. ఎందుకో హ్యాపీగా కనిపించలేదు ఆయన ! బండి సంజయ్‌తో పాటు ఆయన వర్గంతో ఎప్పుడూ పేచీనే కనిపించింది. ఇప్పుడు పార్టీలో సీనియర్లంతా ఈటలకు రివర్స్ అయిన పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే ఈటల ప్రయాణం ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది.
ఆ మధ్య పొంగులేటి, జూపల్లిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ఈటల భేటీ అయినప్పుడు.. వాళ్లే రివర్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు. బీజేపీలో ఏముంది.. కాంగ్రెస్‌లోకి వచ్చేయండని ఆహ్వానాలు పంపారు. పార్టీలో సీనియర్లంతా కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్న వేళ.. ఆ ఇన్విటేషన్‌ను ఈటల సీరియస్‌గా తీసుకుంటారా.. కాంగ్రెస్ గూటికి వెళ్తారా అంటే.. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. ఇదంతా ఎలా ఉన్నా.. ఈటల వర్సెస్ సీనియర్లు అంటూ జరుగుతున్న ప్రచారంపై ఖండిస్తున్నారు కొందరు బీజేపీ నేతలు. ఇదంతా కేసీఆర్ చేయిస్తున్న తప్పుడు ప్రచారం అని.. ఇందులో నిజం లేదని.. అంతా కలిసి ఉన్నామని అంటున్నారు. ఏమో.. నిప్పులేనిదే పొగ రాదు మరి నిట్టూరుస్తున్నారు బీజేపీలో పరిణామాలు చూసి చాలామంది.