BJP  : బీజేఎల్పీ లీడర్ ఆయనే!

తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్‌పై సస్పెన్స్‌ వీడడం లేదు. దీనికోసం రాజాసింగ్‌, మహేశ్వర్‌ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరి ప్రత్యేకత వారిదే. ఒకరు సీనియర్ నేత అయితే.. మరొకరు ఎక్కువగా ఎమ్మెల్యేగా గెలిచిన లీడర్.. మరొకరు ఇద్దరు సీఎంలను ఓడించిన ఎమ్మెల్యే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 17, 2023 | 05:11 PMLast Updated on: Dec 17, 2023 | 5:11 PM

He Is The Leader Of Bjp Legislative Party

తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్‌పై సస్పెన్స్‌ వీడడం లేదు. దీనికోసం రాజాసింగ్‌, మహేశ్వర్‌ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరి ప్రత్యేకత వారిదే. ఒకరు సీనియర్ నేత అయితే.. మరొకరు ఎక్కువగా ఎమ్మెల్యేగా గెలిచిన లీడర్.. మరొకరు ఇద్దరు సీఎంలను ఓడించిన ఎమ్మెల్యే. దీంతో బీజేఎల్పీ నేతగా ఎవరికి అవకాశం దక్కబోతుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఐతే శాసనసభాపక్ష నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా… బీజేపీ పక్షాన ఆయనతో సభలో మాట్లాడించారనే చర్చ మొదలైంది. గతంలో రాజాసింగ్ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. తర్వాత ఆయన పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. తర్వాత ఆ స్థానం ఖాళీగా ఉండిపోయింది. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. గోషామహల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించగా.. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి పాల్వాయి హరీష్‌బాబు, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్‌ నుంచి రాకేశ్‌ రెడ్డి, కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి గెలిచారు.

ఇందులో రాజాసింగ్‌, మహేశ్వర్ రెడ్డి మినహా మిగతా వారందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే. మహేశ్వర్ రెడ్డి 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి విజయం సాధించారు. రాజాసింగ్ 2014, 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత బీజేపీ అధిష్టానం ఆయనపై సస్పన్షన్ ఎత్తివేసింది. దీంతో ఆయన గోషామహల్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాజాసింగ్ సీనియర్ ఎమ్మెల్యే అయినప్పటికీ.. తెలుగుభాషపై పట్టు లేకపోవడం, హిందూత్వం తప్ప సమకాలీన అంశాలపై సరైన అవగాహన లేకపోవడం కారణంగా ఆయనకు బీజేఎల్పీ నేతగా అవకాశం ఇవ్వరనే వాదన వినిపిస్తోంది. బీజేపీలో కీలక పదవులన్ని హైదరాబాద్ నగరానికి సంబంధించిన నాయకులకే ఉన్నాయి. మరో పదవిని కట్టబెట్టకపోవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 4స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డికే బీజేఎల్పీ నేతగా ఎక్కువ అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది.