Topstory ఐఏఎస్ ల ఓవరాక్షన్…. ఓ ఆట ఆడుకున్న క్యాట్, హైకోర్టు..

ఒక సాదాసీదా టీచర్ కి బదిలీ అయితే దాన్ని ఆపుకోగలడా? క్లర్కు తాను ఏ ఊర్లో పనిచేయాలో డిసైడ్ చేసుకొని.... గవర్నమెంట్ కి ఆర్డర్ వేయగలడా? కానీ తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్లు ఐఏఎస్లు మాత్రం మేం చెప్పిందే కోర్టులు వినాలి, మేం చెప్పింది గవర్నమెంట్ చేయాలి... మేము ఎక్కడ పని చేయాలనుకుంటామో ... మేమే డిసైడ్ చేసుకుంటాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 17, 2024 | 11:03 AMLast Updated on: Oct 17, 2024 | 11:03 AM

High Court Fire On Telangana Ias Officers

ఒక సాదాసీదా టీచర్ కి బదిలీ అయితే దాన్ని ఆపుకోగలడా? క్లర్కు తాను ఏ ఊర్లో పనిచేయాలో డిసైడ్ చేసుకొని…. గవర్నమెంట్ కి ఆర్డర్ వేయగలడా? కానీ తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్లు ఐఏఎస్లు మాత్రం మేం చెప్పిందే కోర్టులు వినాలి, మేం చెప్పింది గవర్నమెంట్ చేయాలి… మేము ఎక్కడ పని చేయాలనుకుంటామో … మేమే డిసైడ్ చేసుకుంటాం.2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి, ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాల్సిన ఐపీఎస్లు తమకు ఇష్టమైన చోటే ఉంటామని భీష్మించు కూర్చున్నారు. చివరికి క్యాట్, హైకోర్టు చివాట్లు పెట్టి వాళ్లని ఆయా రాష్ట్రాలకు పంపాల్సిన పరిస్థితి వచ్చింది.

మేం ఐఏఎస్, ఐపీఎస్ లం. మా లెవెల్ వేరు . మేం బాగా చదువుకున్న వాళ్ళం. మా రూల్స్ వేరు. సామాన్యులు రూల్స్ వేరు. మాకు ఇష్టమైన చోట మేం పని చేస్తాం. ఇష్టమైన ప్రభుత్వంతో మే ఉంటాం. ఇది తెలుగు రాష్ట్రాల్లో కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ధోరణి . తెలుగు రాష్ట్రాల్లో నిబంధ‌న‌లు సామాన్యుల‌కేనా ? ఆల్ ఇండియా స‌ర్వీసెస్ అధికారుల‌కు వ‌ర్తించ‌వా? ఇటీవ‌ల తెలుగు రాష్టాల్లోని బ్యూరోక్రాట్స్ ప్ర‌వ‌ర్త‌న చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఏ మూల అయినా ప‌ని చేయాల్సిన యూపీఎస్సీ అధికారులు… ఒక రాష్ట్రంలోనే ప‌ని చేస్తామ‌ని భీష్మించుకుని కూర్చోవ‌డానికి కార‌ణం ఏంటి? రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కేటాయించిన రాష్ట్రానికి వెళ్లేందుకు ఏఐఎస్‌ల‌కు వ‌చ్చిన ఇబ్బంది ఏంటి? డివోపిటి రూల్స్ ఏఐఎస్‌ల‌కు వ‌ర్తించ‌వా? కోర్టులు మొట్టికాయలు వేస్తే గాని కదలిరా?. ఇటీవ‌ల క్యాడ‌ర్ అలార్ట్‌మెంట్ ప్ర‌కారం ఐఏఎస్లు వారి వారి రాష్ట్రాల‌కు వెళ్లాల‌ని డివోపిటి ఆదేశాలు జారీ చేసింది. అయితే డీఓపీటీ ఆదేశాలు రద్దు చేయాలని కోరుతూ క్యాట్ ను ఆశ్రయించారు ఐఏఎస్ లు. క్యాట్ లో కూడా ఐఏఎస్ లకు ఊరట లభించలేదు. దింతో హైకోర్టులో పిటిషన్ వేశారు. చివరికి హైకోర్టు కూడా ఐఏఎస్ రెండు మందలించి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ వెళ్ళమని ఆదేశించింది.

తెలంగాణ నుంచి ఏపీకి, ఏపీ నుంచి తెలంగాణకు ఐఏఎస్ లు వెళ్లకుండా ఉండేందుకు ఇన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్ర విభజన తరవాత తెలంగాణ, ఎపిల మధ్య ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల విభజన కోసం కేంద్రం ప్రత్యూష్ సిన్హా కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 కింద జనాభా నిష్పత్తి ప్రకారం 58:42 ధామాషా పద్ధతి లో రెండు రాష్ట్రాల మధ్య బ్యూరోక్రాట్ల పంపకాలు జరిగాయి. 2014 లో ఏర్పాటైన ఈ కమిటీ 2015 జనవరి కల్లా నివేదికను కేంద్ర హోంశాఖకు అందించింది. అక్కడి నుంచి అందిన ఆదేశాలతో మార్చిలో తెలంగాణ, ఎపి రాష్ట్రాలు వాళ్ల కేడర్ అధికారులను నోటిఫై చేస్తూ తుది ఉత్తర్వులు ఇచ్చుకున్నాయి. అయితే, కొందరు అధికారుల ఆప్షన్లకు భిన్నంగా ప్రత్యూష్ సిన్హా కమిటీ వారి కేడర్‌ను కేటాయింపులు చేసింది. ఈ మేరకు డిఓపిటికి సైతం ఆదేశాలు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ అప్పట్లోనే ఆ అధికారులు కోర్టు గడప తొక్కారు. ఇరుపక్షాల వాదోపవాదాలు సుదీర్ఘంగా విన్న తరవాత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ తీర్పు ఇచ్చింది. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికల వలన కోర్టు తీర్పు అమల్లో జాప్యం జరిగింది.

2014 రాష్ట్ర విభజన జరిగిన సమయంలో రెండు రాష్ట్రాలకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల కేటాయింపు కోసం ప్రత్యూష్ సిన్హా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధారంగా ఫైనల్‌ కేడర్లను 2015లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక అంతా తప్పుల తడక అని మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆరోపించారు. అప్పటి ఉమ్మడి ఏపి మాజీ చీఫ్ సెక్రటరీ మహంతిని నివేదికలో పొందుపర్చలేదని సోమేశ్ కుమార్ విమర్శించారు. కమిటీలో మొహంతీ సభ్యత్వం పై అప్పట్లో ఆరోపణలు చేశారు. ఏపిలో పని చేస్తోన్న మొహంతీ కూతురు, అల్లుడు ఏపి క్యాడర్ కి చెందిన వారు కనుక మొహంతీకి కమిటిలో వుండకూడదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. జూన్ 1,2014 ముందు తెలంగాణ, ఏపిలో పని చేసిన ఏఐఎస్ లిస్ట్ ఆధారంగానే ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇరు రాష్ట్రాలకు అధికారులను కేటాయించాలని డిమాండ్ చేశారు. పదేళ్ల కిందనే తమకు నచ్చిన అధికారులను ప్రత్యూష్ సిన్హా కమిటీ రాష్ట్రాలకు కేటాయించి ద్వంద వైఖరిని చూపించిందని పలువురు ఐఏఎస్ లు ఆరోపణలు చేసారు. దింతో ఈ కేటాయింపుల్లో అసంతృప్తి వెలువడడం, కొన్ని ప్రాంతాలకు అధికారులు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడం ఒక సమస్యగా నిలిచింది.

తెలంగాణ ఐఏఎస్‌ల క్యాడర్ సంఖ్య 218 కాగా, 170 మంది అధికారులు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. వీళ్లలో ఏపీకి కేటాయించబడి తెలంగాణలో పనిచేస్తోన్న వారిలో వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, వాణీ ప్రసాద్, అమ్రాపాలి కాట, ప్రశాంతిలు పోగా మిగిలేది 165 మంది మాత్రమే. అటు, ఐపిఎస్ కేడర్ 139 , ఎపి క్యాడర్ నుంచి మాజీ డిజిపి అంజన్ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలు తెలంగాణలో పని చేస్తున్నారు. వీళ్లు కూడా ఎపికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ క్యాడర్ 210 మంది కాగా, అక్కడి నుంచి ఐఏఎస్ లు చెరువు హరిచరణ్, శ్రీజన గుమ్మళ్ల, శివశంకర్ లు తెలంగాణకు వెనక్కి రావాల్సి ఉంటుంది. మరోవైపు 1988 బ్యాచ్ ఐఏఎస్ శ్రీలక్ష్మి మొదట తెలంగాణకు కేటాయించబడిన తరువాత ఎపికి ఆప్షన్ పెట్టుకుని వెళ్లిపోయారు. మరో అధికారి ఎస్‌ఎస్ రావత్ ముందుగా ఎపికి అలాట్ అయినా, న్యాయస్థానం తెలంగాణకు కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది. ఆయన తెలంగాణకు తిరిగి రావాల్సి ఉంది.

ఎపిలో చంద్రబాబు తన టీంను కొత్త అధికారులతో కూర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసింది. అందులో భాగంగానే ఆయన డిఓపిటికి లెటర్ రాయడం, అందుకు సానుకూల స్పందన రావడం, ఆ వెంటనే అక్కడి నుంచి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం డిఓపిటి సమాచారం అందించినట్టుగా తెలిసింది. అయితే, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడి తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఢిల్లీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అధికారులతో సమావేశమై, క్యాడర్ వివాదంలో డిఓపిటికి వివరణ ఇచ్చారు. మా ఐఏఎస్‌లను మాకు పంపాలని- డిఓపిటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది కాలం క్రితం లేఖ రాసింది.చాలామంది ఐఏఎస్‌లకు కీలకశాఖలపై పట్టులేదు. అడ్మినిస్ట్రేషన్ పై పట్టు ఉన్న అధికారులను తమకు ఇచ్చేయాలని ఎపి విజ్ఞప్తి చేస్తోంది.

ఎపిలో పని చేస్తోన్న ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను రిలీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎపి ప్రభుత్వం డిఓపిటికి రాసిన లేఖలో పేర్కొంది. దీంతో తెలంగాణలో పని చేస్తోన్న ఎపి కేడర్ అధికారులను అక్కడికి పంపాలని డిఓపిటి తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. రాష్ట్ర విభజన సమయంలో అధికారులను ఏపీ, తెలంగాణకు కేటాయించడం జరిగింది. అయితే, చాలా మంది అధికారులు తక్షణం కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లలేదు. దీనికి ప్రధాన కారణాలు ఉన్నత స్థాయి రాజకీయ ఒత్తిళ్లు, వ్యక్తిగత అభిరుచులు. అంతేకాదు చాలామంది బ్యూరోక్రాట్లు ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో అండకాగడం, వాళ్లు రాజకీయ నాయకుల్లాగే వ్యవహరించడం కూడా ఓ కారణమే.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల ముఖ్యమంత్రి లు, మంత్రులకు బంటులా మారారు ఐఏఎస్లు ఐపీఎస్ లు.

హైదరాబాదులో విలాసవంతమైన జీవితం, అపరిమితమైన అధికారాలు, వీళ్లు ఏం చెప్తే అది నోరు మూసుకొని చేసే నేతలు…. ఇంత కంఫర్ట్ లైఫ్ కి అలవాటు పడిపోయి వేరే రాష్ట్రానికి వెళ్లలేకపోతున్నారు ఐఏఎస్ లో ఐపీఎస్ లు. చివరికి ఎంతకు తెగించారంటే…. డి ఓ పి టి ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయలేదు. డి ఓ పి టి ఆర్డర్ ని క్యాట్ లో ఛాలెంజ్ చేశారు. క్యాట్ ఐఏఎస్ లకు చురకలు వేసి తక్షణం వెళ్లి ఏపీలో చేరాలని ఆదేశించింది. అయినా సరే క్యాట్ ని ధిక్కరించి… హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు కూడా ఐఏఎస్ లకు చివాట్లు పెట్టి వాళ్లకి ఏ రాష్ట్రం కేటాయిస్తే అక్కడికి వెళ్లి చేరాలని ఆదేశించింది. చివరికి ఏపీ నుంచి సృజన, శివశంకర్లు తెలంగాణ వచ్చి సీఎస్కే రిపోర్ట్ చేశారు. అలాగే తెలంగాణ నుంచి రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి కాటా, వాణి ప్రసాద్ మొదలైన వాళ్లంతా ఏపీకి వెళ్లారు. సమాజంలో అన్ని వర్గాలకు ఒక దిక్సూచిగా మార్గదర్శిగా ఉండాల్సిన ఐఏఎస్ , ఐపీఎస్ లు… ప్రజలకు సేవ చేయడానికి ఆల్ ఇండియా సర్వీసెస్ లోకి వచ్చిన బ్యూరోక్రాట్లు ఇలా పవర్ లో ఉన్న లీడర్లతో అంటకాగి తమకు ఇష్టం వచ్చినట్లు ఉంటాం… ఈ దేశంలో వ్యవస్థలు ఎలా దారి తప్పుతున్నాయో చెప్తోంది.