AP Politics: జగన్‌పై బీజేపీ వార్.. ఏపీలో పొలిటికల్ సీన్ మారిపోనుందా.. వైసీపీ ఏం చేస్తుంది..?
ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా విశాఖపట్నం వేదికగా బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జగన్ పాలనపై దారుణంగా విరుచుకుపడ్డారు. వైసీపీపై పోరుకు బీజేపీ సిద్ధమైందా..? మరి జగన్ అండ్ కో ఏం చేస్తారు..?
AP Politics: ఏపీలో జగన్ పాలనపై బీజేపీ అగ్రనేతలు చేసిన విమర్శలు సంచలనం సృష్టిస్తున్నాయి. నిన్నామొన్నటివరకు జగన్ గురించి అస్సలు పట్టించుకోని బీజేపీ పెద్దలు ఒక్కసారిగా జగన్‌ను ఎందుకు టార్గెట్ చేశారు? వైసీపీపై పోరుకు బీజేపీ సిద్ధమైందా..? మరి జగన్ అండ్ కో ఏం చేస్తారు..?
ఢిల్లీలో బీజేపీకి జగన్ పూర్తి సపోర్ట్.. ఏపీలో జగన్‌కు బీజేపీ అండ. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఏపీలో జరుగుతున్న దారుణాలు, అవినీతి, రాజకీయ వేధింపులు, ఆలయాలపై దాడులు.. ఇలా ఒక్కటేంటి.. ఎన్నో అంశాల్లో జగన్ తప్పిదాలున్నా కేంద్రం ఏ రోజూ పట్టించుకోలేదు. జగన్‌కు వ్యతిరేకంగా ఒక్క చర్యా తీసుకోలేదు. కనీసం చిన్న విమర్శ కూడా చేయలేదు. కానీ, ఆదివారం సీన్ మారిపోయింది. ఏపీ సీఎం జగన్ లక్ష్యంగా అమిత్ షా, జేపీ నద్దా, పురందేశ్వరిసహా బీజేపీ పెద్దలు విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ పాలనావైఫల్యాల్ని ఎత్తి చూపారు.
అమిత్ షా ఘాటు విమర్శలు
ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా విశాఖపట్నం వేదికగా బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జగన్ పాలనపై దారుణంగా విరుచుకుపడ్డారు. “జగన్ నాలుగేళ్ల పాలనలో అంతా అవినీతి, కుంభకోణాలు మాత్రమే ఉన్నాయి. జగన్ పాలనలో విశాఖపట్నం అరాచకశక్తులకు అడ్డాగా మారింది. విశాఖను భూ దందాలు, మైనింగ్ అక్రమాలకు కేరాఫ్‌గా మార్చేశారు. రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. దీనికి జగన్ సిగ్గుపడాలి. కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ అవినీతి క్యాడర్ స్వాహా చేస్తోంది. మోదీ ఇస్తున్న ఉచిత బియ్యంపై జగన్ తన ఫొటో వేసుకుంటున్నారు. కేంద్రం రైతులకు రూ.6 వేలు ఇస్తుంటే వాటిని జగన్ రైతు భరోసా పేరుతో తాను ఇస్తున్నట్లుగా చెప్పుకొంటున్నాడు” అంటూ ఘాటైన విమర్శలు చేశారు. అంతకుముందు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కూడా జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ వైఫల్యం వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో జరగని స్కామ్ లేదన్నారు. దేశంలోనే అతిపెద్ద అవినీతి పార్టీ వైసీపీ అన్నారు. మైనింగ్ స్కామ్, లిక్కర్ స్కామ్, ఇసుక స్కామ్, ఎడ్యుకేషన్ స్కామ్ వంటివన్నీ వైసీపీ చేస్తోందన్నారు. జగన్ వల్లే ఏపీకి పరిశ్రమలు రావడం లేదని బీజేపీ నేత పురందేశ్వరి విమర్శించారు. ఇలా గతంలో ఎప్పుడూ లేనంతగా జగన్, వైసీపీపై బీజేపీ అగ్రనేతలతోపాటు, రాష్ట్ర నేతలు కూడా విమర్శలు చేశారు.
జగన్ వైఖరేంటి?
జగన్‌పైనా, వైసీపీపైనా ఎవరైనా విమర్శలు చేయడం ఆలస్యం.. వైసీపీకి చెందిన కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ్ అమర్‌నాథ్, రోజా వంటి నేతలు ప్రతివిమర్శలతో ఎదురుదాడి చేస్తారు. ప్రత్యర్థులు ఎవరైనా విరుచుకుపడతారు. ఈ దిశగా హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తాయనే సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు బీజేపీ పెద్దలు చేసిన విమర్శల నేపథ్యంలో వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలోలాగా విరుచుకుపడే పరిస్థితి వైసీపీకి లేదు. ఎందుకంటే అక్కడుంది హోంమంత్రి అమిత్ షా. ఆయనపై విమర్శలు చేసే ధైర్యం చేసే నేతలు ప్రతిపక్షాల్లోనే చాలా తక్కువ. ఇక వైసీపీకి అంత సీన్ లేదు. అయితే, బీజేపీ చేసిన విమర్శల్ని తేలిగ్గా తీసుకుంటే ఆ పార్టీకే నష్టం. ప్రజలు అవి నిజమే అనుకుంటారు. పోనీ ఎదరుదాడి చేద్దామంటే అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో బీజేపీపై జగన్ అండ్ కో ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.
రాజకీయం మారుతుందా?
ఇంతకాలం ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన అన్నట్లుండేది. జగన్‌కు బీజేపీ.. బీజేపీకి జగన్.. అవసరమైనప్పుడు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాయి. కానీ, ఇప్పుడు పరిస్తితులు మారిపోయినట్లు కనిపిస్తోంది. జగన్‌పై బీజేపీ ఘాటైన విమర్శలు చేసింది. బీజేపీ ఊరికే అలా విమర్శలు చేయదు. ఏదో ప్రణాళిక ఉంటే తప్ప రాజకీయంగా ఇలాంటి వైఖరి తీసుకోదు. ఇకపై జగన్‌పై బీజేపీ ఇలాగే దూకుడుగా వ్యవహరిస్తుందా? దానికి ఇది సంకేతామా..? ఏపీ రాజకీయం మారబోతుందా..? లేక టీడీపీ, జనసేన కూటమిలో కలిసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందా? అందుకే జగన్‌పై విమర్శలు ప్రారంభించిందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతాయి. నిజంగా బీజేపీ అధిష్టానం, కేంద్ర పెద్దలు జగన్‌కు వ్యతిరేకంగా గళమెత్తితో ఆయన తట్టుకోగలడా అనేది సందేహమే. ఇప్పటికే ఏపీ ప్రజల్లో జగన్ పాలనపై అసంతృప్తి ఉంది. అలాంటిది ప్రతిపక్షాలన్నీ ఒక్కటైతే జగన్‌కు బ్యాండ్ తప్పదు. ఇకపై బీజేపీపై కూడా వైసీపీ విమర్శలు చేయాల్సి రావొచ్చు. అలా చేస్తే జగన్‌పై ఉన్న సీబీఐ కేసులు ఆయనకు గుదిబండగా మారుతాయనడంలో సందేహం లేదు.