Amit Shah: టార్గెట్ బీఆర్ఎస్.. తెలంగాణకు రానున్న అమిత్ షా.. పార్టీలో చేరికలపై ఫోకస్
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలను ఆకర్షించడమే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించబోతుంది.
Amit Shah: తెలంగాణలో ప్రస్తుతం పార్టీకి పరిస్థితులు అనుకూలంగా లేకున్నా బీజేపీ అధిష్టానం మాత్రం ఆశలు వదులుకోవడం లేదు. అధికారమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలను ఆకర్షించడమే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించబోతుంది.
మరోవైపు కాంగ్రెస్ నేతలను కూడా చేర్చుకోవడంపై బీజేపీ దృష్టిపెట్టబోతుంది. ఈ మేరకు రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం పార్టీ కోర్ కమిటీతోపాటు జిల్లాల అధ్యక్షులు, ఎన్నికల నిర్వహణ కమిటీ, మేనిఫెస్టో కమిటీ వంటి అంశాలపై అమిత్ షా చర్చిస్తారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా తన పార్టీ నేతలతోనే కాకుండా.. కొందరు సినీ, రాజకీయ, ఆర్థిక నిపుణులతోనూ అమిత్ షా భేటీ కానున్నారు. అలాగే ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు అమిత్ షాను కలిసిన తర్వాత బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. వీలైతే అమిత్ షా వారికి కండువా కప్పి, నేరుగా పార్టీలోకి ఆహ్వానించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై అమిత్ షా పూర్తి అవగాహనతో ఉన్నారు. పార్టీలో అసంతృప్తులు, అంతర్గత విబేధాలు, తిరుగుబాట్లపై నేతలకు అమిత్ షా గట్టి హెచ్చరిక జారీ చేస్తారని తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా షా నేతలకు వివరించబోతున్నారు. బీఆర్ఎస్‌ను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై నేతలకు తగిన సూచనలు చేస్తారు. బీఆర్ఎస్‌తోపాటు, కాంగ్రెస్‌కు చెందిన అసంతృప్త నేతలను బీజేపీలో చేర్చుకోవడంపై దృష్టిపెట్టాలని రాష్ట్ర నాయకత్వానికి ప్రధానంగా సూచిస్తారు. నిజానికి కొద్ది రోజుల క్రితం ఖమ్మంలో అమిత్ షా భారీ బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. అయితే, వరదలు, మణిపూర్ హింస నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదాపడింది. దీంతో పార్టీ శ్రేణులు నిరాశ చెందకుండా అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్‌లో పర్యటించబోతున్నారు. భవిష్యత్ వ్యూహాలపై సూచనలు చేస్తారు. త్వరలోనే ప్రధాని మోదీ, అమిత్ షా, నద్దాతో బీజేపీ భారీ సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.