Congress Jagga Reddy : జనాన్ని తిడితే ఎలా జగ్గారెడ్డీ ! మన రాత బాగుండాలి గానీ..

తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్‌. ఆహార్యంతో పాటు రాజకీయ వ్యవహారాల్లో కూడా డిఫరెంట్‌ స్టైల్‌ ఆయనది. మాస్ లీడర్ ఇమేజ్‌ ఉన్న జగ్గారెడ్డి.. సంగారెడ్డి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. చివరిగా 2018 ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్‌ఎస్‌ హవాను తట్టుకుని గెలిచిన ఒకే ఒక్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆయన. కానీ.. 2023 వచ్చేసరికి ఫేట్‌ తిరగబడిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 10, 2024 | 12:32 PMLast Updated on: Jan 10, 2024 | 1:14 PM

How Can Jaggareddy Scold The People Our Writing Should Be Good

తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్‌. ఆహార్యంతో పాటు రాజకీయ వ్యవహారాల్లో కూడా డిఫరెంట్‌ స్టైల్‌ ఆయనది. మాస్ లీడర్ ఇమేజ్‌ ఉన్న జగ్గారెడ్డి.. సంగారెడ్డి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. చివరిగా 2018 ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్‌ఎస్‌ హవాను తట్టుకుని గెలిచిన ఒకే ఒక్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆయన. కానీ.. 2023 వచ్చేసరికి ఫేట్‌ తిరగబడిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినా.. సంగారెడ్డి ప్రజలు మాత్రం జగ్గారెడ్డిని తిరస్కరించారు. సమీప ప్రత్యర్థి చింత ప్రభాకర్ 9వేల 297 ఓట్ల తేడాతో ఆయన మీద విజయం సాధించారు. దీంతో లోలోపల తెగ రగిలిపోతున్నారట జగ్గారెడ్డి. రాష్ట్రంలో పార్టీ పవర్‌లో ఉన్నందున ఈసారి గనుక గెలిచి ఉంటే.. ఖచ్చితంగా కేబినెట్‌ బెర్త్‌ దక్కేదనీ.. నియోజకవర్గ ప్రజలు తనకు ఆ అవకాశం లేకుండా చేశారంటూ జనాన్ని నిందించే పని పెట్టుకున్నారట.

ఇంకా చెప్పాలంటే.. అంతా.. మీరే చేశారు.. అధ్యక్షా.. అనకుండా చేశారంటూ జనం మీద అలిగారట మాజీ ఎమ్మెల్యే. కేవలం అలకలతో సరిపెట్టకుండా.. కసిదీరా జనానికి శాపనార్ధాలు కూడా పెడుతున్నారండోయ్‌. అందుబాటులో ఉండను అన్న ఒకే ఒక్క కారణంతో నన్ను ఓడించారు.. ఇక ఇప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళతో ఏం పనులు చేస్తారో చేయించుకోండని నిష్ఠూరాలు ఆడుతున్నారట జగ్గారెడ్డి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక.. ఓ రెండు రోజులు సంగారెడ్డిలో ఉండి కార్యకర్తలను కలిసి వెళ్లిపోయారట. ఇక అంతే.. ఆ తర్వాత పత్తా లేకుండా పోయారంటున్నాయి స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులు. పైగా.. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయబోనని భారీ స్టేట్‌మెంట్స్‌ కూడా ఇచ్చేస్తున్నట్టు తెలిసింది. సంగారెడ్డి ప్రజలు నన్ను రిజెక్ట్ చేయడం కాదు.. నేనే నియోజకవర్గాన్ని తిరస్కరిస్తున్నానంటూ.. సన్నిహితులకు చెబుతున్నారట జగ్గూభాయ్. ఈ ప్రసూతి వైరాగ్యపు మాటలతో సంగారెడ్డి కాంగ్రెస్‌ కేడర్‌లో కన్ఫ్యూజన్‌ పెరుగుతోందంటున్నారు.

ప్రచారం జరుగుతున్నట్టు జగ్గారెడ్డి నిజంగానే ఇకపై సంగారెడ్డికి రారా..? ఇక పోటీ చేయరా అన్న చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. అదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. పార్టీ అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్యేగా ఉండి.. తీరా పవర్‌లోకి వచ్చాక తాను ఓడిపోవడంతో ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కు వెళ్లి అలా మాట్లాడుతున్నారు తప్ప మరోటి కాదన్నది ఆ వాదన సారాంశం. అలాగే ప్రతి సారి సంగారెడ్డిలో శ్రీరామనవమి, దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించే జగ్గారెడ్డి ఈ సారి కూడా చేస్తారా, లేదా అన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి 2018లో గెలిచాకే నియోజకవర్గానికి రాకపోకలు తగ్గించారట మాజీ ఎమ్మెల్యే. గతానికి భిన్నమైన వ్యవహారశైలి కారణంగానే.. ఈసారి జనం ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టారని, పద్ధతి మార్చుకోకుండా.. ఆ మాత్రం దానికి అలకలు గిలకలు అంటే ఎలాగంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. అదే సమయంలో చెరువు మీద అలిగితే నష్టం ఎవరికన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి సంగారెడ్డి మీద జగ్గారెడ్డిది ప్రసూతి వైరాగ్యమా? లేక స్మశాన వైరాగ్యమా అన్నది చూడాలి.