బ్యారేజీని ఢీ కొట్టిన బోటుని బయటికి ఎలా తీశారు? డయల్ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్
11లక్షల క్యూసెక్కుల వరద నీరు మహా వేగంతో దూసుకొస్తుంది. ఆ నీటిలో కృష్ణానది ఒడ్డునున్న 5 భారీ బోట్లు అదే వేగంతో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొన్నాయి. అంతేకాదు బ్యారేజ్ గేట్లకు ఆ బోట్లు అడ్డం పడ్డాయి. ఐదారు టన్నుల బరువున్న నాలుగు బోట్లను బయటకు తీయడానికి 12రోజుల నుంచి ఆపరేషన్ జరుగుతుంది.
11లక్షల క్యూసెక్కుల వరద నీరు మహా వేగంతో దూసుకొస్తుంది. ఆ నీటిలో కృష్ణానది ఒడ్డునున్న 5 భారీ బోట్లు అదే వేగంతో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొన్నాయి. అంతేకాదు బ్యారేజ్ గేట్లకు ఆ బోట్లు అడ్డం పడ్డాయి. ఐదారు టన్నుల బరువున్న నాలుగు బోట్లను బయటకు తీయడానికి 12రోజుల నుంచి ఆపరేషన్ జరుగుతుంది. రకరకాల ప్రక్రియలతో ప్రయత్నం చేసిన ఒక్క బోటుని కూడా కదపలేకపోయారు. వాటిని ముక్కలు ముక్కలుగా విడగొట్టి బయటికి తీద్దామన్న ప్రయత్నం కూడా విఫలమైంది. చివరికి ఆపరేషన్ H ద్వారా ఒక పెద్ద బోటుని విజయవంతంగా ఒడ్డుకు తీసుకు రాగలిగారు.
ప్రకాశం బ్యారేజిని ఢీకొన్న బోట్లను తొలగించడానికి నానా కష్టాలు పడ్డారు ఇంజనీర్లు.. చివరికి H బ్లాక్ ఆపరేషన్ చేసారు.. H బ్లాక్ ఆపరేషన్ చేయడంలో రెండు భారీ బోట్లను, భారీ ఎక్విప్మెంట్ ను సిద్ధం చేసారు.. మొత్తం ఆపరేషన్ కు 48 గంటల సమయం తీసుకున్నారు ఇంజనీర్లు.. ఎట్టకేలకు H బ్లాక్ ఆపరేషన్ తో ఒక పెద్ద బోటును ఒడ్డుకు చేర్చి సక్సెస్ సాధించారు.. గతంలో తుపాకుల గూడెం వద్ద లాంచీని బయటకు తీయడానికి కూడా ఇదే విధానం సక్సెస్ ఇచ్చింది.. ప్రకాశం బ్యారేజిని ఈనెల మొదట్లో ఐదు బోట్లు ఢీకొట్టాయి.. వాటిలో మూడు బోట్లు భారీగా ఉండటం.. అవి ప్రవాహ వేగం ఎంత ఉన్నా బ్యారేజీ వద్దే చిక్కుకు పోయాయి.. వాటితో బ్యారేజి కి ప్రమాదం పొంచి ఉండటంతో.. ఆ బోట్లను తొలగించాలని నిర్ణయించారు ఇంజనీర్లు.. కానీ బోట్ల తొలగింపుకు మూడు విధానాలను మూడు స్టేజీలలో చేయాలని నిర్ణయించిన ఇంజనీర్లకు.. రెండు విధానాలలో ఫలితం దక్కలేదు.. దాంతో చివరి అస్త్రంగా H బ్లాక్ ఆపరేషన్ ను సిద్ధం చేసారు..
అయితే.. ప్రధానంగా ఒక పెద్ద కర్రకి డోలీ కట్టి నీటిలో మనుషులను, వస్తువులను వరదల సమయంలో సైతం తరలించడం మనం చూసే ఉంటాం.. అలాంటిది.. ఒక నీట మునిగిన బోటును రెండు భారీ బోట్లతో తరలించాలని చేసిన ప్రయత్నమే ఈ H బ్లాక్ ఆపరేషన్… రెండు బోట్లకు ఆరు భారీ ఇనుప బ్లాక్ లను తెచ్చి H ఆకారంలో ఉండేలా వెల్డింగ్ చేసి అమర్చారు.. అయితే ఈ అమరిక మొత్తం చేయడానికే దాదాపు 24 గంటల పాటు 25 మంది శ్రమించారు.. మూడు టీంలుగా బోట్లను తొలగించడానికి పని చేస్తుంటే.. అందులో బెకెమ్ కంపెనీ ఇంజనీర్లు, సీ హార్స్ అండర్ వాటర్ డైవింగ్ టీం, కాకినాడ అబ్బులు టీం ఉన్నారు.. ఈ మూడు టీంలు కలిసి ఒక మాట మీద ఉంటూ ఎక్కడా ఎలాంటి తేడా జరగకుండా H బ్లాక్ ఆపరేషన్ కూడా చేసి సిద్ధం చేసారు.. H బ్లాక్ ఆపరేషన్ లో భాగంగా మొత్తం 15 పుల్లీలను ఒక బోటుకు, 15 పుల్లీలను ఒక బోటుకు వినియోగించారు.
అందులోనూ రెండు చైన్లు ఉంటే.. వాటిలో ఒకటి లోడ్ లాగేందుకు, ఇంకొకటి లోడ్ వేసేందుకు వినియోగించారు.. అండర్ వాటర్ డైవింగ్ టీం నీళ్ళ అడుగున ఆక్సీ ఆర్క్ కటింగ్ చేస్తూ, బోట్ల అడుగున ఉన్న అడ్డంకులను అంచనా వేస్తూ… లింక్ లు విడిపోకుండా పని చేసింది… దాదాపు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక చైన్ పుల్లీ విరిగిపోయింది… ఆ తరువాత 7 గంటల సమయంలో ఇంకొక చైన్ పుల్లీ విరిగిపోయింది… రెండు పుల్లీలను కొత్త పుల్లీలతో మార్చడమే కాకుండా.. మరో రెండేసి పుల్లీలను అదనంగా బోట్లకు తగిలించారు.. దాంతో బోట్ల వద్ద లోడు లాగడానకి మరింత సహకారం అందినట్టయింది… అయితే లోడ్ లాగడంలో బీహార్ టీం తో పాటు, బోటు దిశ మార్చడంలోనూ కాకినాడ అబ్బులు టీం చాలా సహకరించారు..
మరోపక్క ఒక్కొక్క పుల్లీ 15 టన్నుల లోడ్ లాగితే… మొత్తం పుల్లీలు లాగే లోడ్ దాదాపు 250 టన్నులు ఉండేలా చూసుకున్నారు… మరోవైపు బోట్లు ఒకొక్కటి 254 టన్నులు చొప్పున 508 టన్నుల బరువున్నాయి.. అయితే నీళ్ళలో ఉన్న బోటు 80 టన్నుల బరువుంది… ఇలా భారీ బరువులను మోసుకుంటూ కటిక చీకట్లో H బ్లాక్ ఆపరేషన్ ను సక్సెస్ చేసారు ఇంజనీర్లు.. చివరికి ఒక బోటును ఒడ్డుకు చేర్చారు… ఒకరకంగా ఇది పెద్ద అడ్వెంచర్ అని అనుకోవాలి. రెండు బోట్లను నీటిలోకి దింపి… వాటి గడ్డర్లను కింద నీటిలో ఉన్న మరో బూట్ కి తగిలించి పైకి లేపడం అనేది అల్లాటప్ప వ్యవహారం కాదు. ఈ విషయంలో ఆపరేషన్ హెచ్ సమర్థంగా నిర్వహించిన ఇంజనీర్లు అందర్నీ అభినందించాల్సిందే.