Telangana: ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించని బీజేపీ, కాంగ్రెస్.. కేసీఆర్‌ను ఎదుర్కొనేదెలా..?

ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీకైనా కీలకంగా భావించే అభ్యర్థుల ప్రకటనలో కేసీఆర్ ముందున్నారు. నాలుగు నియోజకవర్గాలు మినహా అభ్యర్థులు ఖరారయ్యారు. దీంతో టిక్కెట్లు దక్కిన అభ్యర్థులంతా ప్రచారబరిలో దిగబోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 22, 2023 | 04:33 PMLast Updated on: Aug 22, 2023 | 4:33 PM

How Will Bjp Congress Can Face Brs In Upcoming Elections

Telangana: రాజకీయ వ్యూహాలు రచించడంలో కేసీఆర్‌ను మించిన నేత తెలంగాణలో లేరు. అందుకు తగ్గట్లే, అన్ని పార్టీలకంటే ముందుగా, ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగానే బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించారు. అంటే కేసీఆర్ ఎన్నికల విషయంలో పక్కా ప్రణాళికతో ఉన్నారు. మరైతే.. బీజేపీ, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి..?
ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీకైనా కీలకంగా భావించే అభ్యర్థుల ప్రకటనలో కేసీఆర్ ముందున్నారు. నాలుగు నియోజకవర్గాలు మినహా అభ్యర్థులు ఖరారయ్యారు. దీంతో టిక్కెట్లు దక్కిన అభ్యర్థులంతా ప్రచారబరిలో దిగబోతున్నారు. అయితే, కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల్ని కూడా ఎంపిక చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తై, అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి. అలాగే కొన్ని నియోజకవర్గాలకు అసలు సరైన అభ్యర్థులే లేరు. అందుకే.. ఇంకా ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల్ని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.

బీఆర్ఎస్ టిక్కెట్ దక్కని రేఖా నాయక్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. హరీష్‌రావుపై విమర్శలు చేసిన మైనంపల్లి, ఆయన కుమారుడు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకశాల్ని కొట్టిపారేయలేం. అభ్యర్థుల ఎంపిక విషయంలోనే ఇంకా ముందడుగు పడలేదు. ఇక బీజేపీ పరిస్థితి కూడా ఇంతే. కొద్ది రోజులుగా బీజేపీ సైలెన్స్ అయిపోయింది. పార్టీ కార్యక్రమాలు కూడా కనిపించడం లేదు. పార్టీలో ఒకరిద్దరు నేతలు చేరుతున్నా గతంలోలాగా యాక్టివ్‌గా లేదు. బీజేపీ కూడా అభ్యర్థుల్ని ప్రకటించాలి. దీనికే సమయం పట్టేలా ఉంది. కాంగ్రెస్‌లాగే బీజేపీ కూడా ఇతర పార్టీల్లోని అసంతృప్తుల కోసమే చూస్తోంది. చాలా నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు దొరకడం లేదు. రెండు పార్టీలు ఇంకా అభ్యర్థుల్ని తేల్చడం దగ్గరే ఇబ్బందిపడుతుంటే.. కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించేసి, రంగంలోకి దూకేసింది.
ప్రతిపక్షాల వ్యూహమేంటి..?
అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించడమే కాదు.. మరిన్ని అస్త్రాల్ని ప్రయోగించి, ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలనేది కేసీఆర్ ప్లాన్. ఇప్పటికే రైతు రుణమాఫీతో రైతుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇలాంటి మరిన్ని పథకాల్ని ఎన్నికల్లోపు ప్రకటించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా వరాలజల్లు కురిపించవచ్చు. కొత్త పథకాల్ని కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. త్వరలోనే కేసీఆర్.. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు కేసీఆర్‌ అండ్ కోను ఎదుర్కోవడం పెద్ద సవాలే. ప్రతిపక్షాలు ముందుగా సరైన అభ్యర్థుల్ని రంగంలోకి దించాలి. ఆ తర్వాత మేనిఫెస్టో ప్రకటించాలి. అవి ప్రజల్ని ఆకట్టుకునేలా ఉండాలి. మేనిఫెస్టో అమలును ప్రజలకు వివరించాలి.

ఇంత చేసినా.. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఏ మేరకు ఆదరణ ఉంటుందో చెప్పలేం. అందుకే స్థానిక నాయకత్వంపైనే కాకుండా.. జాతీయ నాయకత్వాన్ని రంగంలోకి దింపాలని రెండు పార్టీలూ భావిస్తున్నాయి. మోదీ, అమిత్ షా, జేపీ నద్దా వంటి నేతలతో ప్రచారం చేయించాలని బీజేపీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వంటి నేతలను రంగంలోకి దించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. భారీ ప్రచార సభలు, ర్యాలీలు, మీడియా, సోషల్ మీడియా ప్రచారాలతో హోరెత్తించేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్‌ వ్యూహాలకు కాంగ్రెస్, బీజేపీలు ఎలాంటి ప్రతివ్యూహాలు రచిస్తాయో చూడాలి.