లేక్‌ వ్యూ అని గొప్పలకు పోయారు.. ఇప్పుడు లబోదిబో అంటున్నారు…

హైడ్రా ఎఫెక్ట్.. హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్‌పై స్ట్రాంగ్‌గానే పడుతోంది. అక్రమ కట్టడాలే టార్గెట్‌గా హైడ్రా దూసుకుపోతోంది. చెరువులను, నాలాలను కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను కూల్చేస్తోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకుని నిర్మించిన ఇళ్లను కూడా నేలమట్టం చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 12, 2024 | 06:51 PMLast Updated on: Sep 12, 2024 | 6:51 PM

Hydra Focus On Lake View

హైడ్రా ఎఫెక్ట్.. హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్‌పై స్ట్రాంగ్‌గానే పడుతోంది. అక్రమ కట్టడాలే టార్గెట్‌గా హైడ్రా దూసుకుపోతోంది. చెరువులను, నాలాలను కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను కూల్చేస్తోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకుని నిర్మించిన ఇళ్లను కూడా నేలమట్టం చేస్తోంది. హైడ్రా దూకుడుతో ఇటు బిల్డర్లు, అటు జనాలు వణికిపోతున్నారు. చెరువుల దగ్గరలో ఉన్న నివాస ప్రాజెక్టుల్లోని ఓనర్లు టెన్షన్ పడిపోతున్నారు. చెరువులకు దగ్గరగా ఉన్న ప్రాజెక్టుల్లో మంచి లేక్ వ్యూ ఉంటుందని ఫ్లాట్ కొనుగోలు చేసిన వారికి.. ఇప్పుడు కంగారు మొదలైంది. ఏ క్షణంలో హైడ్రా బుల్డోజరు తమ ఇంటి వైపు వస్తుందోనని భయపడుతున్నారు.

నిన్నటి వరకు చెరువులకు సమీపంలోని నివాస, వాణిజ్య నిర్మాణ ప్రాజెక్టుల్లోని ఇళ్లకు భారీ డిమాండ్ ఉండేది. మంచి లేక్ వ్యూ తో ఉండే ఫ్లాట్స్, విల్లాలకు ధర కూడా ఎక్కువే. స్వచ్చమైన గాలి, వెలుతురు వచ్చే చెరువులకు దగ్గరగా లేక్ వ్యూ ఇల్లు అంటే ఎవరైనా ఆసక్తి చూపుతారు. అపార్ట్ మెంట్, విల్లాల నిర్మాణ దశలో ఉండగానే పోటీ పడి మరీ లేక్ వ్యూ ఫ్లాట్స్, విల్లాలు కొనుగోలు చేస్తుంటారు. లేక్ వ్యూ ఫ్లాట్స్, విల్లాలకు మిగతా ఇళ్లతో పోలిస్తే ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయినా.. నిన్నటి వరకు ఎంతో ఇష్టంగా లేక్ వ్యూ ఇళ్లను హైదరాబాద్ వాసులు కొనుగోలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

లేక్ వ్యూ ఇల్లు కోరుకున్న వారంతా… ఇప్పుడు ఆ పేరు చెప్తేనే భయపడుతున్నారు. కొత్తగా లేక్ వ్యూ ఇళ్లను కొనడం తర్వాత సంగతి.. ఇప్పటికే లేక్ వ్యూ నివాస, వాణిజ్య ప్రాజెక్టుల్లో ఇల్లు ఉన్నవారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నా.. ఏ క్షణంలోనైనా బుల్డోజరు వస్తుందేమోనని భయపడుతున్నారు. హైడ్రా ప్రభావంతో హైదరాబాద్‌లోని లేక్ వ్యూ ప్రాజెక్టుల్లోని ఫ్లాట్స్, విల్లాలను అమ్ముకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కొత్తగా లేక్ వ్యూ నివాస ప్రాజెక్టుల్లో ఇల్లు కొనేందుకు ఇప్పుడు ఎవరు ముందుకు రావడం లేదని బిల్డర్లు వాపోతున్నారు. లేక్ వ్యూ నివాస ప్రాజెక్టుల్లో ఇల్లు ఉన్నవాళ్లే అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుంటే… ఇంకా కొత్తగా కొనేదెవరని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెరువులకు దగ్గరగా, చెరువులకు ఎదురుగా నిర్మించే నివాస, వాణిజ్య ప్రాజెక్టుల్లో లేక్ వ్యూ తో ఉన్న ఫ్లాట్స్ కు మిగతా ఫ్లాట్స్ కంటే కాస్త ఎక్కువగా ధర ఉంటుంది. మిగతా ఫేస్ లో ఉండే ఫ్లాట్స్ కంటే లేక్ వ్యూ తో ఉండే ఫ్లాట్స్ కు చదరపు అడుగుకు ప్రాజెక్టును బట్టి 300 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ధర ఎక్కువగా ఉంటుందని రియల్ రంగ మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు హైడ్రా ప్రభావంతో ఎక్కువ ధర సంగతి పక్కన పెడితే.. అసలు లేక్ వ్యూ తో ఉన్న ఇళ్లు కొనేవారే కరువయ్యారని తెలిసింది. లేక్ వ్యూ తో ఉన్న ఇళ్లను అమ్ముకునేదెలా అని బిల్డర్లు ఆందోళన చెందుతున్నారన్న చర్చ మార్కెట్లో జోరుగా జరుగుతోంది. హైడ్రా ప్రభావంతో లేక్ వ్యూ ప్రాజెక్టుల్లోని ఇళ్లకు డిమాండ్ పడిపోవడంతో.. హైదరాబాద్ లో లేక్ వ్యూ కాన్సెప్ట్ తో చెరువులకు సమీపంలో నిర్మిస్తున్న సుమారు 25 వేల ఇళ్ల సంగతేంటన్న ప్రశ్న బిల్డర్లను ఆందోళన కలిగిస్తోంది.