వాళ్ళ ఖర్చు నేను పెట్టుకుంటా.. కెసిఆర్ సంచలన నిర్ణయం…?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయ్యేందుకు తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 10, 2025 | 01:50 PMLast Updated on: Mar 10, 2025 | 1:50 PM

I Will Bear Their Expenses Kcrs Sensational Decision

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయ్యేందుకు తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి కూడా కుదుటపడడంతో, కేసిఆర్ రాజకీయంగా దూకుడు పెంచేందుకు పార్టీ నేతలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు పార్టీ చూసి చూడనట్టు ప్రజా పోరాటాలు చేసింది. ఇక ముందు ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే పోరాటాలు జరిగాయో, అదే స్థాయిలో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు గులాబీ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటుంది.

వరంగల్ లో జరగబోయే పార్టీ రజతోత్సవ సభ తర్వాత నుంచి దూకుడు పెంచాలని కేసీఆర్ ప్రణాళిక రెడీ చేసి పెట్టుకున్నారు. ముఖ్యంగా పార్టీ నాయకులు కొంతమంది సైలెంట్ గా ఉంటున్నారని, కేసులు భయంతో బయటకు రావడానికి ఆసక్తి చూపించడం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. దీనితో భయపడే నాయకులను పక్కన పెట్టేందుకు కూడా అధిష్టానం సిద్ధమవుతోంది. నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మార్చేందుకు పార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది.

కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నారు అనే అనుమానాలు కూడా గులాబీ పార్టీ అధిష్టానం వ్యక్తం చేస్తుంది. దీనితో వారందరినీ పక్కన పెట్టేందుకు కేసిఆర్ సిద్ధమవుతున్నవారు. ముఖ్యంగా పార్టీ బలంగా ఉన్న వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో పార్టీ బలహీన పడటానికి కోవర్ట్ నాయకులే కారణం అనే భావనలో ఉన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న మాజీ మంత్రులు కొంతమందిని ఇప్పటికే గులాబీ పార్టీ గుర్తించింది.

వారందరినీ పార్టీ నుంచి సాగనంపాలని కూడా భావిస్తున్నారు. ఉన్న పలంగా పార్టీ నుంచి పంపించడం కాకుండా.. పార్టీ పదవుల నుంచి పక్కకు తప్పించి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నేతల పేర్లను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో హైదరాబాదులో మళ్లీ గులాబీ పార్టీ పాగా వేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్, బిజెపి మధ్య ప్రధానంగా పోరు ఉండే అవకాశం ఉన్న నేపద్యంలో జాగ్రత్తగా రాజకీయం చేస్తోంది గులాబీ పార్టీ.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో.. బిజెపి, టిడిపి.. కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ఎన్నికల్లో బరిలోకి దిగనున్నాయి. దీనితో జాగ్రత్తగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు. కొత్త నేతలను వెతకాలని, రాజకీయాల్లో ఆసక్తి ఉన్న యువ నాయకులకు అవకాశం కల్పించాలని.. కేసీఆర్ ఇప్పటికే పార్టీ కీలక నేతలకు సూచించారు. అవసరమైతే ఆర్థికంగా అండదండలు అందించడానికి పార్టీ సిద్ధంగా ఉందని, ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం.