Congress Party: కర్నాటకలో కాంగ్రెస్ జోష్.. తెలంగాణలో కూడా సీన్ మారుతుందా?
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఒపీనియన్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే జరిగితే పక్కనున్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి బూస్టప్ లభించడం ఖాయం. నైతికంగా బీజేపీని ఎదుర్కొనేందుకు మరింత శక్తి లభిస్తుంది.
కర్ణాటకలో ఈనెల 10న అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. బిజెపి, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అధికారం కోసం గట్టిగానే తలపడుతున్నాయి. అయితే ప్రీపోల్ సర్వేలు కాంగ్రెస్ పార్టీకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాయి. అధికారంలో ఉన్న బిజెపి చాలా వెనుక పడుతుందని, కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందని స్పష్టం చేస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తెలంగాణ రాజకీయాల పైన కూడా ప్రభావం చూపించబోతోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇలాంటి గెలుపు కచ్చితంగా పార్టీకి బూస్టప్ ఇస్తుంది. తమకు తిరుగులేదు అనుకుంటున్న బిజెపిని ఓడించడం ద్వారా కాంగ్రెస్ పై చేయి సాధించడం పార్టీ శ్రేణులకు ఎంతో జోష్ తీసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని, ఇక ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని బిజెపి గట్టిగా ప్రచారం చేస్తుంది.. ఇలాంటి సమయంలో బిజెపి పైన విజయం సాధించడం అంటే కచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీని మరో మెట్టుకు తీసుకెళ్లినట్టే.
దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తామని బిజెపి చెప్తోంది. అయితే కర్ణాటకలోనే కమలాన్ని మట్టి కరిపించడం ద్వారా తెలంగాణలో ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కలుగుతుంది. తెలంగాణలో టిఆర్ఎస్ తర్వాత బిజెపి ఉంటుందని కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోతుందని అంచనాలు ఉన్నాయి. అయితే కర్ణాటకలో గెలవడం ద్వారా తెలంగాణలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కలుగుతుంది. బిజెపిని వెనక్కి నెట్టు బీఆర్ఎస్ తో పోటీపడేందుకు ఛాన్స్ దొరుకుతుంది. పైగా ఆర్థికంగా కూడా తెలంగాణలో పార్టీని ఆదుకునేందుకు కాంగ్రెస్ కు వీలవుతుంది.
అంతర్గత విభేదాలు, అవకాశవాద రాజకీయాలకు నిలయంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ ను ఏకతాటి పైకి తీసుకురావడం అంత ఈజీ కాదు. ఇలాంటి సమయంలో కర్ణాటకలో గెలవడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ పైన కూడా గెలుపు బాధ్యతను పెట్టొచ్చు. గట్టిగా పోరాడితే ఇక్కడ కూడా గెలవగలమనే కాన్ఫిడెన్స్ తీసుకురావచ్చు. అప్పుడు ఇప్పుడున్న దానికంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం కలుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతికేందుకు వీలవుతుంది.