CM YS Jagan: బటన్‌ను నమ్ముకున్న జగన్.. ఎమ్మెల్యేల్లో మాత్రం భయం భయం…ఎందుకని ?

సాధారణంగా ఐదేళ్లు అధికారం పూర్తయ్యే సరికి ప్రభుత్వ వ్యతిరేకత అధికార పార్టీకి తలనొప్పిగా మారుతుంది. ఎన్ని అభివృద్ధి పనులు చేసినా.. సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఏదో ఒక రూపంలో ప్రజల్లో వ్యతిరేకత గూడుకట్టుకుని ఉంటుంది. ఆ వ్యతిరేకతే వచ్చే ఎన్నికల్లో తమకు మళ్లీ అధికారంలోకి రాకుండా చేస్తుందేమోనన్న భయం కూడా అంతర్గతంగా ఉంటుంది. అయితే ఏపీ ముఖ్యమంత్రి మరోసారి అధికారంలోకి వచ్చే విషయంలో చాలా ధీమాగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఓవైపు ప్రతిపక్షాలు ఎంత హడావుడి చేసినా.. చంద్రబాబు లాంటి వాళ్లు జగన్‌ను సైకో అంటూ తిట్టి పోస్తున్నా... ఆయన మాత్రం వణకడం లేదు.. బెదరడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 11, 2023 | 06:20 PMLast Updated on: Jun 11, 2023 | 6:20 PM

If Jagan Who Believes In Welfare Schemes Is Confident About His Victory In The Upcoming Elections That Belief Is Not Visible In The Rest Of The Ministers And Mlas

పంచిన డబ్బులే గెలిపిస్తాయా ?

ఏపీలో వైపీపీ పాలన మొదలైనప్పటి నుంచి జగన్ క్రమం తప్పకుండా చేస్తున్న పని ఏదైనా ఉందా అంటే.. అది బటన్ నొక్కడమే.. నవరత్నాలకు తోడు రకరకాల పథకాల రూపంలో ప్రభుత్వం నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేస్తోంది. లబ్దిదారులకే నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే విధానం ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం దీన్నొక పండగ వాతావరణంలో నిర్వహిస్తూ ఉంటుంది. లబ్దిదారులు ఎంత మంది ? వాళ్ల కోసం కేటాయించింది ఎన్ని కోట్లు అన్నదానితో సంబంధం లేకుండా ఏంతో ఆర్భాటంగా సభలు నిర్వహించి.. అక్కడే స్వయంగా ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కుతున్నారు. ఈ బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి చేరిపోయింది. ప్రతి పథకానికి జగనన్న అన్న ట్యాక్ లైన్ జోడించి ప్రభుత్వం జనాలకు ఇస్తున్న సొమ్ము వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ గెలపోటములను డిసైడ్ చేయబోతోంది .

గెలుపుపై జగన్‌కు ఎందుకంత భరోసా ?

భవవంతుడి చల్లని దీవెన ఉంటే వచ్చే 30 ఏళ్ల పాటు వైసీపీనే అధికారంలో ఉంటుందని మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంలోనే జగన్ చెప్పారు.వైఎస్ఆర్‌ను మించిన సంక్షేమ పాలనన తాను అందిస్తానని.. అందుకు ప్రతిగా ప్రజలెప్పుడూ తనకు అండగా ఉంటారన్నది జగన్మోహన్ రెడ్డి నమ్మకం. అందుకు తగ్గట్టే వివిధ పథకాల కోసం వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఏ కుటుంబానికి ఏఏ పథకం కింద ఎంతెంత వచ్చిందో.. పుస్తకాలు ముద్రించి మరీ చూపిస్తోంది. ప్రజలకు ఇంతగా మేలు చేసే పార్టీగానీ.. ముఖ్యమంత్రి గానీ మరొకరు ఉండరని.. తన ద్వారా నేరుగా లబ్దిపొందిన లక్షలాది మంది ప్రజలు ఓట్ల రూపంలో తనకు మద్దతిస్తారన్నది జగన్ పెట్టుకున్న ఆశ. అందుకే బటన్ నొక్కి నిధులు విడుుదల చేసే కార్యక్రమానికి ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఖజానా ఖాళీ అయినా బటన్ నొక్కాల్సిందే

ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి..సంక్షేమ పథకాల కోసం ఎంత ఖర్చు పెట్టినా.. అడిగేవాళ్లు ఉండరు. కానీ ఏపీ పరిస్థితి అలా కాదు. విభజన నష్టాల నుంచి తేరుకోకముందే సవాలక్షా సమస్యలు ఏపీని చుట్టుముట్టాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాల కోసం వెతుక్కోవడం, చిన్న స్థాయి నిధుల కోసం కూడా కేంద్రం వైపు చూడటం వంటి కారణాల వల్ల ఏపీ ఖజానా ఎప్పుడు లోటుగానే నడుస్తోంది. ఇలాంటి సమయంలోనూ జగన్ ప్రభుత్వం బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తూనే ఉంది. దీనికి కారణం.. ప్రతి ఇంటికి వివిధ పథకాల రూపంలో చేరే ప్రభుత్వ సొమ్మే.. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు బ్యాంకుగా మారుతుందన్న జగన్ నమ్మకం.

YCP-MLA's

YCP-MLA’s

జగన్ సరే మరి ఆ నమ్మకం మంత్రులకు ఎందుకు లేదు ?

వివిధ పథకాల రూపంలో తాను పంచుతున్న డబ్బులే తనను మళ్లీ సీఎంను చేస్తాయని జగన్ నమ్మకంతో ఉన్నా.. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో మాత్రం ఆ భరోసా కనిపించడం లేదు. కేవలం బటన్ నొక్కి నేరుగా పథకాలకు డబ్బులు ఇవ్వడం ఒక్కటే వైసీపీని గెలిపిస్తుందని చాలా మంది ఎమ్మెల్యేలు అనుకోవడం లేదు. గడప గడపకు కార్యక్రమంలో ఇంటింటికి తిరిగినప్పుడు వాళ్లకు గ్రౌండ్ రియాల్టీ ఏంటో అర్థమైపోయింది. రోడ్లు బాగోలేదని..సౌకర్యాలు సరిగా లేవని.. రాజధాని సంగతేంటని..ఇలా అనేక అంశాలపై ఎమ్మెల్యేలనే కాదు..మంత్రులను కూడా ప్రజలు నిలదీసిన, నిలదీస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ఈసారి అధికారం కష్టమేమోనన్న భావన ఎమ్మెల్యేల్లో కనిపిస్తుంది.

అసలు మేం మళ్లీ గెలుస్తామంటారా ?

ఈ మధ్య కాలంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఈ ప్రశ్న ఎక్కువగా వేధిస్తుంది. సాధారణంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే కింగ్‌లు ఉంటారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా వాళ్ల చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అయితే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వీళ్లు వారధిగా ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. నేరుగా ప్రజల ఖాతాల్లోకే పథకాల సొమ్ము వచ్చి చేరుతుండటంతో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల పాత్ర నామమాత్రంగా మారిపోయింది. ప్రభుత్వ పథకాలను అమలు చేసే బాధ్యతను గ్రామ సచివాలయాలకు అప్పగించడంతో నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అజమాయిషీ చెలాయించడానికి లేకుండా పోయింది.

వాళ్ల భయం అందుకేనా ?

పైకి గుంభనంగా కనిపించినా.. తాము ఓడిపోతామేమోనన్న టెన్షన్ చాలా మంది ఎమ్మెల్యేల్లో ఉందని నియోజకవర్గాల్లో వినిపిస్తున్న టాక్. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసి టార్గెట్ 175 పూర్తి చేయాలని జగన్ లక్ష్యంగా పెట్టుకుంటే.. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో మాత్రం ఆ ధీమా కనిపించడం లేదు. కోమటిరెడ్డి, ఆనం వంటి సీనియర్ నేతలే పార్టీ విధానాలు నచ్చక టీడీపీ వైపు చూస్తున్న సమయంలో ఏదో తేడా కొడుతుందన్న ఫీలింగ్ మాత్రం వైసీపీ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. అందుకే వైసీపీకి బాగా పట్టున్న నియోజకవర్గాలను మినహాయిస్తే..ఈసారి టగ్ ఆఫ్ వార్ తప్పదని అధికార పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి లబ్దిదారులే ఓటర్లుగా మారి జగన్‌ను గెలిపిస్తే మాత్రం అది ఏపీ రాజకీయాల్లో సంచలనమే అవుతుంది.