కశ్మీర్‌పై నోరెత్తితే ఇక అంతే.. పాక్‌కు సౌదీ, అమెరికా వార్నింగ్
రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదంతో పాకిస్తాన్ పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. కట్‌చేస్తే.. పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ISIచీఫ్ అసిమ్ మాలిక్ సహా కీలక అధికారులంతా కట్టకట్టుకుని సౌదీ అరేబియా ఫ్లైట్ ఎక్కారు

రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదంతో పాకిస్తాన్ పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. కట్‌చేస్తే.. పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ISIచీఫ్ అసిమ్ మాలిక్ సహా కీలక అధికారులంతా కట్టకట్టుకుని సౌదీ అరేబియా ఫ్లైట్ ఎక్కారు. ఈ పర్యటన అజెండా రియాద్ కాళ్లపై పడైనా సరే కష్టాల నుంచి గట్టెక్కాలన్నదే. కానీ, తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది అన్నట్టుగా జెడ్డాలో అడుగుపెట్టగానే సీన్ రివర్స్ అయిపోయింది. సాయం మాట పక్కనపెడితే.. సౌదీ పెట్టిన కండిషన్లతో పాక్ ప్రధానికి చలిజ్వరం వచ్చినంత పనైంది. పాక్ ముందు సౌదీ అరేబియా 5 డిమాండ్లు పెట్టింది. వాటికి ఓకే చెబితే సాయం చేస్తారు.. చెప్పకపోతే దాని చావుకు దాన్ని వదిలేస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సౌదీ పెట్టిన 5 డిమాండ్లకు ఓకే చెప్పినా.. నో చెప్పినా పాకిస్తాన్‌కు కష్టాలు కామన్. ఈ మొత్తం కథ నడిపించింది అమెరికా. ఇంతకూ, పాకిస్తాన్‌కు సౌదీ పెట్టిన 5 డిమాండ్లు ఏంటి? ఆ డిమాండ్లు పాక్‌పై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక అమెరికా ఆడిన ఆటేంటి? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టుంది పాకిస్తాన్ పరిస్థితి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ భీకర దాడులతో బెంబేలెత్తిపోతున్న వేళ మిత్ర దేశాల సహాయం కోరాలని డిసైడ్ అయింది. అందుకు సౌదీని ఎంచుకుంది. ట్రంప్ ఎంట్రీ తర్వాత అమెరికాతో సౌదీ సంబంధాలు బలపడుతున్నాయి. ఈ సమయంలో సౌదీ సాయం చేస్తే ఆటోమెటిక్‌గా అగ్రరాజ్యం కూడా అండగా నిలుస్తుందని భావించింది. ఈ లెక్కలతోనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. పంజాబ్ సీఎం మరియం నవాజ్, ఆర్మీ, ఐఎస్ఐ అధినేతలు, విదేశాంగ కార్యదర్శిని వెంటబెట్టుకుని సౌదీ అరేబియా ఫ్లైట్ ఎక్కారు. పాకిస్తాన్ లీడర్లు సౌదీ అరేబియాలోని జెడ్డాలో దిగిన తర్వాత సీన్‌లోకి అగ్రరాజ్యం అమెరికా కూడా ఎంటరైంది. దీంతో సౌదీ, అమెరికా యంత్రాంగంతో పాకిస్తాన్ పాలకులు సమావేశం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదంతా పదిరోజుల క్రితం జరిగిన తతంగం. ఆ రోజు ఏం జరిగిందన్నదానిపై అమెరికాకు చెందిన పాకిస్తాన్ జర్నలిస్టు వజహత్ సయీద్ ఖాన్ క్లారిటీ ఇచ్చాడు.
జెడ్డా సమావేశంలో సౌదీ, అమెరికా ముందు పాకిస్తాన్ తన కష్టాలన్నీ ఏకరువు పెట్టింది. తమకు అండగా నిలవకపోతే గట్టెక్కడం కష్టం అని వేడుకుంది. సౌదీ, అమెరికా తమకు అన్ని విధాలుగా సాయం చేయాలని బతిమాలుకుంది. కానీ, పాకిస్తాన్ కన్నీళ్లు చూసి కరిగిపోయే పరిస్థితుల్లో సౌదీ, అమెరికాలు లేవు. ఎందుకంటే, ఆ దేశాలకు పాకిస్తాన్ గురించి క్లారిటీ ఉంది. అందుకే, సాయం కావాలంటే 5 డిమాండ్లకు అంగీకరించాలన్నాయి. వాటిలో మొదటిది ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించడం. ఇజ్రాయెల్‌ను పాక్ ఇప్పటివరకూ గుర్తించలేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఇజ్రాయిల్‌ని గుర్తించాలని అమెరికా కోరుతోంది. పాకిస్తాన్, ఇజ్రాయిల్ మధ్య సంబంధాలను పెంచేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి.. సౌదీ అరేబియాలాగే మెజారిటీ ముస్లిం దేశాలు ఇజ్రాయిల్‌ని ఒక దేశంగా గుర్తించవు. కానీ సౌదీ అరేబియా.. ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఏర్పరచుకుంటే, పాకిస్తాన్ కూడా దానిని అనుసరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే పాకిస్తాన్ ముందు ఈ ప్రతిపాదన పెట్టారు.
ఇక రెండోది ఇరాన్‌లో అధికార మార్పులకు మద్దతివ్వడం. ఇరాన్‌తో పాకిస్తాన్ సంబంధాలు సంక్లిష్టంగానే ఉన్నాయి. ఇరాన్‌లో అమెరికా, సౌదీ అరేబియా కలిసి ఏదైనా పరిపాలన మార్పు ప్రారంభిస్తే పాకిస్తాన్ తన తటస్థతను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలనేది సెకండ్ డిమాండ్. ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఇస్లామాబాద్ మద్దతు ఇస్తుందని అమెరికా, సౌదీ రెండూ ఆశిస్తున్నాయి. అమెరికా, సౌదీకి ఇరాన్ బద్ద శత్రువు. ఇరాన్‌ను దారికి తెచ్చుకుంటేనే పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని నెతన్యాహు, ట్రంప్ భావిస్తున్నారు. ఆ దిశగా ఏ చర్యలకు దిగినా పాకిస్తాన్ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మూడోది చైనాకు దూరం జరగడం. ఇటీవల కాలంలో పాకిస్తాన్, చైనా మధ్య బంధం బలపడుతోంది. ఈ రెండు దేశాలు కలిసి చేస్తున్న కుట్రలు అమెరికాను కూడా చాలా చికాకు పెడుతున్నాయి. కాబట్టి చైనాకు పాకిస్తాన్ దూరం జరగాలనేది అసలు పాయింట్.
ఇక నాల్గవ డిమాండ్ కశ్మీర్.. జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం అన్న నిజాన్ని పాకిస్తాన్ అంగీకరించాల్సిందే అని సౌదీ, అమెరికా తేల్చి చెప్పాయి. కశ్మీర్ ఎపిసోడ్‌లో నోరు మూసుకోవడంతోపాటు భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని పాకిస్తాన్‌కు తేల్చి చెప్పారు. కశ్మీర్ వివాదంలో మొదటినుంచీ సౌదీ మనవైపే ఉంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇస్లామిక్ దేశాలు పాక్‌కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేశాయి. ఆ సమయంలో అజిత్ దోవల్ సౌదీ వెళ్లి యువరాజుతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత కశ్మీర్ వివాదంలో సౌదీ అరేబియా సైలెంట్ అయింది. దానిబాటలోనే UAE, ఖతార్ కూడా చేరిపోయాయి. కశ్మీర్ వివాదంలో మలేసియా, టర్కీ మినహా మిగిలి ఇస్లామిక్ దేశాలు పాక్‌వైపు చూడటమే మానేశాయి. తాజాగా మరోసారి పాకిస్తాన్‌కు అదే క్లారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇక చివరిదైన ఐదవ డిమాండ్ ఉగ్రవాదాన్ని అంతం చేయడం. భారత్‌లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడంతో పాటు ఉగ్రముఠాలకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని పాకిస్తాన్‌కు ఆ రెండు దేశాలు తేల్చి చెప్పాయి. ఈ ఐదు డిమాండ్లకు అంగీకరిస్తే పాకిస్తాన్‌కు సాయం చేస్తాయి. లేకపోతే ఇస్లామాబాద్‌తో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటామని హెచ్చరించాయి.
నిజం ఏంటంటే ఈ 5 డిమాండ్లలో దేనికి ఓకే చెప్పినా పాకిస్తాన్ కష్టాలు రెట్టింపు కావడం ఖాయం. చైనాను కాదనే సీన్ లేదు.. ఇరాన్‌కు ఎదురెళ్లే పరిస్థితీ లేదు.. ఇజ్రాయెల్‌ను గుర్తిస్తే ఇస్లామిక్ దేశాలు ఇస్లామాబాద్‌పై పగబట్టేస్తాయి.. కశ్మీర్ మాట ఎత్తకుండా రాజకీయం చేయడం ఆ దేశ పాలకులకు అలవాటే లేదు. ఇక ఉగ్రవాదంపై పోరాటం అంటారా.. తనను తాను కాపాడుకోవడమే ఇస్లామాబాద్‌కు కష్ట మైపోయింది. అలాంటిది ఉగ్రవాదంపై ఎలా పోరాడుతుంది? ఇప్పుడు పాకిస్తాన్ ముందున్నది ఒకే ఒక్క ఆప్షన్.. చేసిన పాపాలకు శిక్ష అనుభవించడమే.