Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు బేడీలు..పాక్ మాజీ ప్రధాని దుస్థితికి కారణాలేంటి ?

అసంబద్ధ ప్రేలాపనలు మానుకోకుంటే ఇమ్రాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ పాకిస్థాన్ సీనియర్ మిలటరీ అధికారి హెచ్చరించిన కొన్ని గంటలకే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ చేతికి బేడీలు పడటం కాకతాళియమే కావొచ్చు. అయితే రాజకీయాలను పాక్ మిలటరీ ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఊహించిందే.. ఆయన ఏదో ఒక రోజు జైలుకు వెళ్లడం తప్పదని పాక్ ప్రజలకు కూడా ముందే తెలుసు. మాజీ ప్రధానమంత్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని.. ఆయన్ను చంపేందుకు కుట్ర జరుగుతుందని ఆయన పార్టీకి చెందిన నేతలు గొంతు చించుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 9, 2023 | 06:48 PMLast Updated on: May 09, 2023 | 10:22 PM

Imran Khan Arrest

క్రికెట్ పిచ్ వదిలి పొలిటికల్ పిచ్ పైకి వచ్చిన ఇమ్రాన్ మచ్చలేని నాయకుడేమీ కాదు. ఆయన పాక్ రాజకీయాల్లో కడిగిన ముత్యం అంతకన్నా కాదు.. ఇమ్రాన్ ఖాన్ పై నమోదైన కేసుల జాబితా విప్పితే.. అది ఇస్లామాబాద్ నుంచి లాహోర్ అంత దూరముంటుంది. ఒకటా రెండా.. ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిపై ఇన్ని రకాల కేసులు బహుశా ఇతర దేశాల్లో నమోదై ఉండవు. ఇమ్రాన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనపై 121కి పైగా కేసులు నమోదయ్యాయి. అనేక కేసుల్లో ఆయన అరెస్ట్ వారెంట్‌ను కూడా ఎదుర్కొంటున్నారు. చివరకు ఒకానొక కేసులో పాక్ రేంజర్లు ఆయన్ను చుట్టుముట్టాల్సి వచ్చింది.

ఇంతకీ ఇమ్రాన్‌ను ఏ కేసులో అరెస్ట్ చేశారు ?
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌పై ఎన్నో ఎఫ్ఐఆర్‌లు ఉన్నాయి. వాటిలో రెండింటికి సంబంధించి విచారణ ఎదుర్కొనేందుకు ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చారు ఇమ్రాన్ ఖాన్. ఆయన కోర్టు ప్రాంగణంలోకి వచ్చీ రాగానే నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ఆయన్ను అరెస్ట్ చేసింది. వెంటనే ఆయన్ను రావల్పిండిలోని హెడ్ క్వార్టర్స్ ‌కు తరలించారు.

ఎల్ ఖదీర్ యూనివర్శిటీ ప్రాజెక్టు ట్రస్ట్‌ అక్రమాలు
అనేక కేసుల్లో ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్లు జారీ అయినా.. అరెస్ట్ అయింది మాత్రం అల్ – ఖదీర్ ట్రస్ట్ కేసులో మాత్రమే. ఈకేసులో ఇమ్రాన్‌తో పాటు ఆయన భార్య బుష్రా బీబీ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యున్నత ప్రమాణాల్లో విద్యాసంస్థను ఏర్పాటు చేయాలని చాలా ఏళ్ల క్రితం ఇమ్రాన్‌ఖాన్ నిర్ణయించారు. అందుకోసం ఎల్ ఖదీర్ యూనివర్శిటీ ప్రాజెక్టు ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత రియల్ ఎస్టేట్ నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం..డొనేషన్ల పేరుతో చేతులు మారడం చకచకా జరిగిపోయాయి. ఇమ్రాన్‌ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్టుగా దీనిని ఏర్పాటు చేసినా.. విద్యార్థుల నుంచి మాత్రం పెద్దగా స్పందన రాలేదు. యూనివర్శిటీ స్థాయి ఉన్నఈ సంస్థలో చదివేందుకు తొలి రెండేళ్లలో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య కేవలం వందమాత్రమే. ట్రస్ట్ గా రిజిస్టర్ చేసి విద్యార్థుల నుంచి ఫీజులు వసూళ్లు చేయడంతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ చేతిలో ఈ ప్రాజెక్టును పెట్టడంతో దుమారం చెలరేగింది. చివరకు అవినీతి ఆరోపణలతో ఈకేసులో ఇమ్రాన్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అరెస్ట్ చేసింది.

ఇతర కేసుల సంగతేంటి ?
70 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్ ఇకపై ప్రజా జీవితంలో కూడా జైల్లోనే ఎక్కువగా కాలం గడిపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయనపై నమోదైన కేసుల తీవ్రత ఆస్థాయిలో ఉంది. అవినీతి, తీవ్రవాదం, కోర్టుధిక్కారంతో పాటు చివరకు దైవ దూషణ(blasphemy) కేసులను కూడా ఎదుర్కొంటున్నారు ఇమ్రాన్. వీటన్నింటిలో నేరం రుజువైతే…శిక్ష అనుభవించడానికి ఆయన జీవిత కాలం సరిపోదు. 2018 ఆగస్టు నుంచి 2022 ఏప్రిల్ వరకు పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్… విదేశాల నుంచి అందిన కానుకలను ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయకుండా వాటిని అమ్ముకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనినే తోషఖానా కేసుగా పిలుస్తారు. తోషఖానా అంటే ట్రెటరీ అని అర్థం. ఇమ్రాన్ ప్రభుత్వ విభాగానికి చెందాల్సిన కానుకలను అమ్ముకుని వాటి ద్వారా 36 మిలియన్ డాలర్లు తన ఖాతాలో వేసుకున్నట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇమ్రాన్ మాత్రం తాను ప్రభుత్వానికి చెల్లించాల్సింది చెల్లించినట్టు చెబుతున్నారు.

తీవ్రవాద ఆరోపణలు
ప్రధానమంత్రి పదవి పోయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ కంట్రోల్ తప్పి చాలా సార్లు వ్యవస్థలపై వ్యక్తులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రత్యర్థులు, పోలీసులు, న్యాయాధికారులతో పాటు ఓ మహిళా న్యాయమూర్తిపై కూడా మాటల దాడి చేశారు. దీంతో ఆయనపై టెర్రరిజం కేసులు పెట్టారు. వీటిలో నేరం రుజువైతే ఎన్నికల్లో పోటీ చేయడానికి శాశ్వతంగా అనర్హుడవుతారు. వచ్చే ఏడాది జాతీయ ఎన్నికలు జరగనున్న వేళ ఈ కేసు ఇమ్రాన్ మెడకు ఉచ్చుగా మారితే.. ఆయన పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయినట్టే… యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద ఆయనపై నేరం రుజువైతే.. ఉరిశిక్ష కూడా విధించవచ్చు. అంతవరకు వస్తుందా రాదా అన్నది తేల్చాల్సింది పాక్ న్యాయస్థానాలు.

దాడులు..హత్యాయత్నాలు..ఇతర కేసులు
పార్టీ కార్యకర్తలను దాడులకు ప్రేరేపించినట్టు…హత్యలకు పురిగొల్పినట్టు కూడా ఇమ్రాన్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీటికి సంబంధించి క్రిమినల్ కేసులు ఆయనపై నమోదయ్యాయి. అధికారం కోల్పోయిన తర్వాత ఇమ్రాన్ ఇస్లామాబాద్‌లో లక్షలాది మంది మద్దతుదారులతో కలిసి లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఆ సందర్భంగా జరిగిన ఘర్షణలకు సంబంధించి ఆయనపై 17 కేసులు నమోదయ్యాయి.

ఇమ్రాన్‌కు ఇక రాజకీయ భవిష్యత్తు లేదా ?
అన్ని వర్గాల నుంచి ఇమ్రాన్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థులు చేసే రాజకీయ విమర్శలు పక్కన పెడితే.. న్యాయస్థానాలపై పరుష పదాలతో వ్యాఖ్యలు చేయడం.. ఆర్మీలో కొంతమందిని టార్గెట్ చేస్తూ మాట్లాడం వంటివి చూస్తుంటే.. ఇమ్రాన్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. వచ్చే ఏడాది నేషనల్ ఎలక్షన్స్ జరగనున్న సమయంలో ఇమ్రాన్ పార్టీ పీటీఐకి కష్టాలు తప్పేట్టు లేవు
బాధ్యతలు మరిచి ఇతరులపై రాళ్లెస్తే ఇలానే ఉంటుంది.

అధికారమంటే పెత్తనం చెలాయించడం కాదు.. అధికారమంటే బాధ్యతలను నెరవేర్చడం.. కానీ ఇమ్రాన్ ఖాన్ పాక్ రాజకీయాల్లో ఎప్పుడూ అలాంటి పాత్ర పోషించలేదు. ప్రధానిగా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఇమ్రాన్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన పార్టీకే చెందిన నేతలు చెబుతూ ఉంటారు. దీనికి కారణంగా ఇమ్రాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం. తన వైఫల్యాలను కూడా సైన్యంపైనా.. ప్రత్యర్థి పార్టీలపైనా నెడుతూ కాలం వెళ్లబుచ్చిన ఇమ్రాన్ చివరకు తన పొలిటికల్ కెరీర్‌కు తానే గొయ్యి తవ్వుకున్నారు. పాకిస్థాన్ అభివృద్ధికి దోహదపడేలా అన్ని వర్గాలను కలుపుకుని పోవడంలో ఇమ్రాన్ ఖాన్ ఘోరంగా విఫలమయ్యారు. చివరకు అన్ని వర్గాలు ఆయన్ను శత్రువుగా చూసే స్థాయికి తెచ్చుకున్నారు. క్రికెటర్‌గా తనకున్న కరిష్మాను, పాపులారిటీని అడ్డంపెట్టుకుని రాజకీయాల్లోనూ అదే స్థాయిలో వ్యవహరించాలనకున్నారు ఇమ్రాన్. కానీ పాకిస్థాన్ భవిష్యత్తును నిర్దేశించే నేతగా మాత్రం ఎదగలేకపోయారు.