Imran Khan: ఇమ్రాన్ ఖేల్ ఖతం.. తోషఖానా కేసులో జైలు శిక్ష.. ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం

పాకిస్తాన్‌లో మరో సంచలనం. పాక్ మాజీ ప్రధాని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది. తోషఖానా కేసులో ఈ శిక్ష పడింది. తోషఖానా అంటే దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖులు పాక్ ప్రధానికి ఇచ్చే కానుకల్ని తరలించే ఖజానా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 6, 2023 | 02:07 PMLast Updated on: Aug 06, 2023 | 2:07 PM

Imran Khan Arrested After Being Sentenced To Three Years Imprisonment In Toshakhana Case

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తోషఖానా కేసులో ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్ కోర్టు ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది.
పాకిస్తాన్‌లో మరో సంచలనం. పాక్ మాజీ ప్రధాని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది. తోషఖానా కేసులో ఈ శిక్ష పడింది. తోషఖానా అంటే దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖులు పాక్ ప్రధానికి ఇచ్చే కానుకల్ని తరలించే ఖజానా. వివిధ సందర్భాల్లో ఇతర దేశాల ప్రధానులు, ప్రముఖులు ప్రధానికి మర్యాదపూర్వకంగా కానుకలు ఇస్తూ ఉంటారు. అవి తోషఖానాకు చేరాలి. ఒకవేళ ప్రధాని వాటిని కావాలి అనుకుంటే.. ఆ బహుమతులు, కానుకల ధరల్లో యాభై శాతం చెల్లించి వాటిని సొంతం చేసుకోవాలి. కానీ, 2018-‌‌–2022 మధ్యకాలంలో ఇమ్రాన్ పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఈ నిబంధనలు మార్చాడు. తనకు అనుకూలంగా నిబంధనలు మార్చాడు. దీని ప్రకారం.. తను ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చిన కానుకల్ని ఇరవై శాతం నిధులే చెల్లించి, వాటిని దక్కించుకున్నాడు. ఇమ్రాన్ విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆయా దేశాలకు చెందిన అగ్ర నేతలు అనేక బహుమతులు ఇచ్చారు.

ఇలా వచ్చిన బహుమతుల్లో దాదాపు రూ.6 కోట్ల విలువ చేసే బహుమతులని తక్కువ ధరకే సొంతం చేసుకోవడంతోపాటు, వాటిని ఇమ్రాన్ విక్రయించాడనే ఆరోపణలపై అభియోగాలు నమోదయ్యాయి. తన పదవీ కాలంలో వచ్చిన రూ.15.4 కోట్ల విలువైన బహుమతుల్ని రూ.3 కోట్లకే సొంతం చేసుకున్నట్లు అభియోగాలున్నాయి. ఈ బహుమతుల్లో కొన్నింటిని విదేశాల్లో విక్రయించారనే విమర్శలొచ్చాయి. అలాగే ప్రభుత్వ డబ్బులతో ఎన్నో గిఫ్ట్స్ కొనుగులు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై ఇమ్రాన్‌పై కేసులు నమోదయ్యాయి. గత ఏడాది పాక్ ముస్లి లీగ్ నవాజ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2022లో ఇమ్రాన్‌పై కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజా తీర్పు వెల్లడించింది. దీని ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్‌కు మూడళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించారు. అంతేకాదు.. ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. తీర్పు వెలువడిన వెంటనే ఇమ్రాన్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను లాహోర్‌‌లో అరెస్టు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కోట్ లఖ్‌పత్ జైలుకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రాజకీయ సంక్షోభం
ఇమ్రాన్ ఖాన్ అరెస్టు కావడంతో ఆయన పీటీఐ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు ప్రకారం.. ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. దీంతో ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇది మరోసారి పాక్‌లో రాజకీయ సంక్షోభానికి దారితీయొచ్చు. పాక్‌లో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ పోటీ చేయలేడు. నిజానికి పాక్‌లో నాయకులపై అభియోగాలు సాధారణమే. గతంలోనూ పలువురు పాక్ ప్రధానులు, అగ్ర నేతలు కూడా ఇలాంటి అభియోగాలనే ఎదుర్కొన్నారు. వివిధ కేసుల్లో కొందరు జైలు శిక్షలు కూడా అనుభవించారు. పాక్ మాజీ ప్రధాని షాహీద్ సుహ్రవార్డీ, బెనజీర్ భుట్టో, జుల్ఫీకర్ అలీ భుట్టో, పర్వేజ్ ముషార్రఫ్ వంటి నేతలు కూడా జైలు శిక్ష అనుభవించిన వాళ్లే. అయితే, వాళ్లందరికంటే ఇమ్రాన్ ఖాన్‌కు మంచి ఆదరణ ఉంది. దీంతో ఇమ్రాన్ అభిమానులు తీవ్ర నిరసనలకు దిగుతున్నారు.